1, ఫిబ్రవరి 2021, సోమవారం

విద్యకు విదిలింపులే: సెస్

 సెస్ ప్రెస్ రిలీజ్ తేదీ 01-02-2021


కేంద్ర బడ్జెట్లో విద్యకి విదిలింపులే: సెస్ 

       ఈసారి (2021-22) కూడా కేంద్ర బడ్జెట్లో విద్యారంగాన్ని చులకనగా చూడడం పట్ల 'సెంటర్ ఫర్ ఎడ్యుకేషల్ స్టడీస్ (సెస్)' అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేస్తున్నది. ప్రతిపాదిత మొత్తం బడ్జెట్ ఖర్చు (రూ. 34.50 లక్షల కోట్లు) లో విద్యకి కేటాయించింది రూ. 93,225 కోట్లు (2.70%) మాత్రమే. బడ్జెట్ ప్రసంగంలో నూతన విద్యా విధానం రావడం పట్ల ఆనందం ప్రకటించిన ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ దాని అమలుకు నిధులు కేటాయించక పోవడం అన్యాయం. కాగా విద్యారంగానికి సంబంధించిన కొన్ని పథకాలకు గతేడాది కంటే నిధులు తగ్గించడం మరీ అన్యాయం. ఉదాహరణకు గతేడాది రూ. 25 కోట్లు కేటాయించిన ఆపరేషన్ డిజిటల్ బోర్డుకు ఈసారి ఒక్క కోటి రూ.లు మాత్రమే కేటాయించారు. డిజిటల్/ఆన్లైన్ ఎడ్యుకేషన్ కు ప్రాధాన్యత పెరుగుతున్న పరిస్థితుల్లో దానికి నిధులు తగ్గించడం విచిత్రంగా వుంది. నేషనల్ ఎడ్యుకేషన్ మిషనుకి రూ. 38,860 కోట్లు నుండి రూ. 31,300 (రూ. 7530 కోట్లు) కు తగ్గించడం జరిగింది. కొత్తగా 1500 వరకు నవోదయ/ఏకలవ్య పాఠశాలలను ప్రకటించినందున కేంద్రీయ/నవోదయ విద్యాలయాలకు మాత్రం అదనంగా రూ. 700 కోట్లు కేటాయించారు. రాష్ట్ర ప్రభుత్వాల నిర్వహణలోని పాఠశాలలకు కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా యివ్వాల్సిన నిధులను తగ్గించి కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని విద్యాలయాలకు పెంచుకోవడం జరిగింది. ఉమ్మడి జాబితాలోని విద్యని విస్మరించడం రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వ వివక్షతకు నిదర్శనం. ఈ అరకొర నిధులతో దేశంలో విద్యారంగం మరింత దివాళా తీసే దుస్థితి దాపురిస్తుందని సెస్ హెచ్చరిస్తోంది. 

నాగటి నారాయణ, చైర్మన్ 

సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సెస్)