10, జులై 2019, బుధవారం

Will learning outcomes rise wi these draf NEP?

ఈ సిఫార్సులతో చదువొస్తదా?
                                             నాగటి నారాయణ 
      మన దేశంలోని  పాఠశాల విద్యార్థుల్లో సగం మందికి చదువు రావడం లేదనే చర్చ చాలా కాలంగా నడుస్తున్న విషయం తెలిసిందే.  ఎనిమిదో తరగతి విద్యార్థుల్లో 52% మందికి ఐదో తరగతి లెక్కలు చేయడం రావడం లేదని, ఐదో తరగతి విద్యార్థుల్లో 45% మంది మూడో తరగతి తెలుగు వాచకాన్ని తప్పులు లేకుండా చదవలేక పోతున్నారని 'యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రెపోర్ట్సు'ని మరియు 'నేషనల్ అఛీవుమెంట్ సర్వే'ల నివేదికలు చూస్తూనే వున్నాం. విద్యాహక్కు చట్టం వల్లనే  విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయనే నిందవేసి ఈ మధ్యనే ఆ చట్టాన్ని కూడా సవరించడం జరిగింది. కాగా  ఇప్పుడు దేశమంతటా చర్చలో ఉన్న విద్యా విధానం 2019 ముసాయిదాలో మొదటి భాగంలో పాఠశాల విద్య అభివృద్ధి కోసం చాలా సిఫార్సులు చేయబడినవి. వాటితో పాఠశాల విద్యార్థుల్లో  చదువు పెరుగుతదా లేదా అనేది పరిశీలనాంశం. 
                           5 + 3 + 3 + 4   పాఠశాల విద్యా!
      ఇప్పటిదాక పాఠశాల విద్య దేశమంతటా 10+2 సం.లుగా , తెలుగు రాష్ట్రాల్లో (6-14) 10 సం.లుగా ఉన్న విషయం తెలిసిందే. ఇకనుండి 3-18 సంవత్సరాల వయసును పాఠశాల విద్యా వయసుగా పరిగణించాలని కస్తూరిరంగన్ కమిటీ సిఫార్సు చేసింది. మొత్తం 15 సం.ల విద్యను నాలుగు  (5+3+3+4) భాగాలుగా చేసింది. కొఠారి కమీషన్ సిఫార్స్ చేసిన 10+2 విధానం యాభై ఏళ్ళు గడిచినా సరిగా అమలు జరగలేదు. ఈ కొత్త ఫార్ములా అర్ధం కావడానికి, అమలుకావడానికి ఎంతకాలం పడుతుందో ఏమో!  పిల్లల ఎదుగుదలను బట్టి ఆయా దశలకు అవసరమైన విద్యను అందించాలన్నది. 3-6 సం.ల వయసు వేగవంతమైందని, 85% మెదడు ఆ దశలోనే వికసిస్తుందనే విషయం తెలిసిందే. ఆ వయసు పిల్లలకు జ్ఞానపరమైన, సాంఘిక, భావోద్వేగ విషయాల్లో తగిన (ప్రీ-స్కూల్) తర్ఫీదు ఇస్తేనే అది భవిష్యత్ జీవితానికి పునాదిగా ఉంటుంది. మన దేశంలో ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో తప్ప ప్రభుత్య పాఠశాలల్లో అమల్లో లేదు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రీ-స్కూల్ ఎడ్యుకేషన్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. 1968, 1986 విద్యావిధానాల్లో మరియు విద్యాహక్కు చట్టంలో ప్రీ ప్రైమరీ విద్య గురించి చెప్పినా కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరగలేదు. ఇప్పుడు అమలు జరుగుతదనే గ్యారంటీ ఈ సిఫార్సుల్లో కూడా లేదు. ప్రీ -స్కూల్ మరియు 1,2 తరగతుల (3-8 సం.లు) ఫౌండేషనల్ విద్య గరపడానికి పేరెంట్స్, అంగన్వాడీ కేంద్రాలు మరియు ప్రీ ప్రైమరీ స్కూల్స్ బాధ్యత వహించాలని చెప్పారు. ఆటపాటలు,కృత్యాధార, ఆవిష్కరణ పద్ధతుల్లో అక్షరాలు, అంకెలు, కమ్యూనికేషన్ గురించి నేర్పాలన్నారు.  ప్రీ స్కూల్ (3-6 సం.లు) క్లాసులను అంగన్వాడీ కేంద్రాల్లో కొనసాగించవచ్చు, ప్రైమరీ స్కూళ్లలో ఏర్పాటు చేయవచ్చు, విడిగా ప్రీ ప్రైమరీ స్కూల్సుగా కూడా నిర్వహించవచ్చంటూ, ఓవరాల్ బాధ్యత మాత్రం విద్యాశాఖదే అన్నారు. ఇంత సంక్లిష్టమైన వ్యవహారం అంత తేలిగ్గా అమలుజరుగుతుందని చెప్పలేము. 
                        లిటరసీ - న్యూమరసీ - క్రియేటివిటీ  
      ఒకటి నుండి  ఐదో తరగతి వరకు అక్షరాస్యత, అంక గణితం విషయాలకు  పునాదులు పడాలి, ప్రతిరోజు మార్నింగ్ సెషన్ లో  చదివించడం, రాయించడం, లెక్కలు చేయించడం చేయించాలి. భాషా వారోత్సవాలు, గణితం వారోత్సవాలు మరియు మేళాలు నిర్వహించాలి. తరగతి గదిలో నేర్చుకునే లెక్కల ఆధారంగా నిజజీవితంలో లెక్కలు చేయించాలి. మిడిల్ మరియు సెకండరీ క్లాసుల్లో కరిక్యులర్, కో-కరిక్యులర్, ఎక్స్ట్రా కరిక్యులర్ విషయాలతో పాటు ఒకేషనల్ కోర్సులను కూడా మేళవించి బోధించాలి. అందువలన సాంప్రదాయక సబ్జాక్టుల భారాన్ని బాగా తగ్గించాలి. ఫిజికల్ ఎడ్యుకేషన్, స్పోర్ట్స్, డిజిటల్ లిటరసీలతో పాటు ప్రాబ్లెమ్ సాల్వింగ్, లాజికల్ రీజనింగ్ ఎథికల్ మోరల్ మరియు కరెంట్ ఎఫైర్స్  అంశాలను జోడించాలి.  విద్యార్థుల్లో క్రియేటివిటీ, ఇన్నోవేషన్ పట్ల ఆసక్తిని, జిజ్ఞాసను ప్రేరేపించాలి. ఇందుకనువైన కరిక్యులమ్, పెడగాజిని రూపొందించి, సామర్ధ్యం గల ఉపాధ్యాయులను నియమించాలని ముసాయిదాలో పేర్కొనబడింది.
                   టీచర్స్ - ట్యూటర్స్ - ఎయిడ్స్ - వలంటీర్స్ 
      విద్యార్థులకు చదువు సరిగా రాకపోవడానికి టీచర్స్ కెపాసిటీలో లోపమే కారణమని అందరూ అంటున్నట్లే ముసాయిదా కూడా ఆ మాటే అన్నది. ఉద్యోగం కోసం పొందిన శిక్షణ విద్యార్థులకు వివిధ రూపాల్లో బోధించడానికి, ముఖ్యంగా 3-8 సం.ల వయసు బాలలకు అవసరమైన తర్ఫీదునిచ్చే నైపుణ్యం లేదని వివరించింది. ఉపాధ్యాయుల సంఖ్య 1:30 నిష్పత్తి కంటే తక్కువగా ఉండడం, స్థానిక భాషలో బోధించలేకపోవడంతో పాటు విద్యార్థుల పౌష్టికాహార లోపం కూడా కారణమేనని విచారించింది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు చేసిన సిఫార్సులు మరింత ఆసక్తికరంగా ఉన్నవి. ఫౌండేషనల్ లిటరసి, న్యూమరసీ సాధనలో వెనకబడిన విద్యార్థులకు అదనపు కోచింగ్ ఇవ్వడానికి 'నేషనల్ ట్యూటర్స్ ప్రోగ్రామ్' ఏర్పాటు చేయాలి. ప్రతిభ గల విద్యార్థులతో వెనకబడిన విద్యార్థులకు కోచింగ్ ఇప్పించాలి. 'రెమిడియల్ ఇనస్ట్రక్షనల్ ఎయిడ్స్ ప్రొగ్రమ్' ఏర్పాటు చేసి కొంతమంది స్థానికులను ఇనస్ట్రక్షనల్ ఎయిడ్స్ (సహాయకులు) గా  సెలెక్ట్ చేసి వారితో వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ క్లాసులు చెప్పించాలి. రిటైర్డ్ టీచర్స్, ఆర్మీ ఆఫీసర్స్, కాలేజీ స్టూడెంట్స్ లో ఆసక్తిగల వారిని వలంటీర్స్ గా సమీకరించి ట్యూటర్స్ గా మరియు ఎయిడ్స్ గా పనిచేయించాలి. వీరంతా విద్యార్థులు డ్రాపౌట్ కాకుండా, అభ్యసనలో వెనకబడకుండా చూస్తూ ఉపాధ్యాయులకు తోడుగా ఉంటూ ఫౌండషనల్ లిటరసీ మరియు న్యూమరసీ సాధించడానికి సహాయ పడతారని ముసాయిదా పేర్కొన్నది. 
                   స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ 
      సాధారణ విద్యావకాశాలను అందుకోలేని విద్యార్థుల కోసం ప్రత్యేక విద్యా మండళ్లు (ఎస్ ఈ జడ్) ఏర్పాటు చేయాలనేనిది ముసాయిదాలోని మరో ముఖ్యమైన రికమండేషన్. పాఠశాలలో చేరలేని వారు, చేర్పించినా బడిలో కొనసాగలేని వారు ఎక్కువగా ఉండే మారుమూల గిరిజన ఏరియాలు మరియు వెనకబడిన ప్రాంతాల్లోని పిల్లల విద్యాభివృద్ధి కోసం ప్రత్యేక ఏర్పాటు చేయాలని సూచించబడింది. ఈ పథకానికయ్యే ఖర్చులో అధికభాగం కేంద్ర ప్రభుత్వమే భరించాలని చెప్పింది. ఈక్విటీ మరియు ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం. సామాజికంగా సాస్కృతికంగా వెనకబడిన తరగతులు, ప్రత్యేక అవసరాలు గలవారు మరియు బాలికలకు అవసరమైన విద్యకోసం ప్రత్యేక మోడ్యూల్స్ రూపొందించి వాటి బోధన కొరకు అంగన్వాడీలు, ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ జోన్స్ లో పనిచేయడానికి ఉపాధ్యాయులను వెనకబడిన గ్రూపుల నుండే నియమించి సుశిక్షుతులను చేయాలి. ఇరవైఐదు మంది విద్యార్థులకు ఒకరు చొప్పున ఉపాధ్యాయులను నియమించాలని నిర్దేశించింది. 
                    మౌలిక సమస్యలకు పరిష్కారమేది?
      విధానం ఏదైనా అమలు జరిగేది ప్రభుత్వ పాఠశాలల్లో తప్ప ప్రైవేట్ స్కూళ్లలో కాదు. ప్రైవేట్ స్కూళ్ళతో పోల్చి  ప్రభుత్వ  పాఠశాలల పట్ల అసంతృప్తిని, అసహనాన్ని వెలిబుచ్చుతున్న విషయం తెలిసిందే. పైన పేర్కొన్న సిఫార్సులన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో అమలు జరగాల్సినవే. అవసరమైన వసతులు, సదుపాయాలు, తగినంతమంది రెగ్యులర్ టీచర్లు, బోధనేతర సిబ్బంది, పుష్కలంగా నిధులు, పటిష్టమైన పర్యవేక్షణ, ప్రభుత్వ బాధ్యత వంటి మౌలిక సమస్యలు పరిష్కారం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను ఆశించడం అసంభవం. కస్తూరిరంగన్ కమిటీ చేసిన సిఫార్సులు చూడ్డానికి బాగానే ఉన్నా కరుడుగట్టిన విద్యారంగ సమస్యలను పరిష్కరించ గలిగేలా లేవు. అందువలన ముప్పై ఏళ్ల తర్వాత వచ్చిన ఈ సిఫార్సులతో కూడా బడి విద్యార్థులకు చదువొస్తుందని చెప్పలేము. 

కామెంట్‌లు లేవు: