31, జులై 2021, శనివారం

Reforms produced Wealth, not Welfare

 



 సంస్కరణలతో సంపద సరే, సంక్షేమం?
                                                                                          నాగటి నారాయణ 
       భారత ఆర్ధిక వ్యవస్థను అత్యంత తీవ్రంగా ప్రభావితం చేసిన సంస్కరణలు అమల్లోకి వచ్చి 30 సంవత్సరాలు గడిచింది. 1991 జూలై 24 న ఆనాటి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంటుకు సమర్పించిన బడ్జెట్ ప్రసంగంలో ప్రతిపాదించిన సంస్కరణలతో ఆర్ధిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. భారీగా పెరిగిపోయిన ద్రవ్యలోటు, విదేశీ చెల్లింపుల్లో ఏర్పడిన అగాధం, ఆకాశాన్నంటిన ద్రవ్యోల్భణం, నిండుకున్న విదేశీ మారక నిల్వలు మరియు అసాధారంగా పెరిగిపోయిన ధరలు తదితర సమస్యలతో ఉత్పన్నమైన ఆర్ధిక సంక్షోభం నుండి బయట పడడానికి మౌలిక సంస్కరణలు అనివార్యం అని డాక్టర్ మన్మోహన్ చెప్పారు. జాతీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) లో ద్రవ్యలోటు 1980-81 నుండి 1990-91 మధ్యలో 5.7% నుండి 6.6 శాతం కి పెరిగింది. దానితో ఇంటా బయటా పెద్ద ఎత్తున అప్పులు చేసి వడ్డీలు కూడా చెల్లించలేని రుణ వలయంలో చిక్కుకోవడం జరిగింది. ఆ దశాబ్ద కాలంలోనే కరెంట్ ఎకౌంట్ లోటు 1.35% నుండి 3.69% కి పెరిగింది. దానితో అంతర్జాతీయ మార్కెట్లో అప్పులు చేయాల్సి వచ్చింది. ఫలితంగా విదేశీ ఋణం తడిసి మోపెడై జీడీపీలో 23% కి ఎగబాకింది. దేశీయ ఉత్పత్తుల్లో నాణ్యత లేకపోవడం వల్ల ఎగుమతులకు గిరాకీ లేకపోయింది. ద్రవ్యలోటును తట్టుకోవడానికి ఆర్బీఐని ఆశ్రయించి నోట్ల ముద్రణకు పాల్పడడంతో ద్రవ్యోల్భణం 6.7% నుండి 10.3% కి పెరగడంతో సరుకుల ధరలు అందనంతగా పెరిగాయి. ఆదాయాల్లో అసమానతలను తగ్గించి, పేదరికాన్ని ఎదుర్కోవడానికి ఉద్దేశించిన ప్రభుత్వ రంగ సంస్థలు దివాళాతీసి గుదిబండగా మారాయి. ఇలాంటి జఠిల సమస్యల నుండి దేశాన్ని రక్షించడం కోసమే ఆర్ధిక విధానాలను సరళీకరించ వలసి వచ్చిందని అయన పేర్కొన్నారు. దిగుమతి సుంకాలను తగ్గించడం, పెట్టుబడులపై నియంత్రణలను సులభతరం చేయడం, ప్రైవేట్ మరియు విదేశీ పెట్టుబడులకు అవకాశాలు కల్పించడం, కరెన్సీ విలువను తగ్గించి ఎగుమతులను ప్రోత్సహించడం మున్నగునవి సంస్కరణల్లో ముఖ్యమైనవి. ఇవే సంక్షిప్తంగా లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ (ఎల్పీజీ) గా ప్రాచుర్యం పొందాయి. ఒక్క మాటలో చెప్పాలంటే స్వతంత్ర భారతదేశం ఎంచుకొన్న సోషలిస్టు తరహా ఆర్ధిక విధానం లేదా మిశ్రమ ఆర్ధిక విధానం అనేది మార్కెట్ ఆధారిత పెట్టుబడిదారీ విధానంగా మారిపోయింది. 
       ముప్పయ్యేళ్ల సంస్కరణల ఫలితాలను ప్రభుత్వమే అధికారికంగా సమీక్షించి ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. కాంగ్రేస్ పార్టీ అధికారంలో ఉండి ఉంటే ఈ విషయంలో పెద్ద ఎత్తున సంబరాలే జరిగేవి. నరేంద్ర మోడీ నాయకత్వంలోని బీజేపీ/ఎన్డీయే  ప్రభుత్వం అవే సంస్కరణలను అమలు చేస్తున్నా ఆ విషయాన్ని పట్టించుకున్నట్లు లేదు. సమీక్షిస్తే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి పోతుందనే సందేహంతో కావచ్చు. అయినా ఆ సంస్కరణలను రూపొందించిన మన్మోహన్ సింగ్ తో పాటు ఆనాటి ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా, ఆర్బీఐ గవర్నర్ సి. రంగరాజన్ మరియు నేడు కేంద్ర ఆర్ధిక శాఖలో కార్యదర్శిగా పని చేస్తున్న టీ.వీ.సోమనాధన్, ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ మరియు పారిశ్రామిక రంగంలో దిగ్గజాలైన ముఖేష్ అంబానీ, ఉదయ్ కోటక్ తదితర ప్రముఖుల ఇంటర్వ్యూలు మరియు జాతీయ దినపత్రికల్లో వచ్చిన కథనాలను పరిశీలిస్తే సంస్కరణల ఫలితాల సంగ్రహ రూపం తెలుస్తోంది. సదరు కథనాలు, ఇంటర్వ్యూలు మరియు జాతీయ అంతర్జాతీయ నివేదికలు, బడ్జెట్ పత్రాల్లో ప్రకటించబడిన వివరాల మేరకు గడిచిన మూడు దశాబ్దాల కాలంలో సంపద వృద్ధిలో, ఆర్ధిక లావాదేవీల్లో గణనీయమైన అభివృద్ధి జరిగింది.. కానీ విద్య, వైద్యం, ఉపాధి తదితర సంక్షేమ చర్యల్లో చెప్పుకోదగిన ప్రగతి లేదని తెలుస్తోంది. స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) 1991 లో రూ. 5,86,212 కోట్లు నుండి రూ. 1,35,76,086 కోట్లకు (సగటున సంవత్సరానికి 7% చొప్పున)) పెరిగింది. తలసరి సగటు ఆదాయం రూ. 6,270 లు నుండి రూ. 93,293 లకు పెరిగి, పేదరికం 45,3% నుండి 22.% కి తగ్గింది. నాలుగవ తరగతి ఉద్యోగుల నెల జీతం రూ. 750 లు నుండి రూ. 18,000 లకు మరియు కేబినెట్ సెక్రటరీ నెల జీతం రూ. 30,000 లు నుండి రూ. 2.5 లక్షలకు పెరిగినట్లే అన్ని కేడర్లలోని ఉద్యోగుల జీతభత్యాలు భారీగా పెరిగాయి. ఫోన్లు, కార్లు, ద్విచక్ర వాహనాలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, కంప్యూటర్లు వినియోగించే మధ్య తరగతి జనాభా బాగా పెరిగింది. విదేశీ మారక నిల్వలు 5.8 బిలియన్ డాలర్ల నుండి 360.8 బిలియన్ డాలర్లకు చేరాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, సెన్సెక్స్ మున్నగు అన్ని విషయాల్లోనూ పెరుగుదల నమోదైంది. పెరిగిన సంపదలో అసమాన 
       సంస్కరణల ఫలితాల్లో సానుకూల అంశాలతో పాటు ప్రతికూల అంశాలు కూడా వున్నాయి. సానుకూల అంశాలు కూడా కొందరికే తప్ప అందరికీ దక్కలేదనే అసంతృప్తి తీవ్రంగా వుంది. పెరిగిన సంపద అసమాన పంపిణీ వలన కుబేరుల సంఖ్య, వారి ఆస్తులు పెరుగుతూ సమాంతరంగా పేదల సంఖ్య కూడా కొనసాగుతోంది. భారతదేశంలో ఆర్ధిక వృద్ధి ఎంత వేగంగా పెరుగుతుందో అంతకంటే ఎక్కువగా అసమానతలు పెరుగుతున్నాయని ఆక్సుఫార్మ్ అంతర్జాతీయ సంస్థ నివేదిక వెల్లడించింది. 130 కోట్ల జనాభాలో ఒక్క శాతం మంది సంపన్నుల వద్ద 77% జాతీయ సంపద పోగుపడిందని, జనాభాలో 50% కంటే ఎక్కువగా వుండే పేద మధ్య తరగతి వారికి ఒక్క శాతం జాతీయ సంపద మాత్రమే దక్కుతుందని ఆ సంస్థ పేర్కొన్నది. సంపన్నులపై వేయాల్సిన ప్రత్యక్ష పన్నులు తగ్గిస్తూ పరోక్ష పన్నులు పెంచడం వలన పేదలు, మధ్య తరగతి ఆదాయాలు హరించుకు పోతున్నాయి. ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించడం మరియు ఆ సంస్థలను అమ్మేయడం వలన ఉద్యోగాలు ఎగిరిపోతున్నవి. ప్రభుత్వ శాఖలు, సంస్థలు కుదించుకు పోవడంతో రిజర్వేషన్ అవకాశాలు సన్నగిల్లి సంక్షేమం, సామజిక న్యాయం కృశించి పోతోంది. పిల్లల చదువుల కోసం కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నాణ్యమైన విద్య, వైద్యం అనేకమందికి అందని ద్రాక్షగానే వుంది. ఐఐటీ, ఐఐఎస్సీ వంటి కొన్ని సాంకేతిక వృత్తి విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగినా పాఠశాల విద్యలో అభ్యసన సామర్ధ్యాలు లేకపోవడం, డిగ్రీలు చదివిన వారిలో నైపుణ్యాలు లేకపోవడం వంటి లోపాలు భవిష్యత్తును దెబ్బతీస్తున్నవి. నిరుద్యోగం పెరిగిపోతోంది. వైద్య ఆరోగ్య రంగాల్లోని వైఫల్యం కోవిడ్-19 తో కొట్టొచ్చినట్లు కనిపించింది. 
       సమాజ అభివృద్ధికి పునాదిగా వుండే ఆర్ధిక రంగంలో జరిగే మార్పులకు రాజకీయ, సాంఘిక, సాంస్కృతిక రంగాలు ప్రభావితం అవుతాయి అనే సూత్రం ముప్పయ్యేళ్ల సంస్కరణల విషయంలోనూ స్పష్టంగా రుజువైంది. సంస్కరణలకు ముందు దేశమంతటా కాంగ్రెస్ పార్టీ, అక్కడక్కడా కమ్యూనిస్ట్ పార్టీలు వుండే రాజకీయ రంగంలో  అనేక కొత్త పార్టీలు ఆవిర్భవించి అధికారంలోకి అచై. అవి బీజేపీ, శివసేన, బీఎస్పీ, ఎస్పీ, ఆర్జేడీ వగైరా పార్టీలు మున్నగునవి. 1991-96 మధ్య కాలంలో లోక్ సభలో ప్రాతినిధ్యం గల రాజకీయ పార్టీల సంఖ్య 25 నుండి 40 కి పెరిగింది. కేంద్రంలో బహుళ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నవి. విదేశీ పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడులతో రాష్ట్రాలే నేరుగా ఒప్పందాలు చేసుకొనే అవకాశాలు రావడంతో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు బలమైన నాయకులుగా ఎదిగారు. కేంద్ర ప్రభుత్వం కంటే ఆయా రాష్ట్రాలే విదేశీ సంస్థలకు పన్ను మినహాయింపులు, ప్రోత్సాహకాలు కల్పించి ఎక్కువగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సంపాదించే స్థాయికి ఎదిగాయి. ఉదాహరణకు సంస్కరణల మొదటి (1991-2001) దశాబ్ద కాలంలోనే మహారాష్ట్ర 456, తమిళనాడు 222, గుజరాత్ 168, ఆంధ్రప్రదేశ్ 124, ఒడిశా 82 బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలకు ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఎన్నికల్లో దళితులు, బలహీన వర్గాల భాగస్వామ్యం పెరిగి రిజర్వుడ్ నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం జనరల్ నియోజకవర్గాలతో సమానమైంది. మహిళల ఓటింగ్ శాతం పురుషుల ఓటింగ్ శాతం తో సమాన స్థాయికి చేరింది. అధికారాన్ని, ఆర్ధిక స్థాయిని అందిపుచ్చుకోవాలనే ఆశలు, ఆకాంక్షలు పెరిగాయి. 
       ఒకవైపు సంస్కరణల పట్ల అసంతృప్తి, ఆందోళన పెరుగుతుంటే మరోవైపు సంస్కరణల వేగాన్ని మరింత పెంచాలని, లేకపోతె దేశం మరోసారి ఆర్ధిక సంక్షోభంలో పడిపోతుందని పాలకుల ఆందోళన చెందుతున్నారు. ఆ మాటకొస్తే గత ఐదేళ్లుగా ఆర్ధిక వృద్ధి మందగించినట్లు ఆర్బీఐ, నీతి ఆయోగ్ హెచ్చరిస్తున్నాయి. 2016 లో 8.26% గా వున్న జీడీపీ రేటు 2017 లో 6.80%, 2018 లో 6.53%, 2019 లో 4.04% కి దిగజారి 2020 లో మైనస్ 7.96% కి పడిపోయింది. కరోనా సమస్య వలన ఈ విషయంపై పెద్దగా చర్చలు జరగడం లేదు. సంస్కరణలు సుస్థిరంగా ముందుకు పోవడానికి, సంస్కరణల ఫలాలను అందరికీ అందించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని విధాన నిర్ణేతలు, ఆర్ధిక వేత్తలు సూచిస్తున్నారు. పేదలు, మధ్యతరగతి వర్గాలకు అందేవిధంగా సంపద సృష్టి మరియు పంపిణీ జరగాలి. ప్రధమ, ద్వితీయ పారిశ్రామిక విప్లవాల్లో భాగస్వామి కాకపోయినా మూడవ పారిశ్రామిక విప్లవంలో ప్రవేశించిన భారత్ నాలుగవ పారిశ్రామిక విప్లవంలో ప్రధాన పాత్ర పోషించాలి. సాంకేతిక పరిజ్ఞానం, పరిశోధనలు, శాస్త్ర సాంకేతిక రంగాల్లో నూతన ఆవిష్కరణలు పెద్ద ఎత్తున విస్తరించాలి. అందరికీ విద్య, వైద్యం, ఉపాధి, నివాసం, పర్యావరణం సమకూర్చి అందరూ ఆనందంగా జీవించేందుకు అనువుగా సంస్కరణలను మలచాలని కోరుతున్నారు.