మనుస్మృతి దహనం మనందరి కర్తవ్యం
నాగటి నారాయణ
రావణ దహనం, కామ దహనం గురించి చాలామందికి తెలుసు. వాటి వివరాలు అంతగా తెలియక పోయినా ఆ కార్యక్రమాల్లో ఆనందంగా పాల్గొంటారు. వివరాలు తెలిస్తే వాటికి అంతటి ప్రాధాన్యత వుండదు. కానీ మనుస్మృతి దహనం గురించి తెలుసుకోవడం, ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా కేంద్రంలో మనుస్మృతి ఆరాధికుల అసాధారణ పరిపాలన సాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని సామాజిక, రాజకీయ కర్తవ్యంగా నిర్వహించాలి. దళితుల పట్ల, మహిళల పట్ల సామాజిక వివక్షతకు మూలమైన సైద్ధాంతిక భావజాలాన్ని చెరిపేయాలనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. 1927 డిసెంబర్ 25 న మహారాష్ట్రలోని కొంకణ్ తీరప్రాంతంలో గల మహద్ గ్రామంలో వేలాదిమంది వలంటీర్ల సమక్షంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతి గ్రంధం ప్రతులను దహనం చేశారు. ఆ సందర్బంగా వారందరూ చేసిన ప్రతిజ్ఞ: "చాతుర్వర్ణ వ్యవస్థను విశ్వసించను. కుల వ్యత్యాసాలను అంగీకరించను. హిందూ సమాజానికి శాపంగా వున్న అంటరానితనాన్ని అంతం చేసేందుకు కృషి చేస్తాను. హిందువుల్లో ఆహారం,పానీయం విషయా ల్లో ఎలాంటి నిషేధాలను పాటించాను. ఆలయాలు,నీటి వనరులు, పాఠశాలలు వగైరా సదుపాయాల విషయంలో అశ్ప్రుస్యులు అనబడే వారితోసహా అందరికీ సమాన హక్కులు వుంటాయని నమ్ముతున్నాను ." మనుస్మృతి గ్రంధాన్ని దహనం చేసే గుండం నలువైపులా ఎత్తుగా కట్టిన బ్యానర్లపైన మూడు నినాదాలు వ్రాశారు. అవి: మనుస్మృతి శ్మశానవాటిక; అంటరానితనం సమాధి; బ్రాహ్మణిజం ఖననం. శతాబ్ద కాలం గడుస్తుస్తున్నా ఆ మూడు నినాదాలు బ్యానర్లపైనా, కాగితాల పైనే వుండి పోయినవి.
మనుస్మృతి దహన కార్యక్రమంలో అంబేద్కర్ చేసిన అధ్యక్షోపన్యాసంలో "ఈ ఉద్యమం త్రాగు నీటి కోసం, ఆలయ ప్రవేశం కోసం మరియు యితర సదుపాయాల కోసమే కాదు, సమాజంలో అసమానతలకు హేతువైన వర్ణ వ్యవస్థను రూపుమాపడం కోసం చేస్తున్నాము" అని అన్నారు. ఆ కాలంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో సమాన హక్కుల కోసం జరుగుతున్న ఉద్యమాల విశేషాలను సభికులకు వి డమర్చి చెప్పారు. ఫ్రెంచి విప్లవంలో పెల్లుబికిన మానవ హక్కుల డిమాండులను పేర్కొన్నారు . రోమ్ లో పార్టీసియన్సుకి వ్యతిరేకంగా ప్లెబియన్సు చేసిన తిరుగుబాటులోని డొల్లతనాన్ని వివరించారు. సమాజంలోని విభజన వ్యవస్థను అంతమొందించకుండా తమ గోడును వెళ్లబోసుకునేందుకు ఒక ట్రిబ్యూన్ ఏర్పాటు చేయాలనే డిమాండుతో ప్లెబియన్లు సాధించింది ఏమీ లేదని చెప్పారు. మౌలిక సమస్యలపై కేంద్రీకరించకుండా స్వల్పకాలిక, తాత్కాలిక సమస్యలకే పరిమితం కావడం వలన విముక్తి లభించదని బోధించారు. మా ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహి స్తున్నాము, ఈ సామాజిక విప్లవానికి సహకరించండని అగ్ర వర్ణాలకు కూడా అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు. శాస్త్రాలను వదిలేయండి, న్యాయాన్ని చూడండి అని హితవు పలికారు. మనుస్మృతి దహనం, మహద్ చెరువులోని నీరు తెచ్చుకోవడం సమస్య తీవ్రతను గుర్తింపచేసి, నిరసన వ్యక్తం చేసే సింబాలిక్ చర్యలు మాత్రమేనని, వాటి పరిష్కారానికి సుదీర్ఘ పోరాటం చేయాల్సి వుంటుందని అంబేద్కర్ దిశా నిర్దేశం చేశారు.
మనుస్మృతి వలన దళితులు అనుభవించిన అమానుష బానిసత్వం, సామాజిక అన్యాయం అందరికీ తెలిసిందే. దళితుల నివాసాలు ఉరికి కొద్ది దూరంలో వెలివాడలుగా వుండే విషయం ఇప్పటికీ షరా మామూలే. ఏదైనా పని మీద ఊళ్లోకి వచ్చే దళితుడి అడుగు జాడలు బజారులో పడకూడదు. అందుకోసం నడుముకు వెనక పొడవుగా గుబురుగా ఆకులు వుండే కొమ్మలను లేదా తాటి మట్టలను కట్టుకోవాలి. అవి వెనక నేలపై ఈడ్చుకొస్తూ పాదముద్రలను చెరిపేయాలి. ఊళ్ళో ఎక్కడా ఉమ్మి వేయకూడదు. అందుకోసం మెడలో చిన్న ముంత కట్టుకొని ఉమ్మి వచ్చినప్పుడు అందులోనే ఉమ్మాలి. దళితులు ఎలాంటి ఆయుధాలను వుంచుకోకూడదు, విద్య నేర్చుకోకూడదు, చదువుకోకూడదు. ఈ నియమాలను ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలకు, హత్యలకు గురికావాల్సిందే. స్వంతగా విలువిద్య నేర్చుకొన్న ఏకలవ్యుడి బొటనవేలును బలిగొన్న దుర్మార్గం ఒక ఉదాహరణ. దళితులతో పాటు ఏ వర్ణం వారైనా మహిళలు అందరూ మనుస్మృతికి బలి పశువులే.
'న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి" అనేది మనుస్మృతి ఆదేశం. బాలికగా తండ్రి రక్షణలో, మహిళగా భర్త రక్షణలో, విధవగా కొడుకు రక్షణలో వుండాలని కట్టడి చేస్తోంది. శారీరక బలహీనులైనా సరే భర్తలు భార్యలను నిత్యం తమ అదుపులో వుంచుకోవాలని చెబుతోంది . మహిళలు అపవిత్రులు, అబద్దాలాడతారు, తెలివిలేని వారు, బలహీనులు ... అందువలన వారు వేదాలు చదవలేరు. కనుక వారు నామకరణం చేయడం, జాతకాలు చెప్పడం, వేద మంత్రోచ్చారణలు చేయడం వంటివి చే యకూడదని అంటుంది. మహిళలను బానిసలుగా చూసే ఇలాంటివి చాలా వున్నవి. ఇవి చాలవా మనుస్మృతిని మంటగలపడానికి ? అగ్ర వర్ణాలు, అందులోని పురుషులకే మనుస్మృతి సర్వాధికారాలు కల్పించింది. బ్రాహ్మణ పురుషుడు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర కులాల మహిళలను పెళ్లి చేసుకోవచ్చు. అలాగే క్షత్రియ, వైశ్య పురుషులు తమ కులంలోని మరియు కింది కులాల్లోని మహిళలను పెళ్లి చేసుకోవచ్చు. కానీ శూద్ర కులం పురుషులు మాత్రం వారి కులంలోని స్త్రీలనే చేసుకోవాలి. ఏ కులంలోని పురుషులైనా తమకంటే పై కులంలోని స్త్రీలతో శారీరక సంబంధం కలిగితే అలాంటి వారు మరణ శిక్షార్హులవుతారు. ఇక దళితులను మనుషులుగానే చూడలేదు గనుక వారి హక్కులు గురించి మనుస్మృతి పూర్తిగా విస్మరించింది.
ఏ సామాజిక సమస్యల పరిష్కారం కోసం 93 సంవత్సరాల క్రితం అంబేద్కర్ నాయకత్వంలో మనుస్మృతి దహనం చేయబడిందో ఆ సమస్యలు యిప్పటికీ సజీవంగానే వున్నవి. అవి యింకా తీవ్రమవుతున్నవి కూడాను. దళితులపై దాడులు, దౌర్జన్యాలు పెరిగినవి. జాతీయ క్రైమ్ రికార్డ్సు బ్యూరో నివేదిక ప్రకారం బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ తదితర తొమ్మిది రాష్ట్రాల్లోని మొత్తం కేసుల్లో 84% ఎస్.సి. కులాలపైన మోపబడినవే. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 'లవ్ జిహాద్' పేరుతో చేస్తున్న చట్టాలు కింది కులాల యువకులు పై కులాల యువతులను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా నిషేధించడం కోసమే. తెలుగు రాష్ట్రాల్లో పై కులాల అమ్మాయిలను ప్రేమించి పెళ్లి చేసుకొన్న నిమ్న కులాల యువకులను హత్యలు చేస్తున్న విషయం తెలిసిందే. 2019 లో దేశంలో సగటున రోజుకి 88 చొప్పున మహిళలపై మానభంగాలు జరిగినట్లు ఎన్సీఆర్ బీనే ప్రకటించింది. చిన్న అమ్మాయిలను కూడా సామూహికంగా బలాత్కరించి చంపేయడం జరుగుతోంది. ఇవన్నీ శాంతి భద్రతలకు సంబంధించిన సమస్యలే కాదు. దళితులు, మహిళలు, బలహీన వర్గాల వారిని అనుభవించవచ్చు, అణిచివేయవచ్చు, హత్యలు చేయవచ్చని మనుస్మృతిలోనే వున్ నది. అది భారతీయ సమాజంలో అగ్ర కులాల్లోని అత్యధికుల్లో ఆవహించి వుంది. అలాంటి అహంభావాన్ని అంతం చేయడం కోసమే మనుస్మృతి దహన కార్యక్రమాన్ని విస్తృతంగా పెద్ద ఎత్తున నిర్వహించాలి. ఇది దళితులకు సంబంధించిన కర్తవ్యమే కాదు... మహిళలు, మైనారిటీలు, బలహీన వర్గాలు, కులాలతో నిమిత్తం లేకుండా అభ్యుదయ కాముకులు అందరి కర్తవ్యంగా గుర్తించాలి.
- నాగటి నారాయణ, సామాజిక విద్యావేత్త 9490300577