100% తప్పేనన్న సుప్రీం
సంఘమిత్ర
షెడ్యూల్డ్ ఏరియాల్లో ఉపాధ్యాయ నియామకాలను 100 శాతం స్థానిక గిరిజనులకే రిజర్వ్ చేసిన జీఓ నం. 3; తేదీ 10-01-2000 ను రద్దుచేస్తూ ఏప్రిల్ 22 న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. రిజర్వేషన్లు 50 శాతం కంటే మించరాదనే అధికరణం 16(4) ను అతిక్రమించి ఒక కమ్యూనిటీ వారికే వందశాతం రిజర్ వేషన్ కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ వినీత్ శర్మ, జస్టిస్ ఎం.ఆర్.షా మరియు జస్టిస్ అనిరుధ్ బోస్ లతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం పేర్కొన్నది. రాష్ట్రపతి ఉత్తర్వులైన ఆర్టికిల్ 371(డి) ప్రకారం నియామకాలకు జిల్లా యూనిట్ కాగా ఐదో షెడ్యూల్లోని 5(1) పేరా ఆధారంగా జిల్లాలో ఒక ప్రాంతంలోని నియామకాలను నియంత్ రించే అధికారం గవర్నరుకు లేదని ధర్మాసనం పేర్కొన్నది. షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనులకే ఉద్యోగ అవకాశం కల్పించి అదే ప్రాంతంలోని ఎస్సి, బీసీ తరగతుల వారికి నిషేధించడం అన్యాయం. షెడ్యూల్డ్ ఏరియాలో 1950 జనవరి 26 కి ముందు నుండి నివాసం వుంటున్న స్థానిక గిరిజనులకే నియామకాల అర్హత కల్పించి ఆ తర్వాత నుండి ఆ ప్రాంతంలో స్థిరపడిన గిరిజనులతో సహా గిరిజనేతరులు అందరినీ అనర్హులను చేయడం అహేతుకం, అక్రమం. ఒక తరగతి వారికి రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన వారికి రాజ్యాంగం మూడవ భాగంలో కల్పించబడిన ప్రాధమిక హక్కులను హరించడం చెల్లదు. అందువలన వంద శాతం రిజర్వేషన్ ఉత్తర్వులను కొట్టివేస్తున్నట్ లు ధర్మాసనం ప్రకటించింది.
షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ మరియు సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరతుల వా రి అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ప్రత్యేక సదుపాయాలు కల్పించవచ్చని రాజ్యాం గ అధికరణలు 15(4) మరియు 16(4) చెబుతున్నవి. అందులో భాగంగానే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల సదుపాయం కల్పించబడింది. రిజర్వే షన్లు ఎవరికి ఎంత వుండాలనేది కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నిర్ణయిస్తున్న విషయం తెలిసిందే. జనాభా ప్రాతిపదికన ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో షెడ్యూల్డ్ జాతుల వారికి 7.5% రిజర్వేషన్ అమల్లో వుంది. తెలుగు రాష్ట్రాల్లో 6 శాతం వుంది. గిరిజన జాతుల జనాభా గణనీయంగా వున్న కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ల శాతం వివిధ రకాలుగా వుంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్ రాష్ట్రాల్లో 80% చొప్పున, అస్సాంలో 15%, చత్తీసుగఢ్ లో 32%, గుజరాతులో 14%, జార్ఖండులో 27%, ఒడిశాలో 22% మరియు త్రిపుర రాష్ట్రంలో 31 శాతం గిరిజనులకు రిజర్వేషన్ వుంది. చత్తీసుగఢ్, జార్ఖండ్, గుజరాత్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్టాల్లోని షెడ్యూల్డ్ ఏరియాల్లోని ఉద్యోగాలకు కూడా అవే పర్శంటేజీల ప్రకారం గిరిజన రిజర్వేషన్లు వున్నవి. తెలుగు రాష్ట్రాల్లోని షెడ్యూల్డ్ ఏరియాలో మాత్రమే 100% రిజర్వేషన్ 2000 సంవత్సరం నుండి అమలు చేయబడింది.
జీఓ 3 వలన షెడ్యూల్డ్ ఏరియా ఎక్కువగా వున్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని ఖమ్మం, ఆదిలాబాద్, వరంగల్ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోని గిరిజనేతరులు ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందే అవకాశం లేకుండా పోయింది. ఓపెన్ కేటగిరీతో పాటు ఎస్సి, ఓబీసీ అభ్యర్థులు కూడా ఉద్యోగార్హత కోల్పోయారు. అంతేకాదు జీఓ 3 వచ్చిన 2000 సంవత్సరం జనవరి 10 వ తేదీ కంటే ముందు నుండి సెకండరీ గ్రేడ్ టీచర్లుగా, గ్రేడ్ 2 భాషా పండితులుగా, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లుగా పనిచేస్తున్న గిరిజనేతర ఉపాధ్యాయులకు స్కూల్ అసిస్టెంట్లుగా మరియు హైస్కూల్ హెడ్మాష్టర్లుగా ప్రమోషన్స్ కూడా ఇవ్వలేదు. విద్యాశాఖలోని ఉపాధ్యాయ పోస్టులకు యిచ్చిన జీఓ 3 ఆధారంగా అటవీ, ఆబ్కారీ, వ్యవసాయం, పశుసంవర్ధక తదితర ఇరవై ప్రభుత్వ శాఖల్లోని క్లాస్ 4, క్లాస్ 3 ఉద్యోగాలు అన్నీ గిరిజనులకే రిజర్వ్ చేయడంతో షెడ్యూల్డ్ ఏరియాలోని గిరిజనేతరులు ఎవరికీ ఏ ఉద్యోగమూ పొందే అవకాశం లేకుండా పోయింది. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన జనాభా గణనీయంగా వుంటుందే తప్ప గిరిజనేతర జనాభా కంటే ఎక్కువేమీ కాదు. ఉదాహరణకు 1991 సెన్సెస్ ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 33 మండలాల్లో గిరిజన జనాభా 50% లోపుగానే వుందని తీర్పు పత్రంలో పేర్కొనబడింది. గోదావరి నదీ తీరాన వుండే తొమ్మిది మండలాల్లో మాత్రమే 53% నుండి 77% వరకు గిరిజన జనాభా వుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజన జనాభా 33.31 శాతం వుంటే గిరిజనేతర జనాభా 60.69% వుంది. ఈ అసంబద్ధ రిజర్వేషన్ వలన షెడ్యూల్డ్ ఏరియా జనాభాలో మెజారిటీగా వున్న గిరిజనేతరులకు ప్రభుత్వ ఉద్యోగాలు నిషేధించబడినవి. ఇంత పెద్ద సమస్య 20 సంవత్సరాలుగా నలుగుతున్నా ఉద్యమ రూపం దాల్చక పోవడం తెలుగు ప్రజల సామాజిక సంయమనానికి నిదర్శనం.
షెడ్యూల్డ్ ఏరియాలోని ఉపాధ్యాయ పోస్టులను నూరుశాతం స్థానిక గిరిజనులకే ఎందుకు రిజర్వ్ చేశారనే ప్రశ్నకు తెలంగాణ ప్రభుత్వ తరఫు సీనియర్ కౌన్సిల్ డాక్టర్ రాజీవ్ ధావన్ చెప్పిన కారణాలతో సుప్రీం ధర్మాసనం సంతృప్తి చెందలేదు. గిరిజన పిల్లలకు గిరిజన ఉపాధ్యాయులైతేనే చదువు సరిగా చెబుతారని, గిరిజనేతర ఉపాధ్యాయుల్లాగా గైర్హాజరు ఉండదనే వాదనతో న్యా యమూర్తులు ఏకీభవించ లేదు. సరైన వసతులు, ప్రోత్సాహకాలు కల్పిస్తే ఎవరైనా బాగానే పనిచేస్తారని అన్నారు. షెడ్యూల్డ్ ఏరియాలో గిరిజనేతర ఉపాధ్యాయులు మంచిగా చదువు చెప్పలేరా అని ప్రశ్నించారు. అన్ని కులాల వారిని సమన్వయం చేసే రోస్టర్ పాయింట్సుని విస్మరించి ఏకపక్షంగా గిరిజను లనే నియమించడం వలన సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందన్నారు. అందువలన 100% రిజర్వేషన్ తప్పు గనుక జీఓ 3/2000 ను రద్దు చేస్తున్నామని ప్రకటించారు. అయితే ఆ జీఓ ప్రకారం 2000 సంవత్సరం నుండి నియమించబడి పనిచేస్తున్న గిరిజన ఉపాధ్యాయలను తొలగించకుం డా సర్వీసులో కొనసాగించాలని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు రెట్రాస్పెక్టివుగా 2000 జనవరి 10 నుండి కాకుండా ప్రాస్పెక్టివుగా అంటే తీర్పు చెప్పిన 2020 ఏప్రిల్ 22 నుండి అమలుచేయాలని ఆదేశించడంతో వేలాదిమంది గిరిజన ఉపాధ్యాయులకు ఉపశమనం లభించింది. @
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి