ఉల్లి, వెల్లుల్లి చేసిన నేరమేమి?
పోషక విలువల్లేని మధ్యాహ్న భోజనం
నాగటి నారాయణ
పాఠశాల విద్యార్థులకు అక్షయ పాత్ర ఫౌండేషన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనం ఇటీవల పెద్ద వివాదంగా మారింది. మధ్యాహ్న భోజన పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన మార్గదర్శకాలను ఉల్లంఘించి విద్యార్థులకు పోషక విలువల్లేని చప్పిడి తిండి పెడుతోందని ప్రధాన ఆరోపణ. కర్ణాటకలోని 'రైట్ టు ఫుడ్' మరికొన్ని సామాజిక సంస్థలు కలిసి విద్యార్థులకు ఇష్టం లేని అన్నం పెడుతున్న అక్షయ పాత్రను నిషేధించాలని కొంతకాలంగా ఉద్యమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కోడిగుడ్లు ఇవ్వకపోవడమే పెద్ద లోపమనే సమస్య నలుగుతుండగానే కూరల్లో ఉల్లి, వెల్లుల్లి కూడా వేయడం లేదనే వివాదం పెల్లుబికింది. ఒక దశలో అక్షయ పాత్ర కాంట్రాక్టును రద్దుచేయాలనే నిర్ణయానికొచ్చిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అంత సాహసం చేయలేక రాజీ పడింది. ఈ సమస్య తెలుగు రాష్ట్రాల్లో కూడా వున్నా ఎవరూ పట్టించుకోకపోవడం వల్ల వెలుగులోకి రావడంలేదు. లక్షలాది మంది బడి పిల్లలు అర్ధాకలితో అలమటిస్తూనే వున్నారు,
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పడంతో పాటు మధ్యాహ్నం మంచి భోజనం పెట్టే సదుపాయం అభివృద్ధిచెందిన వాటితో సహా అనేక దేశాల్లో అమల్లో వుంది. ఈ పథకం భారతదేశంలో భారీ స్థాయిలో అమలు జరగుగుతున్నట్లు యునెస్కో ప్రశంసించింది. 2016-17 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 12.65 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోని పన్నెండు కోట్ల మంది పైగా విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నివేదికల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 1- 5 తరగతుల విద్యార్థులకు 450 కేలరీల శక్తి, 12 గ్రాముల ప్రొటీనులు మరియు 6 - 8 తరగతుల విద్యార్థులకు 700 కేలరీల శక్తి, 20 గ్రాముల ప్రొటీనులు గల ఆహారం అందివ్వాలి. ఆ మేరకు అవసరమైన బియ్యం /గోధుమలు, పప్పులు, కూరగాయలు /ఆకుకూరలు, నూనె/ఫ్యాట్ ఉప్పు, పోపుదినుసులతో వండిన ఆహారాన్ని వేడిగా ఉండగానే వడ్డించాలి. వారంలో మూడు రోజులు భోజనంలో ఉడకబెట్టిన కోడిగుడ్లు వుండాలి. ఎవరు వండాలి, ఎక్కడ వండాలి తదితర విషయాల్లో ఒక్కో రాష్ట్రము ఒక్కో విధంగా వ్యవహరించడంతో కొన్ని సమస్యలు ఉత్పన్నమైనవి. వాటిపైన సుప్రీంకోర్టు 2004 ఏప్రిల్ 20 న స్పష్టమైన తీర్పు యిచ్చింది. బడికి అందుబాటులో వుండే మహిళలతో (ఎస్సి, ఎస్టీ, బిసి వారికి ప్రాధాన్యత) బడి ఆవరణలోనే వంట చేయించాలని, స్థానికంగా లభించే ఆహార పదార్ధాలనే వినియోగించాలని ఆదేశించింది. కోటిగుడ్డుకు బదులు పాలు లేదా అరటిపండు యిచ్చే విషయాన్ని కూడా జాతీయ పౌష్టికాహార సంస్థ (ఎన్ఐఎన్) అంగీకరించలేదు. పోషక విలువలు సమపాళ్లలో వుండి సులభంగా జీర్ణమయ్యే కోడిగుడ్లు యివ్వడమే మంచిదని సిఫార్సు చేసింది.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలుజరుగుతున్న పాఠశాలల్లో 25 లక్షల మంది పైగా మహిళలు వంట మనుషులుగా మరియు సహాయకులుగా పనిచేస్తున్నారు. స్థానికంగా లభించే కూరగాయలు తదితర ఆహారపదార్ధాలతో పాఠశాలల ఆవరణల్లోనే వంటచేసి వేడిగావున్న భోజనాన్నే విద్యార్థులకు వడ్డించడం జరుగుతోంది. కానీ అక్షయ పాత్ర ఫౌండేషన్ పెడుతున్న భోజనంలో మాత్రం ప్రభుత్వాల మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఆదేశాలు, ఆహార సంస్ఠల సిఫార్సులు ఏవీ అమలు జరగడం లేదు. దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో గల 14,702 ప్రభుత్వ పాఠశాలల్లోని 17.60 లక్షల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెడుతున్నట్లు, త్వరలో మరిన్ని పాఠశాలలకు విస్తరించనున్నట్లు అక్షయ పాత్ర ఫౌండేషన్ ట్రస్టీ మోహన్ దాస్ పాయ్ చెప్పారు. మరోవైపు కర్ణాటక, ఒడిశా హర్యానా, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో పోషక విలువల్లేని చప్పిడి తిండి పెడుతున్న అక్షయ పాత్ర వద్దు అనే ఉద్యమాలు నడుస్తున్నవి. ఆ సంస్థ సరఫరా చేసే భోజనంలో కోడిగుడ్లు ఇవ్వకపోవడంతో పాటు ఉల్లి, వెల్లుల్లి కూడా వేయడం లేదు. అదేమని అడిగితె అవి తినకూడదని తిరస్కరిస్తున్నారు. అత్యధిక భారతీయులు దాదాపు అన్ని కూరల్లోనూ వేసుకుతినే ఉల్లి, వెల్లుల్లి పట్ల అక్షయ పాత్ర అసహనం ఆశ్చర్యంగానే వుంది. అవి చేసిన నేరమేంటో?
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే సామెత వుందంటేనే భారతీయుల ఆహారపుటలవాట్లలో దానికున్న ప్రాధాన్యతను అర్ధం చేసుకోవచ్చు. సైన్స్ ప్రకారం ఉల్లిపాయల్లో కేలరీల శక్తి ఎక్కువ, వాటిని వేయిస్తే యింకా ఎక్కువ. రక్తపోటు, గుండె జబ్బులు, ఆస్తమా, అలెర్జీ, ఇన్ఫెక్షన్ వగైరా జబ్బులను తగ్గించే వైద్యపరమైన ఉపయోగాలు వున్నవి. హెయిర్ మాస్క్ లాగా వాడితే చుండ్రు, జుట్టు రాలడాన్ని నివారించవచ్చని బ్యూటీషియన్లు చెబుతున్నారు. మిట్టమధ్యాహ్నం ఎక్కువసేపు ఎండలో పనిచేసేవారు ఉల్లిపాయను నెత్తినపెట్టుకుంటే వడదెబ్బ తగలదని గ్రామాల్లో పెద్దలు చెబుతుంటారు. ఇక వెల్లుల్లి విషయానికొస్తే, వాటిలో ఘాటైన సల్ఫార్ వుంటుంది. అది రక్తప్రసరణ, జీర్ణక్రియకు తోడ్పడుతుంది. రక్తపోటును తగ్గిస్తుంది. వ్యాధి నిరోధక శక్తితో శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. కాగా, ఉల్లి వెల్లుల్లి గురించి అక్షయ పాత్ర చెప్పే విషయాలు మరో విధంగా వున్నవి. ఆయుర్వేదం ప్రకారం ఆహారం సాత్విక, రాజసిక, తామసిక అని మూడు భాగాలుగా వుంటుందట. సాత్వికాహారం మంచి గుణాలను పెంచడానికి తోడ్పడితే, రాజసికాహారం చెడు గుణాలను ప్రేరేపిస్తుందట. ఉల్లి, వెల్లుల్లి రాజసిక ఆహారపదార్ధాలట, అవి అజ్ఞానాన్ని కామ క్రోధ రజో గుణాలను పెంచుతాయట. నిష్ఠతో ఉండాలనుకునే వారిని డైవర్ట్ చేస్తుందట. అందుకే బడిపిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనంలో ఉల్లి, వెల్లుల్లి వేయడం లేదని అక్షయపాత్ర అధినేతల వాదన.
సన్యాసులకు సాత్విహారం తగునేమో గాని, సంసారులు కావాల్సిన అందునా ఎదిగే పిల్లలకు పోషక విలువల్లేని చప్పిడి తిండి పెట్టడం ఏమాత్రం క్షమార్హం కాదు. అది విద్యార్థులకే కాదు దేశానికే పెద్ద నష్టం, అరిష్టం. బడిఈడు పిల్లలో 35.7% మంది వుండాల్సిన బరువు కంటే తక్కువగా వున్నారని, 38.4% మంది గిడసబారి పోయారని 2016 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే పేర్కొన్న విషయం తెలిసిందే. ఎదిగే పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని వారికిష్టమైన విధంగా వండిపెట్టడం భారతీయ ఆహార సంస్కృతి. ఉల్లి వెల్లుల్లిని వేయకుండా వండిన రుచీ వాసన లేని రోజూ ఒకేవిధమైన దద్దోజనం తినలేక విద్యార్థులు నలిగిపోతున్నారు. మధ్యాహ్న భోజనం మాటున సాత్వికాహారం పేరుతో హిందూమతాచారాన్ని విద్యార్ధులపై రుద్దడం సహించరాని నేరం. బాలల హక్కుల్లో ముఖ్యమైన ఆహారావు హక్కును హరించడం అమానుషం, రాజ్యాంగ వ్యతిరేకం. ఇంతటి ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యతను ప్రభుత్వం ప్రజలు విస్మరించకూడదు. @
- నాగటి నారాయణ, సామజిక విశ్లేషకులు 9490300577
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి