29, ఫిబ్రవరి 2020, శనివారం

How long the Reservations?

ఎంతకాలం ఈ రిజర్వేషన్లు?
                           నాగటి నారాయణ 
       "రిజర్వేషన్ల రక్షణకు పటిష్టమైన చట్టం అనివార్యం" అనే యిటీవలి నా వ్యాసం చదివిన ఒక ప్రభుత్వ అధికారి చాలా ఆవేశంగా ఫోన్ చేశారు. 'ఇంకా ఏమి తక్కువయిందని పటిష్టమైన చట్టం కావాలంటున్నారు, నాకన్నా చాలా తక్కువ మెరిట్ వున్నా రిజర్వేషనుతో నాతోపాటు ఉద్యోగం పొంది, ఇప్పుడు నాతో సమాన కేడరులో వున్న వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ ఎందుకు?' అన్నారు. సమానం అయితే మీ అమ్మాయిని వారి అబ్బాయికి లేదా వారి అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేశారా? అని అడిగితే లేదన్నారు. అగ్ర కులాల, నిమ్న కులాల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే మీరు అంగీకరిస్తారా అంటే లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమికుల్లోని తక్కువ కులాలవారిని కొట్టి చంపుతున్నారు కదా అంటే అది వారి స్వయంకృతాపరాధం అన్నారు. ఎందుకలా చేస్తున్నారు, మీరూ వారు సమానమే అన్నారు కదా అంటే ..  ఉద్యోగ హోదా, జీతం సమానమేగా అనకొచ్చారు. షెడ్యూల్డు కులాలు, తరగతుల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లు సామాజిక అసమానతను అధిగమించడానికి మాత్రమే, ఉద్యోగం జీతం అందులో భాగమే అని చెప్పినా కన్వీన్స్ కాలేదు. ప్రతిభకు నష్టం జరుగుతుంది అని విసుక్కున్నారు. 
       రిజర్వేషన్లతో లబ్ది చేకూరుతున్న కొద్దిమందిని కూడా సహించలేక ప్రతిభకు నష్టం జరుగుతుందని నిందించడం కొంతమందికి అలవాటుగా మారింది ఉన్నత చదువులు, ప్రొఫెషనల్ కోర్సులకు ప్రవేశ పరీక్షల్లో మరియు ఉద్యోగాలకు  రిక్రూట్మెంట్ టెస్టుల్లో నెగ్గిన ప్రతిభావంతులకే సీట్లు, నియామకాలు లభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిభకు నష్టం జరుగుతుందనే ఆరోపణ అసహనంతో చేసే అభాండం మాత్రమే. అయితే ఓపెన్ కేటగిరిలో సెలెక్ట్ అయిన వారి మెరిట్ ర్యాంక్ కంటే రిజర్వుడ్ కేటగిరిలో సెలెక్ట్ అయిన వారి మెరిట్ ర్యాంక్ కొంత తక్కువ వుంటే అది నిందార్హమ్ కాదు. ఏ కేటగిరిలో అయినా ఎక్కువ మెరిట్ ర్యాంక్ వారికంటే తక్కువ మెరిట్ ర్యాంక్ వారికి ఉద్యోగాలు యిస్తేనే ప్రతిభకు నష్టంగా భావించవచ్చు. ఎవరి కోటాలో వారికే మెరిట్ ప్రాతిపదికన సీట్లు, పోస్టులు వస్తున్నందున ప్రతిభకు నష్టం జరుగుతుందనే ఆరోపణ అనవసరం. తరతరాలుగా సమాజానికి చాకిరీ చేసి అన్యాయానికి, అణచివేతకు గురైన వారికి రిజర్వేషన్లతో కల్పించిన కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా సహించలేకపోవడం సరైందికాదు. ఇప్పటికీ సమాజానికి అవసరమైన పబ్లిక్ సర్వీసుల్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలే సేవ చేస్తున్న విషయాన్ని గుర్తించాలి. 
       'ఎవరి పని వారు చేసుకుని బతుకుతున్న ఈ రోజుల్లో సమాజం కోసం ఎవరో సేవ చేసేది ఏముంది' అని ఆ సారు విసుక్కొంటూనే వున్నారు. రోడ్లు ఊడ్చి చెత్తాచెదారం తొలగించేది, పట్టణాల్లో పార్కులను శుభ్రం చేసేది, పాకీ పని చేసేది, పశు కళేబరాలను తొలగించేది, శవాలను ఖననం చేసేది ఎవరు సార్' అంటే యింకా రెచ్చిపోయారు. 'నా దొడ్డి, బాత్ రూమ్ నేనే కడుక్కొంటున్న, ఎవరో వచ్చి కడగడం లేదు' అని కేకలేశారు. మీరు వదిలిన మలమూత్రాలు, కడిగిన మలినం డ్రైనేజీలోకి పోతుంది, అది బ్లాక్ ఐతే శుభ్రం చేస్తున్నది ఎవరు అని అడిగితే మాట మార్చారు. అయినా, ఎంతకాలం ఈ రిజర్వేషన్లు? పదేళ్ల వరకే అని రాజ్యాంగంలో చెప్పి డెబ్భై సంవత్సరాలు గడిచినా కొనసాగించడం ఏంటి? అన్నారు. చాలా మందికి రిజర్వేషన్ల పట్ల అదే అభిప్రాయం వుంది. కానీ నాకు తెలిసిన మేరకు అలాంటి అభిప్రాయం సరైంది కాదు. పదేళ్ల వరకే రిజర్వేషన్లు అని చెప్పింది (రాజ్యాంగం ఆర్టికిల్ 334) లోక్ సభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికయ్యే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు మాత్రమే. వాటికి గత జనవరి 25 వ తేదీతో ముగిసిన గడువును మరో పదేళ్లు పొడిగిస్తూ 2019 డిసెంబర్ 12న పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎడిక్వెసి (సరిపడినంత) వరకు కొనసాగించాలి (ఆర్టికిల్స్ 16(4) మరియు 16(4ఏ)) అనే విషయాన్ని గుర్తించాలి. (అయితే అలా కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షాధికారం మేరకే అనే కొత్త సమస్య యిటీవలి సుప్రీంకోర్టు వ్యాఖ్యతో ముందుకొచ్చింది). ఏ కేటగిరిలో అయినా మొత్తం పోస్టుల్లో 15 శాతం వరకు ఎస్సి వారిని, 8 శాతం వరకు ఎస్టీ వారిని నియమించాలి. ఇప్పటికీ అంతమంది లేరు. నాలుగో తరగతి ఉద్యోగాల్లో మాత్రమే ఏడిక్వెసికి మించి వుంటారు. ఇప్పుడా పోస్టులకు నియామకాలే లేవు. ఔట్ సోర్సింగ్ నియమాకాలతో రిజర్వేషన్లు లేకుండా చేయడం జరిగింది. క్లాస్ 3 ఉద్యోగాల్లో సంఘాలు బలంగా వున్న రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖల్లో మాత్రమే ఎడిక్వెసి వరకు భర్తీ అవుతున్నవి. అయినా ప్రమోషన్ పోస్టుల్లో కొంత కొరత వుంది. క్లాస్ 1 మరియు క్లాస్ 2 పోస్టుల్లోని రిజర్వుడ్ స్థానాలు దాదాపు సగం వరకు ఖాళీగానే వుంటున్నట్లు పార్లమెంటులో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే నివేదికల ద్వారా తెలుస్తోంది. 
       చట్టం ముందు అందరూ సమానమే (ఆర్టికిల్ 14) అని అంటూనే రిజర్వేషన్ల పేరుతో కొందరికి రాయితీలు కల్పించడం ఏమిటి, అది వివక్ష కాదా అనే విమర్శ కూడా వుంది. అవును, వాక్ స్వాతంత్య్రం, సభా స్వాతంత్య్రం, సంఘ స్వాతంత్య్రం వంటివి అందరికీ సమానమే. కానీ, ప్రభుత్వం అందించే సదుపాయాలను అందిపుచ్చుకోలేని అంటరానితనంకి, అమానుషమైన వివక్షతకి గురై సామాజికంగా వెనుకబడిన (ఎస్సి, ఎస్టీ) వారికి ప్రత్యేక రాయితీ కల్పించాలని ఆర్టికిల్ 15(3) ఆదేశిస్తోంది. అది వివక్ష కాదా అంటే అవొచ్చు, కానీ దానిని పాజిటివ్ వివక్షగా చూడాలని బీసీ కమీషన్ రిపోర్టు సందర్భంలో జస్టిస్ చిన్నపరెడ్డి చెప్పిన విషయాన్ని గమనించాలి. అందుకోసమే రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు గడిచినా మన సమాజంలో అంటరానితనం, వివక్షత పాటించబడుతున్నందునే రిజర్వేషన్లను కొనసాగించాల్సి వస్తోంది. గ్రామీణ భారతంలో దళిత వాడలు వెలివాడలుగా, గిరిజన గూడేలు, తండాలు విసిరేసినట్లుగా ఒంటరిగానే వుంటున్నవి. పట్టణాల్లో ఎస్సి, ఎస్టీ వారికీ అద్దె ఇళ్లు కూడా యివ్వడం లేదు. కులాంతర వివాహాలను సహించకపోవడంతో పాటు కమ్యూనిటీ మేట్రిమోనిస్ పేరుతో అడ్డుగోడలు కడుతున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్న భోజన సమయంలో బడి పిల్లలను కులాలవారీగా కూర్చోబెడుతున్నారు. రాష్ట్రపతితో సహా ఉన్నత పదవుల్లో వున్నవారైనా దళితులను దేవాలయాల్లోకి కూడా అనుమతించడం లేదు. ఇలాంటి వివక్షత, అంటరానితనం కొనసాగినంత కాలం వాటికి గురవుతున్నవారికి సామాజిక రిజర్వేషన్లు కొనసాగడం అనివార్యం, అవసరం. @ 
నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు 9490300577

A clear-cut Act for implementation of reservations required

రిజర్వేషన్ల రక్షణకు పటిష్టమైన చట్టం అత్యవసరం
                                                           నాగటి నారాయణ 
       దళిత, గిరిజన సామాజిక తరగతుల సంక్షేమానికి సంబంధిచిన రిజర్వేషన్లపై తరచుగా వివాదాలు, వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రజా ప్రాతినిధ్య పదవుల్లోని రిజర్వేషన్ల కంటే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే ఆందోళనకర, ప్రమాదకర పరిస్థితులు ఉత్పన్నమవుతున్నవి. రాజకీయ పదవుల్లో కొందరు దళిత, గిరిజన నాయకులు ఉండడం వలన లభిస్తున్న మేలు కంటే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల వలనే ఎంతోకొంత సామాజిక న్యాయం నెరవేరుతోంది. అందువలనే ఉద్యోగాల్లో రిజర్వేషన్లపైనే అసహనం, కోర్టుల్లో వ్యాజ్యాలు నడుస్తున్నవి. రిజర్వేషన్ల వలన విద్య, ఉద్యోగాల్లో ఎదిగొచ్చినవారిలో అంబేద్కరిస్టులు మరియు సామాజిక న్యాయం సిద్ధాంతంతో పనిచేసే కమ్యూనిస్టులే రిజర్వేషన్ల సంరక్షణకు నిజాయితీగా పోరాడుతున్న విషయం తెలిసిందే. పాలకవర్గాలు ఓట్లు కోసమైనా స్పందించక తప్పడం లేదు. న్యాయాన్ని అన్యాయం వెంటాడుతున్నట్లే రిజర్వేషన్లను అవరోధాలు, ప్రమాదాలు వెంటాడుతున్నవి. రాజ్యాంగం అమల్లోకొచ్చిన ఏడాదిలోపే ఎస్సి, ఎస్టీలకు లభిస్తున్న విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో దాఖలైన పిటిషనుపై హైకోర్టు, సుప్రీం కోర్ట్ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పులిచ్చాయి. ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా వున్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చొరవతో రాజ్యాంగం ఆర్టికిల్ 15కి చేసిన సవరణతో మొదటి ప్రమాదం తప్పింది. గడిచిన ఏడు దశాబ్దాల కాలంలో కూడా  వివిధ సందర్భాల్లో రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు యిచ్చిన తీర్పుల వలన మరికొన్ని సార్లు రాజ్యాంగానికి స్వల్పమైన సవరణలు చేయాల్సివచ్చింది. కాగా జార్ఖండ్ ప్రభుత్వం 2012లో కొన్ని ఉద్యోగ ఖాళీలను రిజర్వేషన్లు పాటించకుండా యిచ్చిన ఉత్తర్వులను సమర్ధుస్తూ ఈనెల ఫిబ్రవరి 7న సుప్రీంకోర్ట్ యిచ్చిన తీర్పుతో రిజర్వేషన్లు మరోసారి ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. 
కేసు పూర్వాపరాలు 
       ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపనుల శాఖలోని అసిస్టెంట్ ఇంజనీర్ల ప్రమోషన్లలో ఎస్సి,ఎస్టీ రిజర్వేషన్లు పాటించాల్సిన అవసరం లేదని 2012 సెప్టెంబర్ 5న యిచ్చిన ఉత్తర్వులను వినోద్ కుమార్ మరో ఇద్దరు ఎస్సి తరగతికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ట్ర హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. దానిపైన తీర్పు చెప్పిన హైకోర్టు "పదోన్నతుల్లో రిజర్వేషన్లు పాటించాలా అక్కర్లేదా అనేది నిర్ణయించడానికి సదరు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆయా సామాజిక తరగతుల ప్రాతినిధ్యం ఏ మేరకు ఉన్నదనే విషయమై నాలుగు నెలల్లో సమాచారం సేకరించాలని, దాని ఆధారంగా ప్రాతినిధ్యం తక్కువగా వున్న సామాజిక తరగతుల వారికి పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని" ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ తీర్పులో ఒక ముఖ్యమైన విషయం యిమిడివుంది. రిజర్వేషన్లు యింకా ఎంతకాలం అనే ప్రశ్నలకు కూడా అది సమాధానం కావచ్చు. ఏ కేడర్ పోస్టుల్లో అయినా ఎస్సి వారికి 15% వరకు మరియు ఎస్టీ వారికి 8% వరకు అంటే (అడిక్వాసి) తగినంత మేరకు రిజర్వేషన్లు అమలు చేయాల్సి వుంటుందనే అర్ధం అందులో వుంది. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసును విచారించిన జస్టిస్ లావు నాగేశ్వర రావు,జస్టిస్ హేమంత్ గుప్తా ల సుప్రీంకోర్టు ధర్మాసనం రిజర్వేషన్లు ప్రాధమిక హక్కు కాదు అంటూ  యిచ్చిన తీర్పుతో ఆందోళనకర పరిస్థితి తలెత్తింది.                                                                                                            
 సుప్రీంకోర్టు ఏమి చెప్పింది? 
        ఇరువురు సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పిన తీర్పు సారాంశం యిలా వుంది: "పబ్లిక్ సర్వీసుల్లో రిజర్వేషన్లు కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడాల్సిన అవసరం లేదు. ప్రమోషన్లలో రిజర్వేషన్ కోరడానికి ఎవరికీ ప్రాధమిక హక్కేమీ కాదు. రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వాలను ఆదేశించే అధికారం సుప్రీంకోర్టుకు కూడా లేదు. రిజర్వేషన్లు ఇవ్వడం లేదా ఇవ్వకపోవడం అనేది రాష్ట్ర ప్రభుత్వాల విచక్షణాధికారం. ఏ నిర్ణయమైనా సంబంధిత పబ్లిక్ సర్వీసుల్లో షెడ్యూళ్లు కులాలు, తరగతుల ప్రాతినిధ్యంకి సంబంధించిన డేటా సమాచారం ప్రాతిపదికన ఉండాలి". రాజ్యాంగం ఆర్టికిల్ 16(4) మరియు ఆర్టికిల్ 16(4ఏ) ఆధారంగా ఈ తీర్పు చెప్పాల్సి వస్తుందని న్యాయమూర్తులు చెప్పారు. న్యాయమూర్తుల అవగాహన మేరకు వ్యాఖ్యానాలు పరిపరి విధాలుగా వుండవచ్చు, కానీ రాజ్యాంగంలో వున్నదే నికరంగా నిలిచే అవకాశమే ఎక్కువగా వుంటుంది. 
రాజ్యాంగంలో ఏముంది?
       "ఆర్టికిల్ 16(4):- ప్రభుత్వ సర్వీసుల్లో వెనకబడిన తరగతుల ప్రాతినిధ్యం తగినంత లేదని  రాష్ట్ర ప్రభుత్వం భావిస్తే సంబంధిత తరగతుల వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించవచ్చు. 
       ఆర్టికిల్ 16(4ఏ):- ప్రభుత్వ సర్వీసుల్లోని ఏ తరగతి పోస్టులకైనా షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డ్ తరగతుల వారికి ప్రమోషన్లలో తగినంత ప్రాతినిధ్యం లేదని భావిస్తే వారికి ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించవచ్చు."
       ఆర్టికల్16(4) రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుండి వున్నదే. ఆర్టికల్ 16(4ఏ) 1995లో చేర్చబడింది. యింతకాలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మరియు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగాల్లో (నియామకాలు, ప్రమోషన్లు) రిజర్వేషన్లు కొనసాగుతూనే వచ్చాయి. గడిచిన డెబ్భై ఏళ్ల కాలంలో ఉద్యోగాలు, ప్రమోషన్లపై వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినా "రిజర్వేషన్లు పాటించడం లేదా పాటించకపోవడం అనేది  రాష్ట్రాల ఇష్టం" అనే తీర్పు రావడం ఇదే. ఇది చాలా అన్యాయమైంది. దేశంలో, ముఖ్యంగా కేంద్రంలో రాజకీయ వాతావరణం, పాలకుల స్వభావం ఆ విధంగా వుంది మరి. బీజేపీ ప్రభుత్వాలను నడిపిస్తున్న ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ రిజర్వేషన్ల విషయాన్ని సమీక్షించాలి అని తరచుగా ప్రకటనలు చేస్తున్న విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు జడ్జిల్లో కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని పొగుడుతున్న విషయం ఈ నెల 22న ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషల్ జ్యుడీషియల్ కాన్ఫరెన్సులో వెల్లడైంది. ఏదేమైనా సుప్రీంకోర్టు తాజా తీర్పుతో రిజర్వేషన్ల ప్రయోజనం ప్రమాదంలో పడే పరిస్థితి దాపురించింది. సహజంగానే దీనిపైన రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు తమ వంతు ఆందోళన వ్యక్తం చేసినవి. 
సుప్రీం తీర్పుపై ఎవరేమన్నారు? 
       అన్ని పార్టీలకన్నా ముందుగా స్పందించిన భారత కమ్యూనిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) "సుప్రీంకోర్టు తీర్పు దళిత, గిరిజన, ఓబీసీల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వుంది. ఇలాంటి తీర్పు రావడానికి కారణమైన రాజ్యాంగంలోని 16(4) మరియు 16(4ఏ) అధికరణల్లోని లోపాన్ని సరిదిద్దాలి. రిజర్వేషన్లను  ప్రాధమిక హక్కుగా నిర్ధారిస్తూ  పార్లమెంట్ ఉభయ సభల్లో తీర్మానం ఆమోదించి, రిజర్వేషన్లను విధిగా సార్వత్రికంగా అమలు చేయడానికి అనువుగా చట్టం చేయాలి" అని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ "బీజేపీ, ఆరెస్సెస్ డీఎన్ఏ లోనే రిజర్వేషన్ల పట్ల అసహనం వుంది, రిజర్వేషన్లను రాజ్యాంగంలో గ్యారంటీ చేయకపోతే ఈ ప్రభుత్వం వాటిని తొలగించే ప్రమాదం వుంది" అని అన్నారు. ఎన్డీయే భాగస్వామి ఎల్జేపీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ "ఎస్సి, ఎస్టీ తరగతుల ప్రయోజనాలకు సంబంధిన అన్ని విషయాలను న్యాయస్థానాల సమీక్షకు అవకాశం లేకుండా రాజ్యాంగం తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలి. జ్యుడిషియరీ ఉన్నత స్థానాల్లో ఎస్సి, ఎస్టీ ప్రాతినిధ్యం ఉండాలి" అని చెప్పారు. బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి "ఎస్సి, ఎస్టీ, ఒబిసిల హక్కులను నెమ్మదిగా చంపడానికే బీజేపీ ప్రభుత్వం పని చేస్తుంది" అన్నారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ఈనెల 11న లోక్ సభలో జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ సున్నితమైన రిజర్వేషన్ల విషయాన్ని ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని నిందించారు. సామాజిక న్యాయం మరియు సాధికారత శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ మాట్లాడుతూ "సమస్యకు సరైన పరిష్కారం కొరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేస్తుంది" అని ప్రకటించారు. కాగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర ఆజాద్ ఈ తీర్పును సమీక్షించాలని కోరుతూ ఫిబ్రవరి 11న సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిసింది. మరికొంతమంది పెద్దలు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రివ్యూ పిటిషన్ వేయాలని కోరుతున్నారు. 
ఏమిటి పరిష్కారం?
       రాజ్యాంగం ఆర్టికిల్స్ 16(4) మరియు 16(4ఏ) లోని పదాలు అలాగే వున్నంత కాలం ధర్మాసనాలు మారినా రిజర్వేషన్లకు గ్యారెంటీ వుంటుందని ఆశించలేము. సిపిఐ(ఎమ్) సూచించినట్లు ఆ 'పదాల్లోని (లకూనా) లోపాన్ని సరిదిద్దితేనే సరైన పరిష్కారం కాగలదు. రేపు ఒక విస్తృత ధర్మాసనం సానుభూతితో రిజర్వేషన్లకు సానుకూలమైన తీర్పు చెప్పినా దాన్ని కూడా ఛాలెంజ్ చేసే అవకాశం వుంటుంది. జ్యుడీషియరీ ఉన్నత స్థానాల్లో ఎస్సి, ఎస్టీ తరగతుల ప్రాతినిధ్యం వుంటే మంచిదే, కానీ ఒకరో ఇద్దరో ఉన్నంత మాత్రాన సానుకూల తీర్పులు వస్తాయని ఆశించలేము. ఒకవేళ వచ్చినా పక్షపాతంగా యిచ్చారని ఆక్షేపించే అవకాశమూ వుంటుంది. సామాజిక రిజర్వేషన్లను సామాజిక వివక్షత వున్నంతకాలం నిరాటంకంగా కొనసాగించక తప్పదు. కనుక ఎస్సి, ఎస్టీ, ఓబీసీ తరగతుల సామాజిక రిజర్వేషన్ల రక్షణకు పటిష్టమైన చట్టం అనివార్యం, అత్యవసరం. @ 
నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు 9490300577

20, ఫిబ్రవరి 2020, గురువారం

Mohan Bhagavat's statement on Divorces are Absurd.

చదువు, సంపద వల్లే విడాకులు అవుతున్నాయా!
                                                               నాగటి నారాయణ 
        భారతీయ సంస్కృతిని సంరక్షిస్తున్న దేశభక్తియుత సంస్థగా చెప్పుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ ఈనెల 16 న అహ్మదాబాదులో సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా, అభ్యంతరకరంగా వున్నవి. మీడియాలో, దినపత్రికల్లో  ప్రచురించబడిన వార్తలో భాగవత్ వ్యాఖ్యలు యిలా వున్నవి: "ఈరోజుల్లో విడాకుల కేసులు పెరిగిపోతున్నవి. ప్రజలు అనవసర విషయాలపైన గొడవ పడుతున్నారు. బాగా చదువుకున్న మరియు సంపన్న కుటుంబాల్లోనే విడాకులు ఎక్కువగా జరుగుతున్నవి, ఎందుకంటే చదువు, సంపదతో అహంకారం పెరుగుతుంది. దానితో కుటుంబాలు విడి పోతున్నవి, తద్వారా సమాజమూ విడి పోతోంది."  అంతేకాదు, "మహిళలను ఇంటికి పరిమితం చేయడమే మన వ్యవస్థ గొప్పదనం. రెండు వేల సంవత్సరాల నాటి ఆ స్వర్ణయుగమే ఆదర్శం" అని కూడా చెప్పుకొచ్చారు. దేశాన్నీ, చాలా రాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీని నడిపిస్తున్న సనాతన సంస్థ వైఖరి ఎలా వుందో భాగవత్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసులోవచ్చు. అవి ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంధం 'మనుస్మృతి'లో చెప్పినవేననే విషయం తెలిసిందే. దాని ప్రకారం చదువు, సంపద కొద్దిమంది వద్దే తప్ప అందరి వద్ద ఉండకూడదు. సమాజంలోని అతి కొద్దిమందిగా వుండే పురోహితుల వద్ద చదువు మరియు సంపద వైశ్యుల వద్ద మాత్రమే వుండాలని, అలాంటి విద్య, సంపదల ఆధారంగానే రాజ్య పాలన సాగాలనేది  ఆ సిద్ధాంత సారాంశం. అందుచేతనే దేశంలోని సంపద ఆయేటికాయేడు కొద్దిమంది చేతుల్లోకే చేరుతోంది. దేశంలో ఉత్పత్తి అయిన సంపదలో 73% ఒక్క శాతంగా వున్న కుబేరుల స్వంతం అయినట్లు అంతర్జాతీయ హక్కుల సంస్థ 'ఆక్సుఫామ్' గతేడాది ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్సులు తగ్గిస్తూ మరింత సంపద వారి స్వంతమే అయ్యేందుకు మోడీ ప్రభత్వం గొప్ప కృషి చేస్తోంది. పెద్ద ఉద్యోగాలు చేపట్టి మంచి ఆర్ధిక స్థితిలో ఉండగలిగే ఉన్నత సాంకేతిక విద్యలు ప్రస్తుతం పదిశాతం మందికే అందుబాటులో వున్నవి. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ నుండి పదును పెడుతున్న నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే ఉన్నత సాంకేతిక విద్యలు బహు కొద్దిమందికే పరిమితం అయ్యే పరిస్థితి ఉత్నన్నమవుతుంది. 
       "చదువు సంపద అందరివీ, ఊరూ వాడా అందరివీ; పరువుగ బ్రతికే జన్మహక్కు మనిషియన్న ప్రతివారివీ" అనే నలభై  ఏడేళ్ల క్రితం సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ కొసరాజు పాట వింటుంటే చదువ, సంపద అందరికీ లభించాచాలనే సమ సమాజ ఆకాంక్షను రేకిస్తుంది. అందుకు భిన్నంగా అవి అందరికీ అందకూడదనేది మోహన్ భగవత్ సందేశం. ఇలాంటి తిరోగమి వ్యాఖ్యలను ఏ సమాజమూ సహించదు. భారతీయ సమాజమూ సహించలేదు. ముఖ్యంగా మహిళల పట్ల అంతటి చులకన భావం, నియంతృత్వ ధోరణి తీవ్రమైన అభ్యంతరకరమైంది. చాలామంది నెటిజెన్లు మోహన్ భాగవత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్షరాస్యత, ఆస్తిపాస్తులు తక్కువగా వుండే గ్రామీణ భారతావనిలోనే విడాకులు ఎక్కువగా వున్నాయనే విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. విద్యాభివృద్ధిలో, సంపద సృష్టిలో అధమస్థాయిలో వున్న యోగి ఆదిత్యనాధ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్ లోనే అధికసంఖ్యలో విడాకులున్న దానికి ఏమి జవాబు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అసలు పెళ్లి కాని, సంసారం లేని పెద్దమనిషి విడాకులు గురించి చెప్పడమేమిటని అడుగుతున్నారు. అలాంటి ప్రశ్నలతో నిలదీసేవారిపైన షరామామూలుగా ఆరెస్సెస్ భక్తుల ఎదురుదాడి కూడా పెరుగుతోంది. అలాంటి అదరగొండి తనంతోనే యింతకాలం చలామణి అవుతూ వస్తున్నారు. ఇప్పటికైనా వారి ఆటలు కట్టించే శక్తులు పెరగాలి. సమాజంలో సగభాగమైన మహిళలను వంటింటి కుందేళ్ళుగానే అణిచివేయాలనే వాచాలత్వం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఎదగాలనుకునే భారతదేశానికి అవమానం. 

8, ఫిబ్రవరి 2020, శనివారం

Pre-primary edu must: ASER 2019

అసెర్ 2019 అధ్యయనం 
ప్రీప్రైమరీ విద్య అత్యవసరం 
                                       నాగటి నారాయణ 
        పాఠశాల విద్య అసెస్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ముంబైలోని ప్రథమ్ స్వచ్చంద సంస్థ 2005 నుండి "యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసెర్)" లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి 2019 నివేదికను "ఎర్లీ ఇయర్స్" పేరుతో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ పరిస్థితిని ప్రత్యేకంగా అధ్యనయం చేసింది. 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో 30,425 కుటుంబాల్లోని 36,930 మంది 4-8 సం.ల వయసు గల బాలబాలికలను సర్వే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో మరియు  తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ సర్వే చేయబడింది. జ్ఞాన పరమైన అభివృద్ధి, మాటలు మాట్లాడడం, అంకెలు గుర్తించడం లెక్కించడం, సామాజిక భావోద్వేగ అభివృద్ధి అనే నాలుగు మౌలిక విషయాల పైన సర్వే చేసారు. జిల్లాలవారీగా పరిస్థితిని రిపోర్టులో ప్రచురించబడింది. సర్వేలో సేకరించిన సమాచారంతో తేలిన విషయాల ఆధారంగా ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను, అవసరాన్ని సూచించడం ఈ నివేదికలోని ముఖ్యమైన విషయం. 
       భారతదేశం పాఠశాల విద్యలో అభ్యసన సామర్ధ్యాల సంక్షోభం అందరికీ తెలిసిందే. నేషనల్ ఎచీవుమెంట్ సర్వే 2017 ప్రకారం మూడవ తరగతి విద్యార్థుల్లో మూడో వంతు మంది పాఠాన్ని చదవలేక పోతున్నారు. సగం మంది విద్యార్థులు రోజువారీ జీవితానికి అవసరమైన లెక్కలు (రూ 20 ల్లో పెన్ను ఖరీదు రూ 13 లు పొతే ఎంత మిగులుతుంది? వంటివి) చెయ్యలేక పోతున్నారు. ఈ లోపం మరింత ఆందోళనకరంగా వున్నట్లు 'యాన్వల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసెర్) 2018' వెల్లడించింది. ఐదవ తరగతి విద్యార్థుల్లో సగం మంది పాఠ్య పుస్తకంలోని పాఠాలను సరిగా చదవలేక పోతున్నారని, 28% మంది మాత్రమే భాగహారం లెక్కలు చేయగలుగుచున్నారని పేర్కొన్నది. పై తరగతులకు పోతున్నకొద్దీ చదువు తగ్గిపోవడమే కాదు, ప్రారంభ తరగతుల్లో కూడా కనీస అభ్యసన సామర్ధ్యాలు అలవడక పోవడం ఆశ్చర్యంగా వుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఒకటవ తరగతి విద్యార్థుల్లో 42.7% మంది అక్షరాలను గుర్తించలేక పోతున్నారు, 35.7% మంది  1-9 అంకెలను గుర్తించలేక పోతున్నారు. ఒకటవ తరగతిలో చేరడానికి ముందే అభ్యసన సామర్ధ్యాల్లో లోపం వున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు అసెర్ కేంద్రం 2017 లో అధ్యయనం చేసిన "ఇండియా ఎర్లీ చైల్డుహుడ్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్" నివేదిక తెలియజేసింది. సరైన సంసిద్ధత (ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్) లేకుండానే పిల్లలను పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేర్చడమే అసలు లోపమని అనేకమంది విద్యావేత్తలు కూడా అభిప్రాయ పడుతున్నారు. 
        కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు ప్రీప్రైమరీ విద్యను అందించలేక పోతున్నవి, అంగన్వాడీ వర్కర్లకు గల బహుళ (వ్యాక్సినేషన్స్, మేటర్నల్ హెల్త్, మాల్న్యూట్రిషన్ వగైరా … ) బాధ్యతల్లో ప్రీప్రైమరీ విద్య నామ మాత్రమే. ప్రీప్రైమరీ విద్య వయసు 5-6 సంవత్సరాల పిల్లల్లో నాలుగో వంతు మంది మాత్రమే అంగన్వాడీ కేంద్రాల్లో వున్నట్లు అసెర్ 2018 నివేదిక తేల్చింది. మిగిలిన వారిలో కొద్దిమంది ప్రైవేట్ కేజీ, నర్సరీ క్లాసుల్లో మరియు చాలామంది ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో వున్నట్లు పేర్కొన్నది. కాగా అత్యధిక ప్రైవేట్ నర్సరీ కిండర్ గార్టెన్ క్లాసుల్లో ప్రీప్రైమరీ విద్య కంటే స్కూల్ కరిక్యులమ్ పాఠాలే చెబుతున్నట్లు ఆ నివేదిక చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన 5-6 సం.ల పిల్లలకూ ఒకటవ తరగతి పాఠాలే తప్ప ప్రీప్రైమరీ విద్య లేదు కదా. పునాదిగా పరిగణించే ప్రీప్రైమరీ విద్య లేకపోవడం వలన ఆ నష్టం పాఠశాల విద్యలో కొనసాగుతోంది. గత ఐదేళ్లుగా చర్చించబడుతున్న నూతన విద్యా విధానం ముసాయిదాలో మూడు సంవత్సరాల ప్రీప్రైమరీ విద్యను ప్రతిపాదించడం జరిగింది. కానీ దాని అమలుకు సూచించిన మూడు మార్గాలు ముందుకు పోయేవి కాదు. 4-5 సం.ల వయసు పిల్లలకు కనీసం ఒక ఏడాది కాలమైనా మంచి టీచర్లతో రోజుకి 3-4 గంటలు తగిన లెర్మింగ్ మెటీరియలుతో శిక్షణ యిస్తే పాఠశాల విద్యకు సంసిద్ధం కాగలరు. ప్రీప్రైమరీ స్కూలింగ్ ఎఫెక్టివుగా అమలు చేయగలిగితే ప్రైవేట్ స్కూళ్ల ఆకర్షణను అరికట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగే అవకాశం కలుగుతుంది కూడను. 
       దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రంగంలో ప్రీప్రైమరీ స్కూలింగ్ కోసం ఏర్పాట్లు జరిగినవి. ఉదాహరణకు పూణే, చెన్నై, ముంబై కార్పొరేషన్లలో; చిన్న రాష్ట్రాలైన ఢిల్లీ, సిక్కిం మరియు పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, అస్సాంలలో ఒక ఏడాది ప్రీప్రైమరీ స్కూలింగ్ అమల్లో వుంది. కానీ అవి జయప్రదమైన దాఖలాలు లేవు. ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ కి తగిన కరిక్యులం గానీ, అర్హతగల ఉపాధ్యాయులు గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ లోకపోవడం పెద్ద లోపాలు. ప్రభుత్వ విద్యాశాఖలో భాగముగా అయితేనే బాలలందరికీ ప్రీప్రైమరీ విద్య అందించడం సాధ్యమని అనుభవాల సారాంశం. అందుకు నాలుగు రకాల నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. 
1. సమర్ధవంతమైన ఏర్పాటు: ఎర్లీ చైల్డుహుడ్ ఎడ్యుకేషన్ ఎలా వుండాలి, పిల్లలను  పాఠశాలకు ఎలా సంసిద్ధం చేయాలి, అందుకు పాఠశాలలు ఎలా సంసిద్ధం కావాలి అనే విషయాలపైన దేశములో విస్తృతమైన చర్చలే జరిగినవి. 'నేషనల్ ఎర్లీ చైల్డుహుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ 2013' లో కరిక్యులర్ ప్రిన్సిపుల్స్ పేర్కొనబడినవి. 'నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)' 2019 లో ప్రీ స్కూల్ కరిక్యులమ్ మరియు దాని అమలుకు మార్గదర్శకాలు ప్రకటించబడినవి. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు (ఇనస్ట్రక్షనల్ మెటీరియల్, టీచర్ ట్రైనింగ్, మోనిటరింగ్, అసెస్మెంట్ వగైరా) చేసుకోవాలి. ఎర్లీ చైల్డుహుడ్ ఎడ్యుకేషన్ నిర్వహణలో అనుభవమున్న ప్రథమ్, విక్రమశీల, అక్షర ఫౌండేషన్ వంటి సివిల్ సొసైటీ సంస్థల సహకారం తీసుకోవచ్చు. 
2. బోధనా సిబ్బంది ఎంపిక: శిక్షణ పొందిన బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులు నిర్దిష్ట సమయ సారిణితో పనిచేస్తేనే ప్రీప్రైమరీ విద్యా బోధన సాధ్యం కాగలదు. అందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రీప్రైమరీ టీచర్స్ కేడరుని సృష్టించాలి. అలాంటి కేడర్ పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యే వరకు ఈ లోగా తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరానికి మించి అదనంగా వున్న ఉపాధ్యాయులను, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసుకోవాలి. స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు కూడా ప్రీప్రైమరీ టీచర్లను నియమించుకోవచ్చు. 
3. కేంద్ర నిధుల వినియోగం: ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ పైలట్ ప్రాజక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం యిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలి. గత రెండేళ్ల కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్.ఎస్.ఏ నిధుల్లోంచి పెద్ద మొత్తంలో ప్రీప్రైమరీ స్కూలింగ్ కోసం వెచ్చించడం జరిగింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఒక్కోదానికి రూ 45 కోట్లు కంటే ఎక్కువగా కేంద్ర నిధులు లభించినవి. ఆ నిధులతో నాణ్యమైన ప్రీప్రైమరీ విద్య అందించే ఏర్పాట్లు చేసుకున్నవి. కాగా చాలా రాష్ట్రాలు తమకు లభించే నిధులను అంగన్వాడీ కేంద్రాలకే వెచ్చించడం జరుగుతోంది. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించ గలిగితే ప్రీప్రైమరీ విద్యాభివృద్ధికి దోహదపడుతుందని గమనించాలి. 
4. ఆచరణీయ మార్గం చేపట్టాలి: ఒకేసారి సార్వత్రిక ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ సాధ్యం కాకపోతే దశలవారీగా చేపట్టాలి. మొదట ఎక్కువ నమోదు కాగలిగే పెద్ద స్కూళ్లలో ప్రారంభించాలి. ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలోని 19 శాతం (6,600) ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటవ తరగతిలో 47% మంది 5-6 సం.ల పిల్లలు వున్నారు. ఆ పాఠశాలలు మొదటి దశ ప్రీప్రైమరీ స్కూలింగ్ అమలుకు అనువుగా వుంటవి. అన్ని రాష్ట్రాల్లోనూ అలాంటి అవకాశం వుంటుంది. 
      దేశమంతటా ప్రీప్రైమరీ విద్యావ్యాప్తికి పరిస్థితులు పరిపక్వమవుతున్నవి. ఒకవైపు ఎన్ ఈ పీ ద్వారా విధాన పరమైన వత్తిడి, మరోవైపు నిధుల అందుబాటుతో పాటు సివిల్ సొసైటీ సంస్థల సమాయత్తం పెరుగుతోంది. దేశంలోని మొత్తం పాఠశాల విద్యార్థుల్లో 58 శాతం మంది 2.3 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోనే వున్నారు. వారందరికీ దశలవారీగా వచ్చే ఐదేళ్ళలో క్వాలిటీ ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ అందించగలిగితే పాఠశాల విద్య అభ్యసన సామర్ధ్యాల్లో సంక్షోభాన్ని అధిగమించవచ్చునని నివేదికలో వివరించబడింది. @ 
- (రచయిత చైర్మన్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్)

చెమటోడిస్తే మొహం మెరుస్తదా?

కష్టపడితే మొఖం మెరుస్తదా?
                                          నాగటి నారాయణ 
       గత నెల జనవరి 24 న ఢిల్లీలో జరిగిన "ప్రధానమంత్రి బాల పురస్కార్ 2020" ప్రధానోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 5-18 సంవత్సరాల వయసు పిల్లల్లో వివిధ అంశాల్లో (నూతన ఆవిష్కరణ, సామాజిక సేవ, పాండిత్యం, క్రీడలు, కళలు, సంస్కృతి  ధైర్య సాహసాలు) ప్రతిభావంతులైన 49 మందికి మెడల్, సర్టిఫికేట్ మరియు లక్ష రూపాయల పారితోషికం యిచ్చే కార్యక్రమం అది. ఆ పిల్లలకు యిచ్చిన సందేశంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ముఖ వర్చస్సు గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. "మీ ముఖం ప్రకాశిస్తూ వుండటానికి గల కారణం ఏమిటి" అని చాలా సంవత్సరాల క్రితం కొందరు అడిగారట. "నేను బాగా కస్టపడి పనిచేస్తాను, పనిలో వచ్చే చెమటతోనే ముఖం మసాజ్ అవుతుంది, అందువలనే నా ముఖం మెరిసిపోతుంది" అని వారికి సింపులుగా సమాధానం చెప్పారట. "మీరు కూడా రోజుకి నాలుగు సార్లు చెమటలు కక్కేలాగ కస్టపడి పనిచేయాలి" అని పిల్లలకు యిచ్చిన సందేశంలో చెప్పారు.
      ప్రధాని ముఖ వర్చస్సు రహస్యం గురించి ఇంగ్లీష్ దినపత్రికల్లో వచ్చిన వార్తలు చూసిన నాకు ఒకింత ఆశ్చర్యం కలిగింది. బాగా కష్టపడి పనిచేసి చెమటోడ్చితేనే ముఖం వెలిగిపోతుందా? అనే సందేహమూ మెదిలింది. మన దేశంలో కష్టపడి పనిచేసేవారు కోట్లాదిమంది వున్నారు. వారి మొఖాలు వెలిగిపోవడం కాదు వెలవెల పోతున్నాయి. గ్రామసీమల్లో వానైనా, ఒరుపైనా పగలంతా పొలాల్లో కష్టపడి పనిచేసే రైతులు, కూలీలు వున్నారు. పట్టణాల్లో పరిశ్రమల్లో, భవన నిర్మాణాల్లో పనిచేసేవారు, అడ్డామీది కూలీలు ఎందరో కష్టపడి పనిచేస్తున్నారు. గని కార్మికులు, వలస కూలీలు, మత్య కార్మికులు, క్వారీల్లో పనిచేసేవారు ప్రతిరోజూ గంటల తరబడి చెమటోడుస్తూనే ఉన్నారు. అలాంటి కష్టజీవుల ముఖాలు వాడిపోయి మాడిపోతున్నాయే తప్ప వెలిగిపోవడం లేదే? ఏ పనీ చేయకుండా తిని తిరిగేవారు, ఏసీ రూముల్లో గడిపేవారే గ్లామరసుగా వుంటున్న విషయం తెలిసిందే. బతుకు తెరువు కోసం కష్టపడాల్సిన అవసరం లేనివారు అందం కోసం, ఆరోగ్యం కోసం, శరీర సౌష్టవం కోసం, అవయవాల ఆకృతి కోసం వ్యాయామం, జిమ్ము, యోగా చేసే వారు కొంతకాలం గ్లామరుగా వున్నట్లు కనిపించవచ్చు. మంది కష్టార్జితంతో సుఖంగా జీవించేవారికి అందంగా వుండి మొఖాలు మెరిసిపోయే అవకాశం వుంటుందేమో కానీ కష్టజీవులకు సాధ్యం కాదనే విషయం అందరికీ తెలిసిందే. 
       'కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదానా, బుగ్గమీదా గులాబిరంగు  ఎలా వచ్చేనో చెప్పగలవా? … నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో మాడిపోతే, వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో…' అనే సినిమా పాట వింటే అందం, ఐశ్వర్యం ఎలా వస్తాయో సులభంగా తెలుస్తుంది. ఈనాటి మార్కెట్ యుగంలో ఫిట్నెస్ కోసం, ముఖ వర్చస్సు కోసం పెద్ద వ్యాపారమే నడుస్తోంది. కాస్మొటిక్స్, సెలూన్లు, బ్యూటీ పార్లర్లు, జిమ్ములు, యోగా  వగైరా కోసం యువకుల్లో చాలా మంది నెలకి సగటున రూ 2-6 వేలు ఖర్చు చేస్తున్నట్లు కొన్ని సర్వేల ద్వారా తెలుస్తోంది. బాబా రాందేవ్ పతంజలి ఆయుర్వేద ఉత్పత్తులు 2019-20 మొదటి మూడు మాసాల్లోనే రూ 3,562 కోట్లు సంపాదించినట్లు ప్రకటించారు. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ మొత్తం భారతీయుల సొమ్ము సౌందర్య సాధనాలు ఉత్పత్తి చేసే విదేశీ కంపెనీలు కొల్లగొడుతున్నవి. ఈ విషయంలో ప్రధాని జోక్యం చేసుకొని చర్మ సౌందర్యాన్ని, ముఖ వర్ఛస్సును కాపాడుకునే మెళుకువలు ప్రచారం చేస్తే యువతకి, దేశానికీ ఎంతో మేలు జరుగుతుంది. 
       చమట కారేంతగా కష్టపడితే ఆరోగ్యరమైన ఎదుగుదల, దేహ దారుడ్యంతో పాటు చర్మం, ముఖం కాంతివంతంగా వుండే విషయం నిజమే. అంత కష్ట పడాల్సిన అవసరం విద్యార్థులకు ఆటల్లో మాత్రమే వుంటుంది. విద్యార్థులు పాఠశాల సమయం చివరి పీరియాడ్సులో అలసిపోయే దాకా ఆటలు ఆదుకోవడం అనేది ఒకనాటి మాట. రెసిడెన్షియల్ స్కూల్సులో తప్ప డే స్కూల్సులో ఆటలు ఆడే అవకాశం ఈనాడు లేదు. అత్యధిక పాఠశాలల్లో పిఈటీలు లేరు. కొన్ని స్కూళ్లలో వున్నా సహోపాధ్యాయులతో కలిసి హోమ్ బెల్లు కొట్టగానే బండెక్కుతారు, బస్సెక్కుతారు తప్ప పొద్దుగూకే దాకా పిల్లలకు ఆటలు నేర్పడం లేదు. కొన్ని స్కూళ్లలో సిన్సియరుగా పనిచేసే వ్యాయామోపాధ్యాయులు వున్నా ఆటలు, క్రీడలకు అవసరమైన పరికరాలు లేవు. ప్రైవేట్ స్కూల్సులో కొద్దిమంది సెలెక్టెడ్ విద్యార్థులకు తప్ప అందరికీ ఆటలు నేర్పడం లేదు. అందువలన ఈనాటి విద్యార్థులకు రోజుకి నాలుగు సార్లు చమటలు కారేంతగా కష్టపడాల్సిన అవసరం ఎక్కడుంది? 
      అయినా ప్రధాని అంతగా కష్టపడుతున్నది ముఖ వర్చస్సు కోసమేనా దేశం కోసం కాదా అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. అంత కస్టపడి పని చేస్తుంటే దేశ ఆర్ధిక పరిస్థితి ఎందుకు దిగజారిపోతోంది? నరేంద్ర మోదీ అధికారంలో కొచ్చిన 2014-15 సం.లో 8 శాతముగా వున్న స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) ఈనాడు 5.6 శాతంకి దిగజారిందే! 73% దేశ సంపద ఒక్క శాతం మంది సంపన్నుల వద్దే పోగుపడుతుంటే ఏమి చేస్తున్నట్లు?, 2016 లో 5.9% వున్న నిరుద్యోగిత రేటు 2019 కి 7.2% వరకు పెరిగిపోతే ఏమి చేస్తున్నట్లు? అనే చాలా ప్రశ్నలు ముసురుకుంటున్నవి. 
- నాగటి నారాయణ, చైర్మన్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సిఈఎస్) 9490300577