15, నవంబర్ 2021, సోమవారం

31, జులై 2021, శనివారం

Reforms produced Wealth, not Welfare

 



 సంస్కరణలతో సంపద సరే, సంక్షేమం?
                                                                                          నాగటి నారాయణ 
       భారత ఆర్ధిక వ్యవస్థను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన సంస్కరణలు అమల్లోకి వచ్చి 30 సంవత్సరాలు గడిచింది. 1991 జూలై 24 న ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించిన సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. భారీగా పెరిగిపోయిన ద్రవ్యలోటు, విదేశీ చెల్లింపుల్లో ఏర్పడిన అగాధం, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్భణం, నిండుకున్న విదేశీ మారక నిల్వలు మరియు అసాధారంగా పెరిగిపోయిన ధరలు తదితర సమస్యలతో ఉత్పన్నమైన ఆర్ధిక సంక్షోభం నుండి బయట పడడానికి మౌలిక సంస్కరణలు అనివార్యం అని డాక్టర్ మన్మోహన్ చెప్పారు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) లో ద్రవ్యలోటు 1980-81 నుండి 1990-91 మధ్యలో 5.7% నుండి 6.6 శాతం కి పెరిగింది. దానితో ఇంటా బయటా పెద్ద ఎత్తున అప్పులు చేసి వడ్డీలు కూడా చెల్లించలేని రుణ వలయంలో చిక్కుకోవడం జరిగింది. ఆ దశాబ్ద కాలంలోనే కరెంట్ ఎకౌంట్ లోటు 1.35% నుండి 3.69% కి పెరిగింది. దానితో అంతర్జాతీయ మార్కెట్లో అప్పులు చేయాల్సి వచ్చింది. ఫలితంగా విదేశీ ఋణం తడిసి మోపెడై జీడీపీలో 23% కి ఎగబాకింది. దేశీయ ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవడం వల్ల ఎగుమతులకు గిరాకీ లేకపోయింది. ద్రవ్యలోటును తట్టుకోవడానికి ఆర్బీఐని ఆశ్రయించి నోట్ల ముద్రణకు పాల్పడడంతో ద్రవ్యోల్భణం 6.7% నుండి 10.3% కి పెరగడంతో సరుకుల ధరలు అందనంతగా పెరిగాయి. ఆదాయాల్లో అసమానతలను తగ్గించి, పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ రంగ సంస్థలు దివాళాతీసి గుదిబండగా మారాయి. ఇలాంటి జఠిల సమస్యల నుండి దేశాన్ని రక్షించడం కోసమే ఆర్ధిక విధానాలను సరళీకరించ వలసి వచ్చిందని అయన పేర్కొన్నారు. దిగుమతి సుంకాలను తగ్గించడం, పెట్టుబడులపై నియంత్రణలను సులభతరం చేయడం, ప్రైవేట్ మరియు విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం, కరెన్సీ విలువను తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించడం మున్నగునవి సంస్కరణల్లో ముఖ్యమైనవి. ఇవే సంక్షిప్తంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పీజీ) గా ప్రాచుర్యం పొందాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతదేశం ఎంచుకొన్న సోషలిస్టు తరహా ఆర్ధిక విధానం లేదా మిశ్రమ ఆర్ధిక విధానం అనేది మార్కెట్ ఆధారిత పెట్టుబడిదారీ విధానంగా మారిపోయింది. 
       ముప్పయ్యేళ్ల సంస్కరణల ఫలితాలను ప్రభుత్వమే అధికారికంగా సమీక్షించి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. కాంగ్రేస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈ విషయంలో పెద్ద ఎత్తున సంబరాలే జరిగేవి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ/ఎన్డీయే  ప్రభుత్వం అవే సంస్కరణలను అమలు చేస్తున్నా ఆ విషయాన్ని పట్టించుకున్నట్లు లేదు. సమీక్షిస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుందనే సందేహంతో కావచ్చు. అయినా ఆ సంస్కరణలను రూపొందించిన మన్మోహన్ సింగ్ తో పాటు ఆనాటి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్బీఐ గవర్నర్ సి. రంగరాజన్ మరియు నేడు కేంద్ర ఆర్ధిక శాఖలో కార్యదర్శిగా పని చేస్తున్న టీ.వీ.సోమనాధన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ మరియు పారిశ్రామిక రంగంలో దిగ్గజాలైన ముఖేష్ అంబానీ, ఉదయ్ కోటక్ తదితర ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు జాతీయ దినపత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలిస్తే సంస్కరణల ఫలితాల సంగ్రహ రూపం తెలుస్తోంది. సదరు కథనాలు, ఇంటర్వ్యూలు మరియు జాతీయ అంతర్జాతీయ నివేదికలు, బడ్జెట్ పత్రాల్లో ప్రకటించబడిన వివరాల మేరకు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో సంపద వృద్ధిలో, ఆర్ధిక లావాదేవీల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది.. కానీ విద్య, వైద్యం, ఉపాధి తదితర సంక్షేమ చర్యల్లో చెప్పుకోదగిన ప్రగతి లేదని తెలుస్తోంది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 1991 లో రూ. 5,86,212 కోట్లు నుండి రూ. 1,35,76,086 కోట్లకు (సగటున సంవత్సరానికి 7% చొప్పున)) పెరిగింది. తలసరి సగటు ఆదాయం రూ. 6,270 లు నుండి రూ. 93,293 లకు పెరిగి, పేదరికం 45,3% నుండి 22.% కి తగ్గింది. నాలుగవ తరగతి ఉద్యోగుల నెల జీతం రూ. 750 లు నుండి రూ. 18,000 లకు మరియు కేబినెట్ సెక్రటరీ నెల జీతం రూ. 30,000 లు నుండి రూ. 2.5 లక్షలకు పెరిగినట్లే అన్ని కేడర్లలోని ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరిగాయి. ఫోన్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, కంప్యూటర్లు వినియోగించే మధ్య తరగతి జనాభా బాగా పెరిగింది. విదేశీ మారక నిల్వలు 5.8 బిలియన్ డాలర్ల నుండి 360.8 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సెన్సెక్స్ మున్నగు అన్ని విషయాల్లోనూ పెరుగుదల నమోదైంది. పెరిగిన సంపదలో అసమాన 
       సంస్కరణల ఫలితాల్లో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా వున్నాయి. సానుకూల అంశాలు కూడా కొందరికే తప్ప అందరికీ దక్కలేదనే అసంతృప్తి తీవ్రంగా వుంది. పెరిగిన సంపద అసమాన పంపిణీ వలన కుబేరుల సంఖ్య, వారి ఆస్తులు పెరుగుతూ సమాంతరంగా పేదల సంఖ్య కూడా కొనసాగుతోంది. భారతదేశంలో ఆర్ధిక వృద్ధి ఎంత వేగంగా పెరుగుతుందో అంతకంటే ఎక్కువగా అసమానతలు పెరుగుతున్నాయని ఆక్సుఫార్మ్ అంతర్జాతీయ సంస్థ నివేదిక వెల్లడించింది. 130 కోట్ల జనాభాలో ఒక్క శాతం మంది సంపన్నుల వద్ద 77% జాతీయ సంపద పోగుపడిందని, జనాభాలో 50% కంటే ఎక్కువగా వుండే పేద మధ్య తరగతి వారికి ఒక్క శాతం జాతీయ సంపద మాత్రమే దక్కుతుందని ఆ సంస్థ పేర్కొన్నది. సంపన్నులపై వేయాల్సిన ప్రత్యక్ష పన్నులు తగ్గిస్తూ పరోక్ష పన్నులు పెంచడం వలన పేదలు, మధ్య తరగతి ఆదాయాలు హరించుకు పోతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించడం మరియు ఆ సంస్థలను అమ్మేయడం వలన ఉద్యోగాలు ఎగిరిపోతున్నవి. ప్రభుత్వ శాఖలు, సంస్థలు కుదించుకు పోవడంతో రిజర్వేషన్ అవకాశాలు సన్నగిల్లి సంక్షేమం, సామజిక న్యాయం కృశించి పోతోంది. పిల్లల చదువుల కోసం కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నాణ్యమైన విద్య, వైద్యం అనేకమందికి అందని ద్రాక్షగానే వుంది. ఐఐటీ, ఐఐఎస్సీ వంటి కొన్ని సాంకేతిక వృత్తి విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగినా పాఠశాల విద్యలో అభ్యసన సామర్ధ్యాలు లేకపోవడం, డిగ్రీలు చదివిన వారిలో నైపుణ్యాలు లేకపోవడం వంటి లోపాలు భవిష్యత్తును దెబ్బతీస్తున్నవి. నిరుద్యోగం పెరిగిపోతోంది. వైద్య ఆరోగ్య రంగాల్లోని వైఫల్యం కోవిడ్-19 తో కొట్టొచ్చినట్లు కనిపించింది. 
       సమాజ అభివృద్ధికి పునాదిగా వుండే ఆర్ధిక రంగంలో జరిగే మార్పులకు రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాలు ప్రభావితం అవుతాయి అనే సూత్రం ముప్పయ్యేళ్ల సంస్కరణల విషయంలోనూ స్పష్టంగా రుజువైంది. సంస్కరణలకు ముందు దేశమంతటా కాంగ్రెస్ పార్టీ, అక్కడక్కడా కమ్యూనిస్ట్ పార్టీలు వుండే రాజకీయ రంగంలో  అనేక కొత్త పార్టీలు ఆవిర్భవించి అధికారంలోకి అచై. అవి బీజేపీ, శివసేన, బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ వగైరా పార్టీలు మున్నగునవి. 1991-96 మధ్య కాలంలో లోక్ సభలో ప్రాతినిధ్యం గల రాజకీయ పార్టీల సంఖ్య 25 నుండి 40 కి పెరిగింది. కేంద్రంలో బహుళ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నవి. విదేశీ పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడులతో రాష్ట్రాలే నేరుగా ఒప్పందాలు చేసుకొనే అవకాశాలు రావడంతో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బలమైన నాయకులుగా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం కంటే ఆయా రాష్ట్రాలే విదేశీ సంస్థలకు పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు కల్పించి ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సంపాదించే స్థాయికి ఎదిగాయి. ఉదాహరణకు సంస్కరణల మొదటి (1991-2001) దశాబ్ద కాలంలోనే మహారాష్ట్ర 456, తమిళనాడు 222, గుజరాత్ 168, ఆంధ్రప్రదేశ్ 124, ఒడిశా 82 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఎన్నికల్లో దళితులు, బలహీన వర్గాల భాగస్వామ్యం పెరిగి రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం జనరల్ నియోజకవర్గాలతో సమానమైంది. మహిళల ఓటింగ్ శాతం పురుషుల ఓటింగ్ శాతం తో సమాన స్థాయికి చేరింది. అధికారాన్ని, ఆర్ధిక స్థాయిని అందిపుచ్చుకోవాలనే ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. 
       ఒకవైపు సంస్కరణల పట్ల అసంతృప్తి, ఆందోళన పెరుగుతుంటే మరోవైపు సంస్కరణల వేగాన్ని మరింత పెంచాలని, లేకపోతె దేశం మరోసారి ఆర్ధిక సంక్షోభంలో పడిపోతుందని పాలకుల ఆందోళన చెందుతున్నారు. ఆ మాటకొస్తే గత ఐదేళ్లుగా ఆర్ధిక వృద్ధి మందగించినట్లు ఆర్బీఐ, నీతి ఆయోగ్ హెచ్చరిస్తున్నాయి. 2016 లో 8.26% గా వున్న జీడీపీ రేటు 2017 లో 6.80%, 2018 లో 6.53%, 2019 లో 4.04% కి దిగజారి 2020 లో మైనస్ 7.96% కి పడిపోయింది. కరోనా సమస్య వలన ఈ విషయంపై పెద్దగా చర్చలు జరగడం లేదు. సంస్కరణలు సుస్థిరంగా ముందుకు పోవడానికి, సంస్కరణల ఫలాలను అందరికీ అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విధాన నిర్ణేతలు, ఆర్ధిక వేత్తలు సూచిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందేవిధంగా సంపద సృష్టి మరియు పంపిణీ జరగాలి. ప్రధమ, ద్వితీయ పారిశ్రామిక విప్లవాల్లో భాగస్వామి కాకపోయినా మూడవ పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించిన భారత్ నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ప్రధాన పాత్ర పోషించాలి. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు పెద్ద ఎత్తున విస్తరించాలి. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, నివాసం, పర్యావరణం సమకూర్చి అందరూ ఆనందంగా జీవించేందుకు అనువుగా సంస్కరణలను మలచాలని కోరుతున్నారు. 

1, ఫిబ్రవరి 2021, సోమవారం

విద్యకు విదిలింపులే: సెస్

 సెస్ ప్రెస్ రిలీజ్ తేదీ 01-02-2021


కేంద్ర బడ్జెట్లో విద్యకి విదిలింపులే: సెస్ 

       ఈసారి (2021-22) కూడా కేంద్ర బడ్జెట్లో విద్యారంగాన్ని చులకనగా చూడడం పట్ల 'సెంటర్ ఫర్ ఎడ్యుకేషల్ స్టడీస్ (సెస్)' అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రతిపాదిత మొత్తం బడ్జెట్ ఖర్చు (రూ. 34.50 లక్షల కోట్లు) లో విద్యకి కేటాయించింది రూ. 93,225 కోట్లు (2.70%) మాత్రమే. బడ్జెట్ ప్రసంగంలో నూతన విద్యా విధానం రావడం పట్ల ఆనందం ప్రకటించిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దాని అమలుకు నిధులు కేటాయించక పోవడం అన్యాయం. కాగా విద్యారంగానికి సంబంధించిన కొన్ని పథకాలకు గతేడాది కంటే నిధులు తగ్గించడం మరీ అన్యాయం. ఉదాహరణకు గతేడాది రూ. 25 కోట్లు కేటాయించిన ఆపరేషన్ డిజిటల్ బోర్డుకు ఈసారి ఒక్క కోటి రూ.లు మాత్రమే కేటాయించారు. డిజిటల్/ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత పెరుగుతున్న పరిస్థితుల్లో దానికి నిధులు తగ్గించడం విచిత్రంగా వుంది. నేషనల్ ఎడ్యుకేషన్ మిషనుకి రూ. 38,860 కోట్లు నుండి రూ. 31,300 (రూ. 7530 కోట్లు) కు తగ్గించడం జరిగింది. కొత్తగా 1500 వరకు నవోదయ/ఏకలవ్య పాఠశాలలను ప్రకటించినందున కేంద్రీయ/నవోదయ విద్యాలయాలకు మాత్రం అదనంగా రూ. 700 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని పాఠశాలలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా యివ్వాల్సిన నిధులను తగ్గించి కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యాలయాలకు పెంచుకోవడం జరిగింది. ఉమ్మడి జాబితాలోని విద్యని విస్మరించడం రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షతకు నిదర్శనం. ఈ అరకొర నిధులతో దేశంలో విద్యారంగం మరింత దివాళా తీసే దుస్థితి దాపురిస్తుందని సెస్ హెచ్చరిస్తోంది. 

నాగటి నారాయణ, చైర్మన్ 

సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సెస్)

1, జనవరి 2021, శుక్రవారం

Social Reformer Savitribai Phule

 సంఘ సంస్కర్త, విద్యా విధాత 

సావిత్రిబాయి ఫూలే 
                         నాగటి నారాయణ 
       భారత సమాజంలో శతాబ్దాల తరబడి అమానుషమైన అణచివేతకు గురైన బహుజన ప్రజానీకంలో అనేక ఆణిముత్యాలు వున్నవి. అందులో సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే అగ్రశ్రేణిలో నిలుస్తుంది. నిమ్న జాతులు, మహిళల విద్యా విజ్ఞానాలకు అడ్డుగా నిలిచిన హైందవ ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదిరించి విజయం సాధించిన ధీర వనిత సావిత్రిబాయి. భారతీయ సమాజాన్ని సంకుచిత సనాతన భావజాలంతో క్రుంగదీసిన బ్రాహ్మణీయ విద్యా విధానాన్ని అధిగమించే ప్రగతిశీల ఆంగ్ల విద్య ప్రవేశంతో అణగారిన జాతులకు అరుణోదయమైంది. ఆ చారిత్రక అవకాశాన్ని అందిపుచుకొన్న వారిలో కొందరు చరితార్థులైనారు. వారిలో సావిత్రిబాయి ఆధునిక భారత దేశంలో తొలి మహిళా టీచరుగా, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధిగాంచారు. ప్రపంచంలో భారత దేశం మానవ వనరుల్లో, సహజ సంపదలో ఎంతో గొప్పది. అయినా అక్షరాస్యతలో, విద్యా విజ్ఞానాల్లో చాలా వెనుకబడి వుంది. అందుకు ప్రధాన కారణం దళితులు, సూద్రులు మహిళలకు విద్యను నిరాకరించిన మనువాద మైకమే. ఆ విషయాన్ని అర్ధం చేసుకొని అభ్యుదయ పధంలో పయనించిన సావిత్రి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె జయంతి ఉత్సవాల నిర్వహణ పట్ల మరియు విద్యాలయాల్లో ఆమె విగ్రహాల ప్రతిష్టాపన పట్ల నానాటికి దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ కార్యక్రమాలు ఒక ఉద్యమంగా, ప్రత్యామ్నాయ సంస్కృతిగా ఊపందుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది. 
       సావిత్రిబాయి 1831 జనవరి 3 న మహారాష్ట్ర సతారా జిల్లాలోని నాయగం గ్రామంలో జన్మించింది, ఆమె తల్లిదండ్రులు మాలి కమ్యూనిటీ (ఇప్పుడు ఓబీసీ) కి చెందిన లక్ష్మిబాయి  మరియు ఖండోజీ. పూణేకి 50 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. మహారాష్ట్ర ప్రాంతం 19 వ శతాబ్దం ప్రారంభం వరకు పీష్వాల పాలనలో మనువాద రాజ్యాంగానే నలిగిపోయింది. ఆ రాజ్యంలో అమ్మాయిలకు ముఖ్యంగా సూద్ర కులాల బాలికలకు బడికెళ్ళి చదువుకొనే అవకాశం నిషేధం. చురుకుగా, చొరవగా, పట్టుదలగా వుండే సావిత్రి ఆటపాటల్లోనే అక్రమాలను, ఆధిపత్యాన్ని సహించేదికాదు. ఓసారి సావాసగాళ్ళతో కలిసి ఊరి బయట చిట్టడవిలో ఆడుకుంటున్న వేళ ఓ చెట్టుపైనున్న గూటిలో గల పక్షి గుడ్లను తినడానికి పాకుతున్న పామును చూసి అందరూ భయపడ్డారు. కానీ సావిత్రి ఓ కర్ర తీసుకుని ఆ పామును తలపై కొట్టి పారదోలి పక్షి గుడ్లను కాపాడింది. ఆ విషయం తెలిసిన ఊరి వారంతా ఆమె ధైర్య సాహసాన్ని కొనియాడారు. ఆ కాలంలో బాల్య వివాహాలు సర్వ సాధారణం. ఆడపిల్లలకు ఆరేళ్లకు, మగపిల్లలకు పదేళ్లకు పెళ్లి చేయకపోతే సదరు కుటుంబాలను ఆనాటి సమాజం చాలా చిన్న చూపు చూసేది. అందుకే ఆరేళ్ళ వయసుకే సావిత్రికి పన్నెండేళ్ల వయసు గల జ్యోతిరావుతో పెళ్లి అయింది. జ్యోతిరావు కుటుంబం పూనా వలస వెళ్లి పూల వ్యాపారం చేసుకునేది. అందుచేతనే 'గోరహే' అనే వారి ఇంటి పేరు  'ఫూలే' గా మారిపోయింది. పూలు అమ్ముకొనే జోతిరావులోని తెలివితేటలను గమనించిన అదే మాలి కులస్తుడు లిజిట్ సాబ్ అనే విద్యాధికుడు ఫూలే తండ్రి గోవిందరావుని ఒప్పించి స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చేర్పించాడు. 1847 లో జోతిరావ్ మెట్రిక్యులేషన్ పూర్తి చేసాడు. తాను చదువుకొంటూ, పూల వ్యాపారం చేసుకొంటూ తన భార్య సావిత్రికి ఇంట్లోనే చదువు చెప్పాడు. భర్త నేర్పిన చదువుతోనే స్వయంకృషితో పత్రికలు, పుస్తకాలు చదివి సమాజాన్ని అధ్యయనం చేసి విద్యావంతురాలై పదిమందికీ చదువు చెప్పే స్థాయికి ఎదిగింది. బడికెళ్లే అవకాశం లేకపోయినా భర్త సాయంతో ఇంట్లోనే చదువుకొని ఆ ఊరికే వెలుగై దేశానికే పరిచయమైంది. 
       ఆంగ్లేయుల పాలనతో అందివచ్చిన ఆధునిక విద్య అందరికీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు చదువుకొనే అవకాశం కల్పించింది. ఇంగ్లీష్ మీడియం మిషనరీ పాఠశాలలతో ఆధునిక భారత విద్యా వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ రోజుల్లో చదుకున్న వారిలో అత్యధికులు తాము నేర్చుకున్న విద్యను పదిమందికీ పంచాలనే ఉత్సాహంతో వుండేవారు. చాలామంది స్వంతగా స్కూళ్ళు పెట్టి ఉపాధ్యాయులుగా రాణించారు. 1848 జనవరి 1 న జోతిబా ఒక మిత్రుడి సహాయంతో పూనాలోని బుధవారిపేట నివాసి భిడే ఇంట్లో బాలికా పాఠశాలను ప్రారంభించారు. అందులో టీచరుగా సావిత్రిబాయి నియమించబడినారు. ఆవిధంగా భారత దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే చరిత్రకెక్కింది. ఆ పాఠశాలను దెబ్బతీసేందుకు సనాతన బ్రాహ్మణవాదులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. పాఠశాల నిర్వహణ ఫూలే దంపతులకు అగ్ని పరీక్షగా, కత్తిమీద సాములా తయారైంది. బడికెళ్లేటప్పుడు సావిత్రి చేతి సంచిలో బుక్సుతో పాటు చీర జాకెట్ కూడా వుండేవట. దారిలో సనాతనవాదులు తిట్లు, శాపనార్ధాలతో పాటు పేడ నీళ్లు చల్లేవారట. అందువలన స్కూలుకెళ్లిన తర్వాత చీర మార్చుకోవాల్సివచ్చేదట! బాలికల పాఠశాలలో పని చేయడానికి పురుష ఉపాధ్యాయులు వచ్చేవారు కాదు. అమ్మాయిలను బడికి పంపడానికి పేరెంట్సు ఒప్పుకొనేవారుకాదు. ఆడపిల్లలు చదవడం, రాయడం నేర్చుకోవడమంటే చెడిపోవడానికి తొలిమెట్టుగా మరియు ధర్మభ్రష్టత కలుగుతుందని భావించేవారు. పూనాలో వుండే జోతిబా మిత్రుల కుటుంబాల్లోని పిల్లలనే తీసుకొచ్చి, మిఠాయిలు యిచ్చి, వారి అభిమానాన్ని ప్రేమను పొంది తద్వారా చదువుకు అలవాటు చేసేది. సంవత్సరం తిరిగేసరికి ఆ బడిలో విద్యార్థుల సంఖ్య 50 కి పెరిగింది. రెండో ఏడాదికి 70 కి పెరిగింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. ఆ ఊపుతో మరో రెండేళ్లలో పూనా పరిసర ప్రాంతాల్లో కొన్ని పాఠశాలలు, ఆ తర్వాత రెండేళ్లలో మరికొన్ని ప్రారంభించారు. మూడేళ్ళ స్వల్ప కాలంలోనే ఫూలే దంపతుల యాజమాన్యంలో మొత్తం 18 పాఠశాలలు పనిచేశాయి. 1852 మార్చి 3 వ తేదీన బేతాలపేటలో అంటరాని బాలికల కోసమే ప్రత్యేకంగా ఒక పాఠశాలను ప్రారంభించి, అందులో సావిత్రిబాయినే ప్రధానోపాధ్యాయురాలిగా పని చేసింది. ఆ పాఠశాలను గురించి ప్రత్యేకంగా మెచ్చుకొంటూ "పూణే అబ్సర్వర్" పత్రిక ఇలా వ్రాసింది: "పరోపకారం కోసం పని చేస్తున్న మాలి కులానికి చెందిన వ్యక్తులు కొందరు అశ్ప్రుస్యుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలను వారి స్వంత ఖర్చుతో ప్రారంభించారు. దేశంలోని సంస్కరణవాదులకు యిది సంతోషం కలిగించే వార్త. బేతాలపేటలోని ఈ పాఠశాలలో మహర్,మాంగి, పాకీ కులాలకు చెందిన దళిత బాలలు చదువుకోవడం సంతోషించదగిన విషయం." జోతిబా నెలకొల్పిన పాఠశాలలు సావిత్రిబాయి నేతృత్వంలో ' ది నేటివ్ ఫిమేల్ స్కూల్, పూణే' మరియు 'సొసైటీ ఫర్ ప్రమోటింగ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మాహార్సు, మాంగ్స్' అనే ట్రస్టుల ద్వారా నిర్వహించబడేవి. 
       సావిత్రిబాయి మహిళల్లో చైతన్యం పెంపొందించడానికి మహిళా మండలి ప్రారంభించింది. అంటరానితనం నిర్మూలన, మహిళల సమస్యల పరిష్కారం కోసం భారతదేశంలో నెలకొల్పిన తొలి మహిళా సంస్థ అదే. జోతిబా ఫూలే ప్రారంభించిన 'సత్య శోధక్ సమాజ్' మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పని చేసింది. బాల్య వివాహాల వలన అనారోగ్యంతో, ప్రమాదాలతో భర్తలు మరణించి విధవలుగా మారిన యువతుల పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యేది. అలాంటివారు అత్యాచారాలకు గురై గర్భవతులైతే అనాధలుగా మారిపోయి గర్భస్రావాలకు లేదా ఆత్మహత్యలకు పాల్పడేవారు. గర్భస్రావాలు విఫలమైన మహిళలు కన్న బిడ్డలను కూడా చంపుకోవాల్సి వచ్చేది. అలాంటి పతితులు. భ్రష్టులు, బాధా సర్పద్రష్టులను చేరదీసి ఆదుకోవడానికి బాల హత్యా ప్రతిబంధక్ గృహాన్ని 1853 జనవరి 28 న ఫూలే దంపతులు ఏర్పాటు చేశారు. అది అనాధ ఆశ్రమంగా, పసిబిడ్డల సంరక్షణ స్థలంగా, ప్రసూతి కేంద్రం లాగా పని చేసేది. దురదృష్టవశాత్తు అత్యాచారానికి గురై గర్భం దాల్చిన విధవల్లో కొందరు ఆ గృహంలో తల దాచుకుని బిడ్డను కని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారు. 1873 వ సంవత్సరం వరకు అక్కడ 66 మంది అనాధ బిడ్డలు జన్మించారు. అనేక మంది సంఘ సంస్కర్తలతో పాటు రెనాడే, భండార్కర్ వంటి ప్రముఖులు ఆ కేంద్రానికి అండగా వుండేవారు. పూనా తో పాటు పండరీపురంలో అలాంటిదే మరో గృహాన్ని ఏర్పాటు చేశారు. అత్యాచారాలకు గురైన విధవలు బ్రాహ్మణులతో సహా ఏ కులం వారైనా అక్కున చేర్చుకొని ఆదరించేవారు. మిషనరీ ఆసుపత్రిలో శిక్షణ పొందిన నర్సులు నలుగురు ఆ కేంద్రంలో వైద్య సేవలు అందించేవారు. బాల హత్యా ప్రతిబంధక్ గృహంలో ప్రసవించిన కాశీబాయి అనే బ్రాహ్మణ విధవకు పుట్టిన మగ బిడ్డను ఆమె కోరిక మేరకు సావిత్రిబాయి దత్తత తీసుకొన్నది. యస్వంత్ అనే పేరు పెట్టి పెంచి, చదువు చెప్పించి, డాక్టరుని చేసి, మాలి కులానికి చెందిన ప్రముఖ వ్యక్తి జ్ఞానవా ఔష్ణరావు కూతురు రాధాబాయితో పెళ్లి చేసింది. జోతిబా ఫూలే నిర్వహించిన అన్ని రకాల సామాజిక కార్యక్రమాల్లోనూ భర్తకు తోడుగా వుంటూ తానూ ఎంతో జ్ఞానశీలిగా, ధైర్యశాలిగా ఎదిగింది. పలు పరీక్షా సమయాల్లో భర్తకు రాసిన ఉత్తరాల్లో ఆమె జ్ఞానం, సమయస్ఫూర్తి వెల్లడవుతుంది. జ్ఞానానికి, అధికారానికి గల పరస్పర సంబంధం గురించి చాలా ప్రతిభావంతంగా వివరించేది. స్త్రీలు, బహుజనులు జ్ఞానాన్ని సంపాదించనంత కాలం వారి విముక్తి సాధ్యం కాదని తన కార్యాచరణ ద్వారానే తెలియజేసింది. 1890 లో మరణించిన మహాత్మా జోతిబా ఫూలే చితికి ఆమే స్వయంగా నిప్పంటించారు. ఆయన నడిపిన సామాజిక, సంస్కరణ కార్యక్రమాలు అన్నింటినీ ఆమె చనిపోయేదాకా నిర్వహించింది. 1896 లో మహారాష్ట్రలో పెద్ద కరువు వచ్చి  తిండి లేక, తాగడానికి నీళ్లు కూడా లేక వేలాదిమంది చనిపోయారు. సంపన్నుల నుండి విరాళాలు, ఆహారపదార్ధాలు సేకరించి కరువు అన్న దాన సత్రాలు నిర్వహించి కరువు పీడిత ప్రజలను ఆదుకున్నది. కరువు నుండి తేరుకోక ముందే ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించి రోజుకి కొన్ని వేలమంది దుర్మరణం పాలయ్యేవారు. ఆ ప్రమాదకర పరిస్థితిలో కూడా వ్యాధి పీడితులను ఆదుకోవడానికి సావిత్రిబాయి  అహర్నిశలు శ్రమించింది. చివరకు ఆమె కూడా అనారోగ్యం పాలై 1897 మార్చి 10 న అరవై ఆరవ ఏట మరణించింది. సావిత్రిబాయి ఫూలే పోరాడిన సామాజిక రుగ్మతలు - ఆడవారి అణచివేత, కుల వ్యవస్థ కుళ్ళు, అంటరానితనపు అమానుషత్వం, అగ్రవర్ణాల ఆధిపత్య పీడన, ఆర్ధిక దోపిడీ ఈనాడూ కొనసాగుతూనే వున్నవి. సదరు రుగ్మతల సమూల నిర్ములన కోసం చేసే నిరంతర కార్యాచరణే ఆ మహనీయురాలికి అర్పించే నిజమైన నివాళి కాగలదు. "న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి" అని శాసించిన మనుధర్మాన్ని ఎదిరించి, హిందూ మతం - బ్రాహ్మణ వాదం స్త్రీలపై రుద్దిన అసమానత్వపు, అమానవీయ విలువలను, అంటరానితనం, కుల వ్యవస్థను ధిక్కరించి సావిత్రిబాయి నిర్వహించిన సత్యశోధక ఉద్యమం సామాజిక ఉద్యమాలకు నిరంతర స్ఫూర్తిని అందిస్తుస్తుంది. 
      ఫూలే దంపతులు నడిపిన పాఠశాలల్లో సనాతన బ్రాహ్మణీయ చదువుకు భిన్నంగా ఆధునిక పాశ్చాత్య కరిక్యులం తరహాలో మాత్సు,సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధించారు. సావిత్రిబాయి మంచి రచయిత, కవయిత్రి. 1854 లో ఆమె రాసిన 41 కవితల సంకలనం 'కావ్య ఫూలే' విడుదలైంది. జోతిబా ఫూలే జీవిత విశేషాలతో 'బావన్ కషి సుబోధ రత్నాకర్' పుస్తకాన్ని రచించింది. భారత దేశ చరిత్రపై జోతిబా ప్రసంగాలను మరియు సంఘ సంస్కరణలపై తన ప్రసంగాలను పుస్తకాలుగా ప్రచురించింది. సావిత్రిబాయి రాసిన కవితల్లో ఆధునిక విద్య, సామాజిక చైతన్యానికి సంబంధించినవే ఎక్కువ. వాటిలో ఒకటి: "స్వావలంబన, ఉద్యోగం, జ్ఞానధన సంచయం నిరంతరం చేయాలి!
     విద్య లేనివారు వింత పశువులు, సోమరితనం వీడండి!
సూద్ర- అతి సూద్ర వర్గాల దుఃఖ నివారణ హేతువు చదువు!
ఆంగ్లం నేర్చి ముందుకు సాగాల్సిన అవసరం తెలుసుకో! 
    ఆంగ్ల భాషతో కుల మతాలను కూలగొట్టు!
    భట్ - బ్రాహ్మణ మంత్రాలను పారదోలు!"
       సావిత్రిబాయి ఫూలే వారసత్వం సుసంపన్నమవుతోంది. బహుజన మహిళా ఐకాన్ గా అలరారుతోంది. పూణే సిటీ కార్పొరేషన్ 1983 లో ఆమె గౌరవార్ధం ఒక మెమోరియల్ ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 10 న ఇండియా పోస్ట్ డిపార్టుమెంట్ సావిత్రిబాయి పేరుతో ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. పూణే యూనివర్సిటీని 2015 లో సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్సిటీ గా మార్చడం జరిగింది. ఆమె జీవిత చరిత్రతో కన్నడ భాషలో ఒక బయోపిక్ సినిమా 2018 లో విడుదలైంది. 2020 జనవరి 3 న ఆమె జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. సామాజిక సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఏటా సావిత్రిబాయి ఫూలే జన్మ దినోత్సవాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నవి. కొన్ని పాఠశాలల్లో ఆమె విగ్రహాలు స్థాపించబడినవి. ఆధునిక భారత తొలి మహిళా టీచర్ గా పని చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతిని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆమె మరణించి 124 సంవత్సరాలు గడుస్తున్నా సమాజ సర్వతోముఖ అభివృద్ధికి ఆలంబనగా వుండే విద్యారంగంలో మహిళలు ముఖ్యంగా దళిత మహిళలు యింకా వెనకబడే వున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం జాతీయ సగటు అక్షరాస్యత 74% కంటే 18% తక్కువగా మరియు జాతీయ మహిళా అక్షరాస్యత 64.6% కంటే 8% తక్కువగా  ఎస్.సి. మహిళల అక్షరాస్యత 56.5% గా వున్నది. ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యలలో దళిత మహిళలు నూటికి 20 మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మెరుగు పర్చడానికి సావిత్రిబాయి ఫూలే ఉద్యమ స్ఫూర్తి విస్తరించాలి. 
నాగటి నారాయణ, సామాజిక విద్యావేత్త 9490300577