13, జులై 2019, శనివారం

What is wrong with onion and garlick in MDMeal?

ఉల్లి, వెల్లుల్లి చేసిన నేరమేమి?
పోషక విలువల్లేని మధ్యాహ్న భోజనం 
                                                        నాగటి నారాయణ 
       పాఠశాల విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం ఇటీవల  పెద్ద వివాదంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించి విద్యార్థులకు పోషక విలువల్లేని చప్పిడి తిండి పెడుతోందని ప్రధాన ఆరోపణ. కర్ణాటకలోని 'రైట్ టు ఫుడ్' మరికొన్ని సామాజిక సంస్థలు కలిసి విద్యార్థులకు ఇష్టం లేని అన్నం పెడుతున్న అక్షయ పాత్రను నిషేధించాలని  కొంతకాలంగా  ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కోడిగుడ్లు ఇవ్వకపోవడమే పెద్ద లోపమనే సమస్య నలుగుతుండగానే కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కూడా వేయడం లేదనే వివాదం పెల్లుబికింది. ఒక దశలో అక్షయ పాత్ర కాంట్రాక్టును రద్దుచేయాలనే నిర్ణయానికొచ్చిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంత సాహసం చేయలేక రాజీ పడింది. ఈ సమస్య తెలుగు రాష్ట్రాల్లో కూడా వున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల వెలుగులోకి రావడంలేదు. లక్షలాది మంది బడి పిల్లలు  అర్ధాకలితో అలమటిస్తూనే వున్నారు, 
      ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు మధ్యాహ్నం మంచి భోజనం పెట్టే సదుపాయం అభివృద్ధిచెందిన వాటితో సహా అనేక దేశాల్లో అమల్లో వుంది. ఈ పథకం భారతదేశంలో భారీ స్థాయిలో అమలు జరగుగుతున్నట్లు యునెస్కో ప్రశంసించింది. 2016-17 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 12.65 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని పన్నెండు కోట్ల మంది పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదికల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1- 5  తరగతుల విద్యార్థులకు 450 కేలరీల శక్తి, 12 గ్రాముల ప్రొటీనులు మరియు 6 - 8 తరగతుల విద్యార్థులకు 700 కేలరీల శక్తి, 20 గ్రాముల ప్రొటీనులు గల ఆహారం అందివ్వాలి. ఆ మేరకు అవసరమైన బియ్యం /గోధుమలు, పప్పులు, కూరగాయలు /ఆకుకూరలు, నూనె/ఫ్యాట్ ఉప్పు, పోపుదినుసులతో వండిన ఆహారాన్ని వేడిగా ఉండగానే వడ్డించాలి. వారంలో మూడు రోజులు భోజనంలో ఉడకబెట్టిన కోడిగుడ్లు వుండాలి. ఎవరు వండాలి, ఎక్కడ వండాలి తదితర విషయాల్లో ఒక్కో రాష్ట్రము ఒక్కో విధంగా వ్యవహరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి. వాటిపైన సుప్రీంకోర్టు 2004 ఏప్రిల్ 20 న స్పష్టమైన తీర్పు యిచ్చింది. బడికి అందుబాటులో వుండే మహిళలతో (ఎస్సి, ఎస్టీ, బిసి వారికి ప్రాధాన్యత) బడి ఆవరణలోనే వంట చేయించాలని, స్థానికంగా లభించే ఆహార పదార్ధాలనే వినియోగించాలని ఆదేశించింది.  కోటిగుడ్డుకు బదులు పాలు లేదా అరటిపండు యిచ్చే విషయాన్ని కూడా జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అంగీకరించలేదు. పోషక విలువలు సమపాళ్లలో వుండి సులభంగా జీర్ణమయ్యే కోడిగుడ్లు యివ్వడమే మంచిదని సిఫార్సు చేసింది. 
      సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలుజరుగుతున్న పాఠశాలల్లో 25 లక్షల మంది పైగా మహిళలు వంట మనుషులుగా మరియు సహాయకులుగా పనిచేస్తున్నారు. స్థానికంగా లభించే కూరగాయలు తదితర ఆహారపదార్ధాలతో పాఠశాలల ఆవరణల్లోనే వంటచేసి వేడిగావున్న భోజనాన్నే విద్యార్థులకు వడ్డించడం జరుగుతోంది. కానీ అక్షయ పాత్ర ఫౌండేషన్ పెడుతున్న భోజనంలో మాత్రం  ప్రభుత్వాల మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆహార సంస్ఠల  సిఫార్సులు ఏవీ అమలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో గల 14,702 ప్రభుత్వ పాఠశాలల్లోని 17.60 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు, త్వరలో మరిన్ని పాఠశాలలకు విస్తరించనున్నట్లు అక్షయ పాత్ర ఫౌండేషన్ ట్రస్టీ మోహన్ దాస్ పాయ్ చెప్పారు. మరోవైపు కర్ణాటక, ఒడిశా హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పోషక విలువల్లేని చప్పిడి తిండి పెడుతున్న అక్షయ పాత్ర వద్దు అనే ఉద్యమాలు నడుస్తున్నవి. ఆ సంస్థ సరఫరా చేసే భోజనంలో కోడిగుడ్లు ఇవ్వకపోవడంతో పాటు ఉల్లి, వెల్లుల్లి కూడా వేయడం లేదు. అదేమని అడిగితె అవి తినకూడదని తిరస్కరిస్తున్నారు. అత్యధిక భారతీయులు దాదాపు అన్ని కూరల్లోనూ వేసుకుతినే ఉల్లి, వెల్లుల్లి పట్ల అక్షయ పాత్ర అసహనం ఆశ్చర్యంగానే వుంది. అవి చేసిన నేరమేంటో?
      ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత వుందంటేనే భారతీయుల ఆహారపుటలవాట్లలో దానికున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. సైన్స్ ప్రకారం ఉల్లిపాయల్లో కేలరీల శక్తి ఎక్కువ, వాటిని  వేయిస్తే యింకా ఎక్కువ. రక్తపోటు, గుండె జబ్బులు, ఆస్తమా, అలెర్జీ, ఇన్ఫెక్షన్ వగైరా జబ్బులను తగ్గించే వైద్యపరమైన ఉపయోగాలు వున్నవి. హెయిర్ మాస్క్ లాగా వాడితే చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు. మిట్టమధ్యాహ్నం ఎక్కువసేపు ఎండలో పనిచేసేవారు  ఉల్లిపాయను నెత్తినపెట్టుకుంటే వడదెబ్బ తగలదని గ్రామాల్లో పెద్దలు చెబుతుంటారు. ఇక వెల్లుల్లి విషయానికొస్తే, వాటిలో ఘాటైన సల్ఫార్ వుంటుంది. అది రక్తప్రసరణ, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తితో శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. కాగా, ఉల్లి వెల్లుల్లి గురించి అక్షయ పాత్ర చెప్పే విషయాలు మరో విధంగా వున్నవి. ఆయుర్వేదం ప్రకారం ఆహారం సాత్విక, రాజసిక, తామసిక అని మూడు భాగాలుగా వుంటుందట. సాత్వికాహారం మంచి గుణాలను పెంచడానికి తోడ్పడితే, రాజసికాహారం చెడు గుణాలను ప్రేరేపిస్తుందట. ఉల్లి, వెల్లుల్లి రాజసిక ఆహారపదార్ధాలట, అవి అజ్ఞానాన్ని కామ క్రోధ రజో గుణాలను పెంచుతాయట. నిష్ఠతో ఉండాలనుకునే వారిని డైవర్ట్ చేస్తుందట. అందుకే బడిపిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో ఉల్లి, వెల్లుల్లి వేయడం లేదని అక్షయపాత్ర అధినేతల వాదన. 
    సన్యాసులకు  సాత్విహారం తగునేమో గాని, సంసారులు కావాల్సిన అందునా ఎదిగే పిల్లలకు పోషక విలువల్లేని చప్పిడి తిండి పెట్టడం ఏమాత్రం క్షమార్హం కాదు. అది విద్యార్థులకే కాదు దేశానికే పెద్ద నష్టం, అరిష్టం. బడిఈడు పిల్లలో 35.7% మంది వుండాల్సిన బరువు కంటే తక్కువగా వున్నారని, 38.4% మంది గిడసబారి పోయారని 2016 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. ఎదిగే పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని వారికిష్టమైన విధంగా వండిపెట్టడం భారతీయ ఆహార సంస్కృతి.  ఉల్లి వెల్లుల్లిని వేయకుండా వండిన రుచీ వాసన లేని రోజూ ఒకేవిధమైన దద్దోజనం తినలేక విద్యార్థులు నలిగిపోతున్నారు. మధ్యాహ్న భోజనం మాటున సాత్వికాహారం పేరుతో హిందూమతాచారాన్ని విద్యార్ధులపై రుద్దడం సహించరాని నేరం. బాలల హక్కుల్లో ముఖ్యమైన ఆహారావు హక్కును హరించడం అమానుషం, రాజ్యాంగ వ్యతిరేకం. ఇంతటి ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం ప్రజలు విస్మరించకూడదు. @ 
- నాగటి నారాయణ, సామజిక విశ్లేషకులు 9490300577

10, జులై 2019, బుధవారం

Will learning outcomes rise wi these draf NEP?

ఈ సిఫార్సులతో చదువొస్తదా?
                                             నాగటి నారాయణ 
      మన దేశంలోని  పాఠశాల విద్యార్థుల్లో సగం మందికి చదువు రావడం లేదనే చర్చ చాలా కాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే.  ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో 52% మందికి ఐదో తరగతి లెక్కలు చేయడం రావడం లేదని, ఐదో తరగతి విద్యార్థుల్లో 45% మంది మూడో తరగతి తెలుగు వాచకాన్ని తప్పులు లేకుండా చదవలేక పోతున్నారని 'యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెపోర్ట్సు'ని మరియు 'నేషనల్ అఛీవుమెంట్ సర్వే'ల నివేదికలు చూస్తూనే వున్నాం. విద్యాహక్కు చట్టం వల్లనే  విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే నిందవేసి ఈ మధ్యనే ఆ చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. కాగా  ఇప్పుడు దేశమంతటా చర్చలో ఉన్న విద్యా విధానం 2019 ముసాయిదాలో మొదటి భాగంలో పాఠశాల విద్య అభివృద్ధి కోసం చాలా సిఫార్సులు చేయబడినవి. వాటితో పాఠశాల విద్యార్థుల్లో  చదువు పెరుగుతదా లేదా అనేది పరిశీలనాంశం. 
                           5 + 3 + 3 + 4   పాఠశాల విద్యా!
      ఇప్పటిదాక పాఠశాల విద్య దేశమంతటా 10+2 సం.లుగా , తెలుగు రాష్ట్రాల్లో (6-14) 10 సం.లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇకనుండి 3-18 సంవత్సరాల వయసును పాఠశాల విద్యా వయసుగా పరిగణించాలని కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం 15 సం.ల విద్యను నాలుగు  (5+3+3+4) భాగాలుగా చేసింది. కొఠారి కమీషన్ సిఫార్స్ చేసిన 10+2 విధానం యాభై ఏళ్ళు గడిచినా సరిగా అమలు జరగలేదు. ఈ కొత్త ఫార్ములా అర్ధం కావడానికి, అమలుకావడానికి ఎంతకాలం పడుతుందో ఏమో!  పిల్లల ఎదుగుదలను బట్టి ఆయా దశలకు అవసరమైన విద్యను అందించాలన్నది. 3-6 సం.ల వయసు వేగవంతమైందని, 85% మెదడు ఆ దశలోనే వికసిస్తుందనే విషయం తెలిసిందే. ఆ వయసు పిల్లలకు జ్ఞానపరమైన, సాంఘిక, భావోద్వేగ విషయాల్లో తగిన (ప్రీ-స్కూల్) తర్ఫీదు ఇస్తేనే అది భవిష్యత్ జీవితానికి పునాదిగా ఉంటుంది. మన దేశంలో ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో తప్ప ప్రభుత్య పాఠశాలల్లో అమల్లో లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. 1968, 1986 విద్యావిధానాల్లో మరియు విద్యాహక్కు చట్టంలో ప్రీ ప్రైమరీ విద్య గురించి చెప్పినా కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరగలేదు. ఇప్పుడు అమలు జరుగుతదనే గ్యారంటీ ఈ సిఫార్సుల్లో కూడా లేదు. ప్రీ -స్కూల్ మరియు 1,2 తరగతుల (3-8 సం.లు) ఫౌండేషనల్ విద్య గరపడానికి పేరెంట్స్, అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రీ ప్రైమరీ స్కూల్స్ బాధ్యత వహించాలని చెప్పారు. ఆటపాటలు,కృత్యాధార, ఆవిష్కరణ పద్ధతుల్లో అక్షరాలు, అంకెలు, కమ్యూనికేషన్ గురించి నేర్పాలన్నారు.  ప్రీ స్కూల్ (3-6 సం.లు) క్లాసులను అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించవచ్చు, ప్రైమరీ స్కూళ్లలో ఏర్పాటు చేయవచ్చు, విడిగా ప్రీ ప్రైమరీ స్కూల్సుగా కూడా నిర్వహించవచ్చంటూ, ఓవరాల్ బాధ్యత మాత్రం విద్యాశాఖదే అన్నారు. ఇంత సంక్లిష్టమైన వ్యవహారం అంత తేలిగ్గా అమలుజరుగుతుందని చెప్పలేము. 
                        లిటరసీ - న్యూమరసీ - క్రియేటివిటీ  
      ఒకటి నుండి  ఐదో తరగతి వరకు అక్షరాస్యత, అంక గణితం విషయాలకు  పునాదులు పడాలి, ప్రతిరోజు మార్నింగ్ సెషన్ లో  చదివించడం, రాయించడం, లెక్కలు చేయించడం చేయించాలి. భాషా వారోత్సవాలు, గణితం వారోత్సవాలు మరియు మేళాలు నిర్వహించాలి. తరగతి గదిలో నేర్చుకునే లెక్కల ఆధారంగా నిజజీవితంలో లెక్కలు చేయించాలి. మిడిల్ మరియు సెకండరీ క్లాసుల్లో కరిక్యులర్, కో-కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ విషయాలతో పాటు ఒకేషనల్ కోర్సులను కూడా మేళవించి బోధించాలి. అందువలన సాంప్రదాయక సబ్జాక్టుల భారాన్ని బాగా తగ్గించాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, డిజిటల్ లిటరసీలతో పాటు ప్రాబ్లెమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్ ఎథికల్ మోరల్ మరియు కరెంట్ ఎఫైర్స్  అంశాలను జోడించాలి.  విద్యార్థుల్లో క్రియేటివిటీ, ఇన్నోవేషన్ పట్ల ఆసక్తిని, జిజ్ఞాసను ప్రేరేపించాలి. ఇందుకనువైన కరిక్యులమ్, పెడగాజిని రూపొందించి, సామర్ధ్యం గల ఉపాధ్యాయులను నియమించాలని ముసాయిదాలో పేర్కొనబడింది.
                   టీచర్స్ - ట్యూటర్స్ - ఎయిడ్స్ - వలంటీర్స్ 
      విద్యార్థులకు చదువు సరిగా రాకపోవడానికి టీచర్స్ కెపాసిటీలో లోపమే కారణమని అందరూ అంటున్నట్లే ముసాయిదా కూడా ఆ మాటే అన్నది. ఉద్యోగం కోసం పొందిన శిక్షణ విద్యార్థులకు వివిధ రూపాల్లో బోధించడానికి, ముఖ్యంగా 3-8 సం.ల వయసు బాలలకు అవసరమైన తర్ఫీదునిచ్చే నైపుణ్యం లేదని వివరించింది. ఉపాధ్యాయుల సంఖ్య 1:30 నిష్పత్తి కంటే తక్కువగా ఉండడం, స్థానిక భాషలో బోధించలేకపోవడంతో పాటు విద్యార్థుల పౌష్టికాహార లోపం కూడా కారణమేనని విచారించింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చేసిన సిఫార్సులు మరింత ఆసక్తికరంగా ఉన్నవి. ఫౌండేషనల్ లిటరసి, న్యూమరసీ సాధనలో వెనకబడిన విద్యార్థులకు అదనపు కోచింగ్ ఇవ్వడానికి 'నేషనల్ ట్యూటర్స్ ప్రోగ్రామ్' ఏర్పాటు చేయాలి. ప్రతిభ గల విద్యార్థులతో వెనకబడిన విద్యార్థులకు కోచింగ్ ఇప్పించాలి. 'రెమిడియల్ ఇనస్ట్రక్షనల్ ఎయిడ్స్ ప్రొగ్రమ్' ఏర్పాటు చేసి కొంతమంది స్థానికులను ఇనస్ట్రక్షనల్ ఎయిడ్స్ (సహాయకులు) గా  సెలెక్ట్ చేసి వారితో వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ క్లాసులు చెప్పించాలి. రిటైర్డ్ టీచర్స్, ఆర్మీ ఆఫీసర్స్, కాలేజీ స్టూడెంట్స్ లో ఆసక్తిగల వారిని వలంటీర్స్ గా సమీకరించి ట్యూటర్స్ గా మరియు ఎయిడ్స్ గా పనిచేయించాలి. వీరంతా విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా, అభ్యసనలో వెనకబడకుండా చూస్తూ ఉపాధ్యాయులకు తోడుగా ఉంటూ ఫౌండషనల్ లిటరసీ మరియు న్యూమరసీ సాధించడానికి సహాయ పడతారని ముసాయిదా పేర్కొన్నది. 
                   స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ 
      సాధారణ విద్యావకాశాలను అందుకోలేని విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా మండళ్లు (ఎస్ ఈ జడ్) ఏర్పాటు చేయాలనేనిది ముసాయిదాలోని మరో ముఖ్యమైన రికమండేషన్. పాఠశాలలో చేరలేని వారు, చేర్పించినా బడిలో కొనసాగలేని వారు ఎక్కువగా ఉండే మారుమూల గిరిజన ఏరియాలు మరియు వెనకబడిన ప్రాంతాల్లోని పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించబడింది. ఈ పథకానికయ్యే ఖర్చులో అధికభాగం కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పింది. ఈక్విటీ మరియు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సామాజికంగా సాస్కృతికంగా వెనకబడిన తరగతులు, ప్రత్యేక అవసరాలు గలవారు మరియు బాలికలకు అవసరమైన విద్యకోసం ప్రత్యేక మోడ్యూల్స్ రూపొందించి వాటి బోధన కొరకు అంగన్వాడీలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ లో పనిచేయడానికి ఉపాధ్యాయులను వెనకబడిన గ్రూపుల నుండే నియమించి సుశిక్షుతులను చేయాలి. ఇరవైఐదు మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులను నియమించాలని నిర్దేశించింది. 
                    మౌలిక సమస్యలకు పరిష్కారమేది?
      విధానం ఏదైనా అమలు జరిగేది ప్రభుత్వ పాఠశాలల్లో తప్ప ప్రైవేట్ స్కూళ్లలో కాదు. ప్రైవేట్ స్కూళ్ళతో పోల్చి  ప్రభుత్వ  పాఠశాలల పట్ల అసంతృప్తిని, అసహనాన్ని వెలిబుచ్చుతున్న విషయం తెలిసిందే. పైన పేర్కొన్న సిఫార్సులన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరగాల్సినవే. అవసరమైన వసతులు, సదుపాయాలు, తగినంతమంది రెగ్యులర్ టీచర్లు, బోధనేతర సిబ్బంది, పుష్కలంగా నిధులు, పటిష్టమైన పర్యవేక్షణ, ప్రభుత్వ బాధ్యత వంటి మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ఆశించడం అసంభవం. కస్తూరిరంగన్ కమిటీ చేసిన సిఫార్సులు చూడ్డానికి బాగానే ఉన్నా కరుడుగట్టిన విద్యారంగ సమస్యలను పరిష్కరించ గలిగేలా లేవు. అందువలన ముప్పై ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సిఫార్సులతో కూడా బడి విద్యార్థులకు చదువొస్తుందని చెప్పలేము. 

9, జులై 2019, మంగళవారం

Why the Intermediate education in Telugu states?


ఎందుకీ ఇంటర్ విద్య అవస్థ?
                                                                          నాగటి నారాయణ
      ఇంటర్మీడియెట్  ఫలితాలు పెద్ద ప్రహసనంగా మారాయి. ఫలితాలు ప్రకటించి రెండు వారాలు గడిచినా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన, ఆవేదన ఆగడం లేదు. మే రెండు నాటికి 25 మంది విద్యార్థులు చనిపోయారు. నాంపల్లిలోని ఇంటర్ పరీక్షల బోర్డ్ విద్యాభవన్ పోలీసుల పహరాతో  తలదాచుకుంటోంది. విద్యార్ధి, యువజన, పేరెంట్స్ తదితర సంఘాలు, సంస్థలు మరియు రాజకీయ పార్టీల ధర్నాలు, ముట్టడులు, నిరసన పోరాట కార్యక్రమాలతో అట్టడుకిపోతోంది. ఆందోళనకారులను అరెస్టులు చేయడం, గోషామహల్ స్టేడియంలో సాయంత్రం వరకు నిర్బంధించడం నిత్యకృత్యమైంది. నిరసన సెగ సచివాలయాన్ని, గ్లోబరీనా సంస్థ కార్యాలయాన్ని చివరికి ప్రగతి భవన్ నీ తాకింది. మరోవైపు హైకోర్టులో వ్యాజ్యం కొనసాగుతోంది. ప్రభుత్వం నియమించిన ముగ్గురు నిపుణుల విచారణ కమిటీ నివేదిక కంటితుడుపు చర్యగా కూడా పనిచేయలేదు. పైగా తప్పుల తడకగా తయారైన బోర్డు అధికారులను, వివాదాస్పద గ్లోబరీనా సంస్థకు కితాబులివ్వడం శోచనీయం. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ భవిష్యత్ చర్చనీయాంశమైంది.
      1968 జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా 10+2+3 (సెకండరీ + హైయ్యర్ సెకండరీ + కాలేజీ, యూనివర్సిటీ) విద్యా వ్యవస్థ అమల్లోకి వచ్చింది. పదో తరగతి వరకు విద్యార్థులు అందరికీ ఒకే విధమైన సబ్జక్టులను నేర్పాలి. పదకొండు, పన్నెండు (+2) తరగతుల్లో విద్యార్థులు యిష్టమైన సబ్జక్టులు నేర్చుకోవచ్చు. సీబీఎస్ఈ సిలబసులో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ స్ట్రీములలో ఏవైనా ఐదు సబ్జక్టులు ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కంపల్సరీ. సెంటర్స్ ఆఫ్ ఎక్సిలెన్సెసుగా ప్రచారంలో వున్న నవోదయ విద్యాలయాల్లో, క్వాలిటీ ఎడ్యుకేషన్ కి మోడల్స్ గా చెబుతున్న కేంద్రీయ విద్యాలయాల్లో మరియు తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో +2 విధానమే అమలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఇంటర్మీడియట్ అనేది అమల్లో వుంది. దేశమంతటా +2 వుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎందుకుంది? ఈ విధానం వలన లాభమా నష్టమా అనే సందేహాలు, స్వల్ప చర్చలు చెదురుమదురుగా జరిగేవి. ఇంటర్మీడియట్ విద్య వలనే ఎంసెట్, జెఈఈ, ఐఐటీ సీట్లు తెలుగు రాష్ట్రాలకే ఎక్కువ వస్తున్నందున ఇదే మేలైంది అనే వాదనతో ఆ‌ చర్చలు అంతటితోనే ఆగిపోయేవి. ఈ విధానమే మెరుగైందైతే యిన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇతర రాష్ట్రాలు ఎందుకు అనుసరించడం లేదు. ఇంటర్మీడియట్ కంటే సీబీఎస్ఈ సిలబసే మెరుగైందని విద్యారంగ నిపుణులు చెబుతారు. ర్యాంకులు, సీట్లు ఇంటర్మీడియట్ వలనే వస్తున్నాయనడంలో నిజమెంత?
      ర్యాంకులు, సీట్లలో అత్యధికం కార్పోరేట్ కాలేజీలకు వస్తుండగా కొన్ని మాత్రం ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలకు వస్తున్నవి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చేవి బహు తక్కువ. విద్యార్థుల స్వేచ్ఛను అరికట్టి రోజుకు పదహారు గంటలు రుద్దితే ర్యాంకులు, సీట్లు వస్తున్నవి తప్ప ఇంటర్మీడియట్ వలనే కాదనే వాదన వుంది. ర్యాంకులు, సీట్లు వచ్చే విద్యార్థులకు ఒనగూరే మేలు కంటే సంబంధిత కార్పోరేట్ కాలేజీలకు పెరిగే బిజినెస్ చాలా చాలా ఎక్కువ. ఇందుకోసం లక్షలాది మంది విద్యార్థుల పేరెంట్స్ కష్టార్జితాన్ని ధారబోయడంతో పాటు ఆస్థులు అమ్ముకోడం, అప్పల పాలు గావడం జరుగుతోంది. కనీస వేతనాలు లేకుండా వేలాదిమంది అధ్యాపకులు అహర్నిశలు చమటోడుస్తున్న వెట్టిచాకిరి ఆ ఫలితాల్లో దాగి వుందనే సత్యాన్ని గుర్తించాలి. ఇంటర్మీడియట్ విద్యావ్యాపారంలో సులభంగా దండుకున్న సొమ్ము గుమ్మరించి రాజకీయాలను ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకన్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ వలన తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమిటి? విద్యా విషయంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ 28 వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 25 వ స్థానంలో వున్నవి. విద్యాభివృద్ధి సూచికల విషయంలో 2018 లో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో 18 మరియు 16 స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అట్టడుగు స్థానాల్లో అవమానకరమైన స్థితిలో కునారిల్లుతున్నవి. ఈ దుస్థితిని మార్చేందుకు ఇంటర్మీడియట్ విద్య ఏమైనా తోడ్పడుతుందా?
      ఇంటర్మీడియట్ విద్య వలన రాష్ట్ర విద్యారంగానికి జరుగుతున్న నష్టం మరికొన్ని రూపాల్లో కూడా వుంది. +2 విధానంలో హైస్కూళ్లు 12 వ తరగతి వరకు వున్నవి. 10 వ తరగతి పాసైన విద్యార్థులు అదే స్కూల్లో 12 వ తరగతి కూడా పూర్తి చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అలాంటి అవకాశం లేదు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్ విద్య కోసం పట్టణాల్లోని ప్రైవేట్ కార్పోరేట్ కాలేజీలను ఆశ్రయించాల్సి వస్తోంది. పేదలు, బలహీన తరగతుల పిల్లల్లో కొద్దిమందికి గురుకులాల్లో అవకాశం లభిస్తుంటే మరికొంత మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతుండగా మిగిలిన వారు చదువు మానేస్తున్నారు. ఏదోవిధంగా ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరినా చివరికి పరీక్షల్లో ఫెయిలవుతున్న వారిలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులే ఎక్కువ. ఫెయిలైన బాధతో అవమానంతో వత్తిడితో చనిపోతున్న విద్యార్థుల్లో కూడా వారే ఎక్కువ.  ఉదాహరణకు రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తెలంగాణలో 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు చనిపోయిన 51 మంది విద్యార్థుల్లో 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే వున్నట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. ర్యాంకులు, సీట్లు దక్కుతున్నది ఎవరికి, ఆత్మహత్యల పాలవుతున్నది ఎవరు అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో సైన్స్, మేథ్స్ గ్రూపులు మాత్రమే వుండడం వలన ఆర్ట్స్, హ్యూమానిటీస్ కోర్సులు కనుమరుగవుతున్నవి. విద్యలో సమతుల్యత, సామాజిక న్యాయం దెబ్బతింటోంది. 
      ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 వుండగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు 2203 వున్నవి. విద్యార్థులు 1.68 లక్షలు మరియు 7.64 లక్షలు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మంజూరైన జూనియర్ లెక్చరర్ పోస్టులు 4552 వుండగా‌ పనిచేస్తున్నది సుమారు 800 మంది మాత్రమే. ఇరవై సంవత్సరాలుగా లెక్చరర్ల రిక్రూట్మెంట్ లేదు. దాదాపు నాలుగు వేలమంది కాంట్రాక్ట్ లెక్చర్లతో కాలేజీలు బ్రతికి వున్నవి. పరీక్షా పత్రాల మూల్యాంకనానికి ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు సరిపడా లేకపోవడం వలన ప్రైవేట్ కార్పోరేట్ కాలేజీల లెక్చరర్లను కూడా వినియోగించామని బోర్డ్ అధికారులు చెప్పారు. కాగా ఒక్కో ఎగ్జామినరుతో రోజుకి 30 ఆన్సర్ స్క్రిప్ట్స్ మాత్రమే దిద్దించాల్సి వుండగా, కొంతమందితో రోజుకి 45 వరకు కూడా దిద్దించినట్లు తెలిసింది. వాల్యుయేషన్ చేసిన ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల అధ్యాపకుల్లో పాఠాలు చెప్పిన వారెంతమందో తెలుసుకోవడం అవసరమని ఎన్సీఈఆర్టీ సభ్యులు డాక్టర్ మురళీ మనోహర్ చేసిన సూచనను పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఇక పరీక్షల ఫలితాల నమోదు, ప్రకటన ప్రక్రియలో గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసిన నిర్వాకంతో ఏర్పడిన సంక్షోభం, దానితో బోర్డ్ అధికారులు మరియు ప్రభుత్వం పడుతున్న మల్లగుల్లాలు రాష్ట్ర విద్యారంగాన్ని కుదిపేసినవి. 
     ఈ వ్యవస్థలో  విద్యారంగంలో  ప్రైవేట్ ప్రమేయాన్ని లేకుండా చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ దానిపైన  ప్రభుత్వ నియంత్రణ లేకపోతే అది తన లాభాల కోసం ఎంతకైనా తెగిస్తుంది. విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తుంది, విద్యార్ధులను బలిగొంటుంది. 80% పైగా కాలేజీలు, విద్యార్థులు కార్పోరేట్ కబంధ హస్థాల్లో వుండగా వాటిని అదుపు చేయడం  ప్రభుత్వానికి పెద్ద సవాలే. విద్యారంగ రక్షణ కోసం, విద్యార్థుల మేలు కోసం, కార్పోరేట్ విద్యా వ్యాపారుల కట్టడి కోసం అవసరమైన శస్త్ర చికిత్సకు పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.