9, జులై 2019, మంగళవారం

Why the Intermediate education in Telugu states?


ఎందుకీ ఇంటర్ విద్య అవస్థ?
                                                                          నాగటి నారాయణ
      ఇంటర్మీడియెట్  ఫలితాలు పెద్ద ప్రహసనంగా మారాయి. ఫలితాలు ప్రకటించి రెండు వారాలు గడిచినా విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన, ఆవేదన ఆగడం లేదు. మే రెండు నాటికి 25 మంది విద్యార్థులు చనిపోయారు. నాంపల్లిలోని ఇంటర్ పరీక్షల బోర్డ్ విద్యాభవన్ పోలీసుల పహరాతో  తలదాచుకుంటోంది. విద్యార్ధి, యువజన, పేరెంట్స్ తదితర సంఘాలు, సంస్థలు మరియు రాజకీయ పార్టీల ధర్నాలు, ముట్టడులు, నిరసన పోరాట కార్యక్రమాలతో అట్టడుకిపోతోంది. ఆందోళనకారులను అరెస్టులు చేయడం, గోషామహల్ స్టేడియంలో సాయంత్రం వరకు నిర్బంధించడం నిత్యకృత్యమైంది. నిరసన సెగ సచివాలయాన్ని, గ్లోబరీనా సంస్థ కార్యాలయాన్ని చివరికి ప్రగతి భవన్ నీ తాకింది. మరోవైపు హైకోర్టులో వ్యాజ్యం కొనసాగుతోంది. ప్రభుత్వం నియమించిన ముగ్గురు నిపుణుల విచారణ కమిటీ నివేదిక కంటితుడుపు చర్యగా కూడా పనిచేయలేదు. పైగా తప్పుల తడకగా తయారైన బోర్డు అధికారులను, వివాదాస్పద గ్లోబరీనా సంస్థకు కితాబులివ్వడం శోచనీయం. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ భవిష్యత్ చర్చనీయాంశమైంది.
      1968 జాతీయ విద్యా విధానంలో భాగంగా దేశవ్యాప్తంగా 10+2+3 (సెకండరీ + హైయ్యర్ సెకండరీ + కాలేజీ, యూనివర్సిటీ) విద్యా వ్యవస్థ అమల్లోకి వచ్చింది. పదో తరగతి వరకు విద్యార్థులు అందరికీ ఒకే విధమైన సబ్జక్టులను నేర్పాలి. పదకొండు, పన్నెండు (+2) తరగతుల్లో విద్యార్థులు యిష్టమైన సబ్జక్టులు నేర్చుకోవచ్చు. సీబీఎస్ఈ సిలబసులో సైన్స్, కామర్స్, ఆర్ట్స్ స్ట్రీములలో ఏవైనా ఐదు సబ్జక్టులు ఎంచుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ కంపల్సరీ. సెంటర్స్ ఆఫ్ ఎక్సిలెన్సెసుగా ప్రచారంలో వున్న నవోదయ విద్యాలయాల్లో, క్వాలిటీ ఎడ్యుకేషన్ కి మోడల్స్ గా చెబుతున్న కేంద్రీయ విద్యాలయాల్లో మరియు తెలుగు రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో +2 విధానమే అమలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో మాత్రమే ఇంటర్మీడియట్ అనేది అమల్లో వుంది. దేశమంతటా +2 వుండగా, తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ ఎందుకుంది? ఈ విధానం వలన లాభమా నష్టమా అనే సందేహాలు, స్వల్ప చర్చలు చెదురుమదురుగా జరిగేవి. ఇంటర్మీడియట్ విద్య వలనే ఎంసెట్, జెఈఈ, ఐఐటీ సీట్లు తెలుగు రాష్ట్రాలకే ఎక్కువ వస్తున్నందున ఇదే మేలైంది అనే వాదనతో ఆ‌ చర్చలు అంతటితోనే ఆగిపోయేవి. ఈ విధానమే మెరుగైందైతే యిన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇతర రాష్ట్రాలు ఎందుకు అనుసరించడం లేదు. ఇంటర్మీడియట్ కంటే సీబీఎస్ఈ సిలబసే మెరుగైందని విద్యారంగ నిపుణులు చెబుతారు. ర్యాంకులు, సీట్లు ఇంటర్మీడియట్ వలనే వస్తున్నాయనడంలో నిజమెంత?
      ర్యాంకులు, సీట్లలో అత్యధికం కార్పోరేట్ కాలేజీలకు వస్తుండగా కొన్ని మాత్రం ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీలకు వస్తున్నవి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వచ్చేవి బహు తక్కువ. విద్యార్థుల స్వేచ్ఛను అరికట్టి రోజుకు పదహారు గంటలు రుద్దితే ర్యాంకులు, సీట్లు వస్తున్నవి తప్ప ఇంటర్మీడియట్ వలనే కాదనే వాదన వుంది. ర్యాంకులు, సీట్లు వచ్చే విద్యార్థులకు ఒనగూరే మేలు కంటే సంబంధిత కార్పోరేట్ కాలేజీలకు పెరిగే బిజినెస్ చాలా చాలా ఎక్కువ. ఇందుకోసం లక్షలాది మంది విద్యార్థుల పేరెంట్స్ కష్టార్జితాన్ని ధారబోయడంతో పాటు ఆస్థులు అమ్ముకోడం, అప్పల పాలు గావడం జరుగుతోంది. కనీస వేతనాలు లేకుండా వేలాదిమంది అధ్యాపకులు అహర్నిశలు చమటోడుస్తున్న వెట్టిచాకిరి ఆ ఫలితాల్లో దాగి వుందనే సత్యాన్ని గుర్తించాలి. ఇంటర్మీడియట్ విద్యావ్యాపారంలో సులభంగా దండుకున్న సొమ్ము గుమ్మరించి రాజకీయాలను ప్రభావితం చేస్తున్న విషయం తెలిసిందే. ఇంతకన్న ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ వలన తెలుగు రాష్ట్రాలకు ఒరిగిందేమిటి? విద్యా విషయంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలంగాణ 28 వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 25 వ స్థానంలో వున్నవి. విద్యాభివృద్ధి సూచికల విషయంలో 2018 లో ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో 18 మరియు 16 స్థానాల్లో నిలిచాయి. దక్షిణాది రాష్ట్రాల్లో అట్టడుగు స్థానాల్లో అవమానకరమైన స్థితిలో కునారిల్లుతున్నవి. ఈ దుస్థితిని మార్చేందుకు ఇంటర్మీడియట్ విద్య ఏమైనా తోడ్పడుతుందా?
      ఇంటర్మీడియట్ విద్య వలన రాష్ట్ర విద్యారంగానికి జరుగుతున్న నష్టం మరికొన్ని రూపాల్లో కూడా వుంది. +2 విధానంలో హైస్కూళ్లు 12 వ తరగతి వరకు వున్నవి. 10 వ తరగతి పాసైన విద్యార్థులు అదే స్కూల్లో 12 వ తరగతి కూడా పూర్తి చేయవచ్చు. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు అలాంటి అవకాశం లేదు. పదో తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్ విద్య కోసం పట్టణాల్లోని ప్రైవేట్ కార్పోరేట్ కాలేజీలను ఆశ్రయించాల్సి వస్తోంది. పేదలు, బలహీన తరగతుల పిల్లల్లో కొద్దిమందికి గురుకులాల్లో అవకాశం లభిస్తుంటే మరికొంత మంది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేరుతుండగా మిగిలిన వారు చదువు మానేస్తున్నారు. ఏదోవిధంగా ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరినా చివరికి పరీక్షల్లో ఫెయిలవుతున్న వారిలో బడుగు బలహీన వర్గాల విద్యార్థులే ఎక్కువ. ఫెయిలైన బాధతో అవమానంతో వత్తిడితో చనిపోతున్న విద్యార్థుల్లో కూడా వారే ఎక్కువ.  ఉదాహరణకు రాష్ట్ర క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం తెలంగాణలో 2015 నుండి 2019 ఏప్రిల్ వరకు చనిపోయిన 51 మంది విద్యార్థుల్లో 80% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే వున్నట్లుగా టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక తెలిపింది. ర్యాంకులు, సీట్లు దక్కుతున్నది ఎవరికి, ఆత్మహత్యల పాలవుతున్నది ఎవరు అనే విషయాన్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా వున్నది. ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల్లో సైన్స్, మేథ్స్ గ్రూపులు మాత్రమే వుండడం వలన ఆర్ట్స్, హ్యూమానిటీస్ కోర్సులు కనుమరుగవుతున్నవి. విద్యలో సమతుల్యత, సామాజిక న్యాయం దెబ్బతింటోంది. 
      ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 404 వుండగా ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీలు 2203 వున్నవి. విద్యార్థులు 1.68 లక్షలు మరియు 7.64 లక్షలు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మంజూరైన జూనియర్ లెక్చరర్ పోస్టులు 4552 వుండగా‌ పనిచేస్తున్నది సుమారు 800 మంది మాత్రమే. ఇరవై సంవత్సరాలుగా లెక్చరర్ల రిక్రూట్మెంట్ లేదు. దాదాపు నాలుగు వేలమంది కాంట్రాక్ట్ లెక్చర్లతో కాలేజీలు బ్రతికి వున్నవి. పరీక్షా పత్రాల మూల్యాంకనానికి ప్రభుత్వ కాలేజీల లెక్చరర్లు సరిపడా లేకపోవడం వలన ప్రైవేట్ కార్పోరేట్ కాలేజీల లెక్చరర్లను కూడా వినియోగించామని బోర్డ్ అధికారులు చెప్పారు. కాగా ఒక్కో ఎగ్జామినరుతో రోజుకి 30 ఆన్సర్ స్క్రిప్ట్స్ మాత్రమే దిద్దించాల్సి వుండగా, కొంతమందితో రోజుకి 45 వరకు కూడా దిద్దించినట్లు తెలిసింది. వాల్యుయేషన్ చేసిన ప్రైవేట్ కార్పొరేట్ కాలేజీల అధ్యాపకుల్లో పాఠాలు చెప్పిన వారెంతమందో తెలుసుకోవడం అవసరమని ఎన్సీఈఆర్టీ సభ్యులు డాక్టర్ మురళీ మనోహర్ చేసిన సూచనను పరిగణలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఇక పరీక్షల ఫలితాల నమోదు, ప్రకటన ప్రక్రియలో గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చేసిన నిర్వాకంతో ఏర్పడిన సంక్షోభం, దానితో బోర్డ్ అధికారులు మరియు ప్రభుత్వం పడుతున్న మల్లగుల్లాలు రాష్ట్ర విద్యారంగాన్ని కుదిపేసినవి. 
     ఈ వ్యవస్థలో  విద్యారంగంలో  ప్రైవేట్ ప్రమేయాన్ని లేకుండా చేయడం సాధ్యం కాకపోవచ్చు. కానీ దానిపైన  ప్రభుత్వ నియంత్రణ లేకపోతే అది తన లాభాల కోసం ఎంతకైనా తెగిస్తుంది. విద్యారంగాన్ని అతలాకుతలం చేస్తుంది, విద్యార్ధులను బలిగొంటుంది. 80% పైగా కాలేజీలు, విద్యార్థులు కార్పోరేట్ కబంధ హస్థాల్లో వుండగా వాటిని అదుపు చేయడం  ప్రభుత్వానికి పెద్ద సవాలే. విద్యారంగ రక్షణ కోసం, విద్యార్థుల మేలు కోసం, కార్పోరేట్ విద్యా వ్యాపారుల కట్టడి కోసం అవసరమైన శస్త్ర చికిత్సకు పూనుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

కామెంట్‌లు లేవు: