|
Feb 29, 2020, 12:35 PM (1 day ago)
| ![]() ![]() | ||
| ||||
ఎంతకాలం ఈ రిజర్వేషన్లు?
నాగటి నారాయణ
"రిజర్వేషన్ల రక్షణకు పటిష్టమైన చట్టం అనివార్యం" అనే యిటీవలి నా వ్యాసం చదివిన ఒక ప్రభుత్వ అధికారి చాలా ఆవేశంగా ఫోన్ చేశారు. 'ఇంకా ఏమి తక్కువయిందని పటిష్టమైన చట్టం కావాలంటున్నారు, నాకన్నా చాలా తక్కువ మెరిట్ వున్నా రిజర్వేషనుతో నాతోపాటు ఉద్యోగం పొంది, ఇప్పుడు నాతో సమాన కేడరులో వున్న వారి పిల్లలకు కూడా రిజర్వేషన్ ఎందుకు?' అన్నారు. సమానం అయితే మీ అమ్మాయిని వారి అబ్బాయికి లేదా వారి అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేశారా? అని అడిగితే లేదన్నారు. అగ్ర కులాల, నిమ్న కులాల పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటామంటే మీరు అంగీకరిస్తారా అంటే లేదన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న ప్రేమికుల్లోని తక్కువ కులాలవారిని కొట్టి చంపుతున్నారు కదా అంటే అది వారి స్వయంకృతాపరాధం అన్నారు. ఎందుకలా చేస్తున్నారు, మీరూ వారు సమానమే అన్నారు కదా అంటే .. ఉద్యోగ హోదా, జీతం సమానమేగా అనకొచ్చారు. షెడ్యూల్డు కులాలు, తరగతుల వారికి కల్పిస్తున్న రిజర్వేషన్లు సామాజిక అసమానతను అధిగమించడానికి మాత్రమే, ఉద్యోగం జీతం అందులో భాగమే అని చెప్పినా కన్వీన్స్ కాలేదు. ప్రతిభకు నష్టం జరుగుతుంది అని విసుక్కున్నారు.
రిజర్వేషన్లతో లబ్ది చేకూరుతున్న కొద్దిమందిని కూడా సహించలేక ప్రతిభకు నష్టం జరుగుతుందని నిందించడం కొంతమందికి అలవాటుగా మారింది ఉన్నత చదువులు, ప్రొఫెషనల్ కోర్సులకు ప్రవేశ పరీక్షల్లో మరియు ఉద్యోగాలకు రిక్రూట్మెంట్ టెస్టుల్లో నెగ్గిన ప్రతిభావంతులకే సీట్లు, నియామకాలు లభిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిభకు నష్టం జరుగుతుందనే ఆరోపణ అసహనంతో చేసే అభాండం మాత్రమే. అయితే ఓపెన్ కేటగిరిలో సెలెక్ట్ అయిన వారి మెరిట్ ర్యాంక్ కంటే రిజర్వుడ్ కేటగిరిలో సెలెక్ట్ అయిన వారి మెరిట్ ర్యాంక్ కొంత తక్కువ వుంటే అది నిందార్హమ్ కాదు. ఏ కేటగిరిలో అయినా ఎక్కువ మెరిట్ ర్యాంక్ వారికంటే తక్కువ మెరిట్ ర్యాంక్ వారికి ఉద్యోగాలు యిస్తేనే ప్రతిభకు నష్టంగా భావించవచ్చు. ఎవరి కోటాలో వారికే మెరిట్ ప్రాతిపదికన సీట్లు, పోస్టులు వస్తున్నందున ప్రతిభకు నష్టం జరుగుతుందనే ఆరోపణ అనవసరం. తరతరాలుగా సమాజానికి చాకిరీ చేసి అన్యాయానికి, అణచివేతకు గురైన వారికి రిజర్వేషన్లతో కల్పించిన కొద్దిపాటి ఉపశమనాన్ని కూడా సహించలేకపోవడం సరైందికాదు. ఇప్పటికీ సమాజానికి అవసరమైన పబ్లిక్ సర్వీసుల్లో దళితులు, గిరిజనులు, మైనారిటీలే సేవ చేస్తున్న విషయాన్ని గుర్తించాలి.
'ఎవరి పని వారు చేసుకుని బతుకుతున్న ఈ రోజుల్లో సమాజం కోసం ఎవరో సేవ చేసేది ఏముంది' అని ఆ సారు విసుక్కొంటూనే వున్నారు. రోడ్లు ఊడ్చి చెత్తాచెదారం తొలగించేది, పట్టణాల్లో పార్కులను శుభ్రం చేసేది, పాకీ పని చేసేది, పశు కళేబరాలను తొలగించేది, శవాలను ఖననం చేసేది ఎవరు సార్' అంటే యింకా రెచ్చిపోయారు. 'నా దొడ్డి, బాత్ రూమ్ నేనే కడుక్కొంటున్న, ఎవరో వచ్చి కడగడం లేదు' అని కేకలేశారు. మీరు వదిలిన మలమూత్రాలు, కడిగిన మలినం డ్రైనేజీలోకి పోతుంది, అది బ్లాక్ ఐతే శుభ్రం చేస్తున్నది ఎవరు అని అడిగితే మాట మార్చారు. అయినా, ఎంతకాలం ఈ రిజర్వేషన్లు? పదేళ్ల వరకే అని రాజ్యాంగంలో చెప్పి డెబ్భై సంవత్సరాలు గడిచినా కొనసాగించడం ఏంటి? అన్నారు. చాలా మందికి రిజర్వేషన్ల పట్ల అదే అభిప్రాయం వుంది. కానీ నాకు తెలిసిన మేరకు అలాంటి అభిప్రాయం సరైంది కాదు. పదేళ్ల వరకే రిజర్వేషన్లు అని చెప్పింది (రాజ్యాంగం ఆర్టికిల్ 334) లోక్ సభకు మరియు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికయ్యే ఎంపీ, ఎమ్మెల్యే పదవులకు మాత్రమే. వాటికి గత జనవరి 25 వ తేదీతో ముగిసిన గడువును మరో పదేళ్లు పొడిగిస్తూ 2019 డిసెంబర్ 12న పార్లమెంటులో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన విషయం తెలిసిందే. కానీ విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఎడిక్వెసి (సరిపడినంత) వరకు కొనసాగించాలి (ఆర్టికిల్స్ 16(4) మరియు 16(4ఏ)) అనే విషయాన్ని గుర్తించాలి. (అయితే అలా కొనసాగించడం రాష్ట్ర ప్రభుత్వాల విచక్షాధికారం మేరకే అనే కొత్త సమస్య యిటీవలి సుప్రీంకోర్టు వ్యాఖ్యతో ముందుకొచ్చింది). ఏ కేటగిరిలో అయినా మొత్తం పోస్టుల్లో 15 శాతం వరకు ఎస్సి వారిని, 8 శాతం వరకు ఎస్టీ వారిని నియమించాలి. ఇప్పటికీ అంతమంది లేరు. నాలుగో తరగతి ఉద్యోగాల్లో మాత్రమే ఏడిక్వెసికి మించి వుంటారు. ఇప్పుడా పోస్టులకు నియామకాలే లేవు. ఔట్ సోర్సింగ్ నియమాకాలతో రిజర్వేషన్లు లేకుండా చేయడం జరిగింది. క్లాస్ 3 ఉద్యోగాల్లో సంఘాలు బలంగా వున్న రాష్ట్రాలు, ప్రభుత్వ శాఖల్లో మాత్రమే ఎడిక్వెసి వరకు భర్తీ అవుతున్నవి. అయినా ప్రమోషన్ పోస్టుల్లో కొంత కొరత వుంది. క్లాస్ 1 మరియు క్లాస్ 2 పోస్టుల్లోని రిజర్వుడ్ స్థానాలు దాదాపు సగం వరకు ఖాళీగానే వుంటున్నట్లు పార్లమెంటులో సభ్యుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పే నివేదికల ద్వారా తెలుస్తోంది.
చట్టం ముందు అందరూ సమానమే (ఆర్టికిల్ 14) అని అంటూనే రిజర్వేషన్ల పేరుతో కొందరికి రాయితీలు కల్పించడం ఏమిటి, అది వివక్ష కాదా అనే విమర్శ కూడా వుంది. అవును, వాక్ స్వాతంత్య్రం, సభా స్వాతంత్య్రం, సంఘ స్వాతంత్య్రం వంటివి అందరికీ సమానమే. కానీ, ప్రభుత్వం అందించే సదుపాయాలను అందిపుచ్చుకోలేని అంటరానితనంకి, అమానుషమైన వివక్షతకి గురై సామాజికంగా వెనుకబడిన (ఎస్సి, ఎస్టీ) వారికి ప్రత్యేక రాయితీ కల్పించాలని ఆర్టికిల్ 15(3) ఆదేశిస్తోంది. అది వివక్ష కాదా అంటే అవొచ్చు, కానీ దానిని పాజిటివ్ వివక్షగా చూడాలని బీసీ కమీషన్ రిపోర్టు సందర్భంలో జస్టిస్ చిన్నపరెడ్డి చెప్పిన విషయాన్ని గమనించాలి. అందుకోసమే రిజర్వేషన్లు అమలు చేయడం జరుగుతోంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి 70 ఏళ్ళు గడిచినా మన సమాజంలో అంటరానితనం, వివక్షత పాటించబడుతున్నందునే రిజర్వేషన్లను కొనసాగించాల్సి వస్తోంది. గ్రామీణ భారతంలో దళిత వాడలు వెలివాడలుగా, గిరిజన గూడేలు, తండాలు విసిరేసినట్లుగా ఒంటరిగానే వుంటున్నవి. పట్టణాల్లో ఎస్సి, ఎస్టీ వారికీ అద్దె ఇళ్లు కూడా యివ్వడం లేదు. కులాంతర వివాహాలను సహించకపోవడంతో పాటు కమ్యూనిటీ మేట్రిమోనిస్ పేరుతో అడ్డుగోడలు కడుతున్నారు. కొన్నిచోట్ల మధ్యాహ్న భోజన సమయంలో బడి పిల్లలను కులాలవారీగా కూర్చోబెడుతున్నారు. రాష్ట్రపతితో సహా ఉన్నత పదవుల్లో వున్నవారైనా దళితులను దేవాలయాల్లోకి కూడా అనుమతించడం లేదు. ఇలాంటి వివక్షత, అంటరానితనం కొనసాగినంత కాలం వాటికి గురవుతున్నవారికి సామాజిక రిజర్వేషన్లు కొనసాగడం అనివార్యం, అవసరం. @
నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు 9490300577

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి