(It was written on 13-04-2020 on the accasion of Dr B. R. Ambedkar's Birthday)
అపార విజ్ఞానఖని అంబేడ్కర్
నాగటి నారాయణ
హిస్టరీ టీవీ 18 మరియు సీఎన్ఎన్ ఐబీఎన్ ఛానెల్ ద్వారా 20012 జూన్ లో దేశవ్యాప్తంగా ఓ ప్రత్యేక సర్వే నిర్వహించబడింది. "మహాత్మా గాంధీ తరువాత గొప్ప భారతీయులు ఎవరు?" అని దేశ ప్రజలను ప్రశ్నించారు. మొదటి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ, రాజ్యాంగ శిల్పి బాబా సాహెబ్ అంబేడ్కర్, సుప్రసిద్ధ గాయని లతామంగేష్కర్, ప్రముఖ పారిశ్రామికవేత్త జే ఆర్ డీ టాటా, మాజీ రాష్ట్రపతి ఏ పీ జే అబ్దుల్ కలాం, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మరియు వల్లభాయ్ పటేల్ - వీరిలో అందరికంటే గొప్పవారు ఎవరని అడిగారు.వేలాదిమంది నుండి సేకరించిన అభిప్రాయాలను మదింపు చేశారు. జ్యూరీ యిచ్చిన ర్యాంకిగ్స్, పాపులర్ ఓట్లు ద్వారా వచ్చిన ర్యాంకింగ్స్ మరియు మార్కెట్ రీసెర్చ్ అందించిన ర్యాంకింగ్స్ అన్నిటినీ కలిపి తేల్చిన మొత్తం ర్యాంకింగ్సులో మొదటి స్థానంలో డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ నిలిచారు. ఆ ఫలితాన్ని ప్రకటించిన సందర్భంలో ప్రముఖ చరిత్ర పరిశోధకులు రామచంద్ర గుహ మాట్లాడుతూ అంబేడ్కర్ అపార విజ్ఞానఖని, ఆర్ధిక సిద్ధాంతకర్త అని కొనియాడారు. ప్రొఫెసర్ ఏ కే సేన్ మాట్లాడుతూ న్యాయ శాస్త్రం, సామాజిక సమాచారం, ఆర్ధిక విషయాల్లో అంబేడ్కర్ అందెవేసిన చేయి అని, అణగారిన ప్రజల ఆవిర్భవించిన ఆశాజ్యోతి అని ప్రశంసించారు. అందుకేనేమో ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి రాజ్యాంగాన్ని రచించే బృహత్తర బాధ్యత, చారిత్రక కర్తవ్యం ఆయనకే అప్పగించబడింది. ఆయన జీవించిన 65 సంవత్సరాల కాలంలో 50 సంవత్సరాలు పైగా చదవడం, అధ్యనం చేయడంలోనే తరించారు. అధ్యాపక, న్యాయవాద వగైరా ఏ పనిలో వున్నా విద్యార్జన సాగుతూనే వుండేది.Dr B.R. Ambedkar - అపార విజ్ఞానఖని అంబేడ్కర్
1851 ఏప్రిల్ 14 న జన్మించిన భీమారావును తల్లిదండ్రులు భీమాబాయి, రాంజీ సక్పాల్ 1900 సంవత్సరం నవంబర్ 7 వ తేదీన మహారాష్ట్ర సతారాలోని ప్రభుత్వ పాఠశాలలో "భీమారావు రాంజీ అంబవాడ్కర్" పేరుతో చేర్పించారు. 1907 లోనే మంచి మార్కులతో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. ఆ రోజుల్లో మహర్ (షెడ్యూల్డ్ క్యాస్ట్) కులానికి చెందినవారు మెట్రిక్యులేషన్ (నేటి 10 వ తరగతితో సమానం) పాస్ కావడం చాలా గొప్ప విషయం. ఆ సంతోషంతో మెహర్ కులస్థులు అంబేద్కర్ కి బొంబాయిలో ఏర్పాటు చేసిన అభినందన సభలో మాట్లాడిన ప్రముఖ సంఘ సంస్కర్త ఎస్. కే. భోలే మరియు ప్రసిద్ధ రచయిత, ఉపాధ్యాయుడైన కృష్ణాజీ కేలుస్కర్ ఉన్నత చదువులకోసం ప్రోత్సహించారు. ఆ కాలపు ఆచారం ప్రకారం అంబేద్కరుకి 17 ఏళ్ల ప్రాయంలోనే తొమ్మిదేళ్ల వయసున్న రమాబాయితో పెళ్లి చేశారు. 'వివాహం విద్యకు విఘాతం' అనే నానుడిని అధిగమించి అంబేద్కర్ బొంబాయిలోని ఎలిఫినిస్టన్ కాలేజీలో బి.ఏ. చదివి ఆ కళాశాలకే ప్రధముడుగా ఉత్తీర్ణుడయ్యాడు. అంతటితో ఆగకుండా బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్ సహాయంతో ఉన్నత విద్యకై విదేశాలకు వెళ్లారు. విదేశీ విద్యకు నోచుకున్న మొదటి ఎస్సి అభ్యర్థిగా రికార్డ్ సృష్టించారు.
1913 లో కొలంబియా యూనివర్సిటీలో చేరి ఆర్ధిక శాస్త్రం మెయిన్ సబ్జెక్టుగా సోషియాలజీ, హిస్టరీ, ఫిలాసఫీ, పాలిటిక్స్, ఆంత్రోపాలజీ సబ్జెక్టులతో చదివి ఎం.ఏ. పోస్ట్ డ్రాడ్యుయేషన్ పట్టా పొందారు. అదే యూనివర్సిటీ నుండి డాక్టరేట్ కూడా తీసుకున్నారు. 1916 లో లండనులోని స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చేరి ఎం.ఎస్.సి. (ఎకనామిక్స్), డి.ఎస్.సి. (ఎకనామిక్స్) డిగ్రీలు అందుకున్నారు. ఆ కాలంలో అర్ధశాస్త్రంలో మూడు మాస్టర్ డిగ్రీలు సాధించిన ఏకైక వ్యక్తి ఆసియా ఖండంలో అంబేద్కర్ ఒక్కరే. అదే కాలంలో గ్రేస్ ఇన్ విద్యాలయంలో బారిస్టర్-ఎట్-లా (లాయర్ కోర్స్) పూర్తి చేశారు. 1922 లో జర్మనీలోని బాన్ యూనివర్సిటీలో తత్వశాస్త్రం, అర్ధశాస్త్రములను అధ్యయనం చేసారు. కొలంబియా విశ్వవిద్యాలయం తమ పూర్వ విద్యార్థి అంబేద్కర్ భారత రాజ్యాంగ రచనలో చూపిన ప్రతిభకు మెచ్చి 1952 లో డాక్టర్ ఆఫ్ లా (ఎల్.ఎల్.డి.) గౌరవ డాక్టరేట్ యిచ్చి సత్కరించింది. ఆ యూనివర్సిటీలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్టించి ఆ మహనీయుని పేరుతో విద్యాపీఠ్ కూడా ఏర్పాటు చేసింది. చివరిగా 1953 లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ లిటరేచర్ (డి.లిట్.) బిరుదునిచ్చి గౌరవించింది. ఆ విధంగా భారతదేశంలో బహుముఖ విద్యాధికుడుగా, ప్రపంచ గుర్తింపు పొందిన మేధావిగా అంబేద్కర్ అందరి దృష్టిని ఆకర్షించారు.
భారతదేశం స్వాతంత్య్రం సాధించిన 1947 ఆగస్ట్ 15 నాటికి దేశాన్ని పరిపాలించుకొనే సాధనం రాజ్యాంగం లేని విషయం తెలిసిందే. వలసపాలనలోని భారత ప్రభుత్వ చట్టం 1935 ఆధారంగానే పరిపాలన సాగేది. తమ దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించాలని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రాజ్యాంగ నిపుణులు సర్ గౌర్ జెన్నింగ్స్ ని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ అభ్యర్ధించారు. వారి అభ్యర్ధనను సున్నితంగా తిరస్కరించిన జెన్నింగ్స్ "రాజ్యాంగ తయారీ కోసం బయటికి ఎందుకు చూస్తారు? ఆ బాధ్యతను మీలోనే వున్న అసాధారణ న్యాయ కోవిదుడు, రాజ్యాంగ పరిశోధకులు డాక్టర్ అంబెడ్కర్ కి అప్పగించవచ్చు కదా" అని సూచించారు. దానితో రాంజ్యాంగ రచనకు స్వయంకృషి కోసమే పూనుకొన్నారు. అప్పటికే ఇంటీరియం గవర్నమెంటులో లా మినిస్టరుగా వున్న అంబేడ్కర్ చైర్మనుగా మరో ఆరుగురితో కానిస్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీని 1947 ఆగస్టు 29 న నియమించడం జరిగింది. కమిటీ సభ్యులు ఎన్. గోపాలస్వామి అయ్యంగార్, కృష్ణస్వామి అయ్యర్, డాక్టర్ కే. ఎం. మున్షి, సయ్యద్ మొహమ్మద్ సాదుల్లా, బి. ఎల్. మిట్టెర్ మరియు డి. పి. ఖైతాన్. కొద్దికాలం తర్వాత అనారోగ్యంతో రాజీనామా చేసిన మిట్టెర్ స్థానంలో ఎన్. మాధవరావు మరియు 1948 లో చనిపోయిన ఖైతాన్ స్థానంలో టి. టి. కృష్ణమాచారి నియమితులయ్యారు. పేరుకి కమిటీలో ఏడుగురు సభ్యులు వున్నా రాజ్యాంగ రచనా భారం మొత్తం అంబేద్కరే మోయాల్సి వచ్చింది. కమిటీలోని సభ్యుల్లో కొందరు అనారోగ్య సమస్యల వలన, కొందరు వారి ప్రాంత రాజకీయాల్లో కూరుకుపోవడం వలన, కొందరు విదేశాల్లో తిరిగే పనిలో వుండి పని విభజనలో తమకు కేటాయించిన సబ్జెక్టులను కూడా పూర్తిచేయలేక పోయారు. తొంబై శాతం రాంజ్యాంగ రచన ఒక్కడే చేయాల్సి వచ్చింది. అందువలనే రాజ్యాంగ నిర్మాత గౌరవం అంబేద్కరుకే దక్కింది.
డాక్టర్ అంబేద్కర్ అమెరికా, ఇంగ్లాండు వంటి ఆరు దేశాల రాజ్యాంగాలను అవపోసన పట్టారు. మరో పదహారు దేశాల రాజ్యాంగాలపై మంచి అవగాహన వుంది. చట్టాలు, పరిపాలన, జ్యుడీషియరీ వంటి కీలకరంగాల్లో విస్తృతమైన విజ్ఞానంతోనే భారత రాజ్యాంగాన్ని ఒంటిచేత్తో రాయగలిగారు. రాజ్యాంగ ముసాయిదా కమిటీ సమావేశాలు, చర్చలు 114 రోజుల్లేనే పూర్తి అయినవి. కానీ ముసాయిదా రాజ్యాంగాన్ని రచించడానికి అంబేద్కర్ రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అహోరాత్రులు శ్రమించారు. సువిశాలమైన భారతదేశంలోని వివిధ ప్రాంతాలు, భాషలు, మతాలు, విశ్వాసాలు, కులాలు, జాతులు, తెగల ప్రజారాసులకు ఆమోదయోగ్యమైన రాజ్యాంగాన్ని రూపొందించడం ఎంతటి సంక్లిష్టమైన కర్తవ్యమో ఊహించవచ్చు. ఒకవైపు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత పెట్టుబడిదారీ దేశాలు, సోషలిస్టు దేశాలు పోటాపోటీగా సత్వర అభివృద్ధి కోసం చేపట్టిన విధానాలకు ధీటుగా, మరోవైపు వంద సంవత్సరాల పరాయి పాలన నుండి విముక్తిపొందిన దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనువుగా రాజ్యాంగాన్ని రచించడం కత్తిమీద సాము వంటిదే. రాజ్యాంగ నిర్మాణంలో అంబేద్కర్ అకుంఠిత దీక్షా పట్టుదల మరువలేనిదని, ఆయనకు యావత్ దేశం రుణపడి ఉంటుందని రాజ్యాంగ పరిషత్ అధ్యక్షులు, భారతదేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబూ రాజేంద్రప్రసాద్, రాజ్యాంగ రచనా సంఘ సభ్యులు మరియు తొలి రక్షణ శాఖా మంత్రి టి. టి. కృష్ణమాచారి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు మొదలగువారు ప్రకటించారు. భారతదేశ రాజ్యాంగం దక్షిణాఫ్రికా దేశ రాజ్యాంగ రచనకు మార్గదర్శకంగా మేలుచేసిందని ఆ దేశ పితామహుడు, నోబెల్ (శాంతి) బహుమతి గ్రహీత డాక్టర్ నెల్సన్ మండేలా కొనియాడారు. ఒక వ్యాసం ఎంత బాగుంది ఏమి బాగోలేదు అనేది చదివిన వారికంటే రాసినవారికే ఎక్కువ తెలుస్తుంది. అలాగే భారత రాజ్యాంగం బాగోగులు గురించి దాని రచయిత అంబేద్కర్ చెప్పిందే ఆసక్తికరంగా వుంటుంది. "రాజ్యాంగం మంచి చెడులు గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. అది ఎంత బాగుందో అంత బాగోలేదు కూడాను. పాలించే వారు/పార్టీ ఎంత బాగుంటే అది అంత బాగుంటుంది. పాలించే వారు/పార్టీ ఎంత బాగుండకపోతే అది అంత బాగుండదు." అన్నారు. గొప్ప పని చేసినవారు ఎవరైనా ఎంతో కొంత గొప్పగానే చెప్పుకొంటారు. కానీ అంబేద్కర్ నమ్రత, ఔన్నత్యం, సెల్ఫ్ ఎవల్యూషన్ ఎంత గొప్పదో ఆయన ఆధ్వర్యంలో రూపొందిన చారిత్రక గ్రంధం రాజ్యాంగంపై ఆయన అభిప్రాయమే తెలియజేస్తోంది.
ఒకసారి రూపొందిన రాజ్యాంగం ఎంతకాలం అమల్లో వుంటుందనేది దానిని రూపొందించిన వారి సామర్ధ్యంపైన మరియు దేశ అభివృద్దిపైన ఆధారపడి వుంటుంది. ప్రపంచంలోని రాజ్యాంగాల సగటు వయసు పదిహేను సంవత్సరాలు అని, అభివృద్ధి చెందిన దేశాల రాజ్యాంగాల సగటు ఉనికి 33 సంవత్సరాలు అని చికాగో యూనివర్సిటీ అధ్యయనం తెలియజేసింది. కానీ భారత దేశ రాజ్యాంగం వయసు 70 సంవత్సరాలు దాటింది. ఇప్పటికి 104 సవరణలు జరిగినా రాజ్యాంగం మౌలిక స్వరూపం యధాతదంగానే కొనసాగుతోంది. ఇందుకు కారణం ఒకటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అసాధారణ సామర్ధ్యం కాగా రెండు, దేశం ఆశించిన అభివృద్ధిని సాధించకపోవడం కావచ్చు. @
నాగటి నారాయణ ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు 9490300577
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి