8, ఫిబ్రవరి 2020, శనివారం

Pre-primary edu must: ASER 2019

అసెర్ 2019 అధ్యయనం 
ప్రీప్రైమరీ విద్య అత్యవసరం 
                                       నాగటి నారాయణ 
        పాఠశాల విద్య అసెస్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వ కోరిక మేరకు ముంబైలోని ప్రథమ్ స్వచ్చంద సంస్థ 2005 నుండి "యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్టు (అసెర్)" లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈసారి 2019 నివేదికను "ఎర్లీ ఇయర్స్" పేరుతో ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ పరిస్థితిని ప్రత్యేకంగా అధ్యనయం చేసింది. 24 రాష్ట్రాల్లోని 26 జిల్లాల్లో 30,425 కుటుంబాల్లోని 36,930 మంది 4-8 సం.ల వయసు గల బాలబాలికలను సర్వే చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో మరియు  తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఈ సర్వే చేయబడింది. జ్ఞాన పరమైన అభివృద్ధి, మాటలు మాట్లాడడం, అంకెలు గుర్తించడం లెక్కించడం, సామాజిక భావోద్వేగ అభివృద్ధి అనే నాలుగు మౌలిక విషయాల పైన సర్వే చేసారు. జిల్లాలవారీగా పరిస్థితిని రిపోర్టులో ప్రచురించబడింది. సర్వేలో సేకరించిన సమాచారంతో తేలిన విషయాల ఆధారంగా ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్ ప్రాధాన్యతను, అవసరాన్ని సూచించడం ఈ నివేదికలోని ముఖ్యమైన విషయం. 
       భారతదేశం పాఠశాల విద్యలో అభ్యసన సామర్ధ్యాల సంక్షోభం అందరికీ తెలిసిందే. నేషనల్ ఎచీవుమెంట్ సర్వే 2017 ప్రకారం మూడవ తరగతి విద్యార్థుల్లో మూడో వంతు మంది పాఠాన్ని చదవలేక పోతున్నారు. సగం మంది విద్యార్థులు రోజువారీ జీవితానికి అవసరమైన లెక్కలు (రూ 20 ల్లో పెన్ను ఖరీదు రూ 13 లు పొతే ఎంత మిగులుతుంది? వంటివి) చెయ్యలేక పోతున్నారు. ఈ లోపం మరింత ఆందోళనకరంగా వున్నట్లు 'యాన్వల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసెర్) 2018' వెల్లడించింది. ఐదవ తరగతి విద్యార్థుల్లో సగం మంది పాఠ్య పుస్తకంలోని పాఠాలను సరిగా చదవలేక పోతున్నారని, 28% మంది మాత్రమే భాగహారం లెక్కలు చేయగలుగుచున్నారని పేర్కొన్నది. పై తరగతులకు పోతున్నకొద్దీ చదువు తగ్గిపోవడమే కాదు, ప్రారంభ తరగతుల్లో కూడా కనీస అభ్యసన సామర్ధ్యాలు అలవడక పోవడం ఆశ్చర్యంగా వుంది. గ్రామీణ ప్రాంతాల్లోని ఒకటవ తరగతి విద్యార్థుల్లో 42.7% మంది అక్షరాలను గుర్తించలేక పోతున్నారు, 35.7% మంది  1-9 అంకెలను గుర్తించలేక పోతున్నారు. ఒకటవ తరగతిలో చేరడానికి ముందే అభ్యసన సామర్ధ్యాల్లో లోపం వున్నట్లు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మరియు అసెర్ కేంద్రం 2017 లో అధ్యయనం చేసిన "ఇండియా ఎర్లీ చైల్డుహుడ్ ఎడ్యుకేషన్ ఇంపాక్ట్" నివేదిక తెలియజేసింది. సరైన సంసిద్ధత (ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్) లేకుండానే పిల్లలను పాఠశాలల్లో ఒకటవ తరగతిలో చేర్చడమే అసలు లోపమని అనేకమంది విద్యావేత్తలు కూడా అభిప్రాయ పడుతున్నారు. 
        కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అంగన్వాడీ కేంద్రాలు ప్రీప్రైమరీ విద్యను అందించలేక పోతున్నవి, అంగన్వాడీ వర్కర్లకు గల బహుళ (వ్యాక్సినేషన్స్, మేటర్నల్ హెల్త్, మాల్న్యూట్రిషన్ వగైరా … ) బాధ్యతల్లో ప్రీప్రైమరీ విద్య నామ మాత్రమే. ప్రీప్రైమరీ విద్య వయసు 5-6 సంవత్సరాల పిల్లల్లో నాలుగో వంతు మంది మాత్రమే అంగన్వాడీ కేంద్రాల్లో వున్నట్లు అసెర్ 2018 నివేదిక తేల్చింది. మిగిలిన వారిలో కొద్దిమంది ప్రైవేట్ కేజీ, నర్సరీ క్లాసుల్లో మరియు చాలామంది ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలల్లో వున్నట్లు పేర్కొన్నది. కాగా అత్యధిక ప్రైవేట్ నర్సరీ కిండర్ గార్టెన్ క్లాసుల్లో ప్రీప్రైమరీ విద్య కంటే స్కూల్ కరిక్యులమ్ పాఠాలే చెబుతున్నట్లు ఆ నివేదిక చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన 5-6 సం.ల పిల్లలకూ ఒకటవ తరగతి పాఠాలే తప్ప ప్రీప్రైమరీ విద్య లేదు కదా. పునాదిగా పరిగణించే ప్రీప్రైమరీ విద్య లేకపోవడం వలన ఆ నష్టం పాఠశాల విద్యలో కొనసాగుతోంది. గత ఐదేళ్లుగా చర్చించబడుతున్న నూతన విద్యా విధానం ముసాయిదాలో మూడు సంవత్సరాల ప్రీప్రైమరీ విద్యను ప్రతిపాదించడం జరిగింది. కానీ దాని అమలుకు సూచించిన మూడు మార్గాలు ముందుకు పోయేవి కాదు. 4-5 సం.ల వయసు పిల్లలకు కనీసం ఒక ఏడాది కాలమైనా మంచి టీచర్లతో రోజుకి 3-4 గంటలు తగిన లెర్మింగ్ మెటీరియలుతో శిక్షణ యిస్తే పాఠశాల విద్యకు సంసిద్ధం కాగలరు. ప్రీప్రైమరీ స్కూలింగ్ ఎఫెక్టివుగా అమలు చేయగలిగితే ప్రైవేట్ స్కూళ్ల ఆకర్షణను అరికట్టి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెరిగే అవకాశం కలుగుతుంది కూడను. 
       దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రంగంలో ప్రీప్రైమరీ స్కూలింగ్ కోసం ఏర్పాట్లు జరిగినవి. ఉదాహరణకు పూణే, చెన్నై, ముంబై కార్పొరేషన్లలో; చిన్న రాష్ట్రాలైన ఢిల్లీ, సిక్కిం మరియు పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, పంజాబ్, హర్యానా, అస్సాంలలో ఒక ఏడాది ప్రీప్రైమరీ స్కూలింగ్ అమల్లో వుంది. కానీ అవి జయప్రదమైన దాఖలాలు లేవు. ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ కి తగిన కరిక్యులం గానీ, అర్హతగల ఉపాధ్యాయులు గానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గానీ లోకపోవడం పెద్ద లోపాలు. ప్రభుత్వ విద్యాశాఖలో భాగముగా అయితేనే బాలలందరికీ ప్రీప్రైమరీ విద్య అందించడం సాధ్యమని అనుభవాల సారాంశం. అందుకు నాలుగు రకాల నిర్మాణాత్మక చర్యలు చేపట్టాలి. 
1. సమర్ధవంతమైన ఏర్పాటు: ఎర్లీ చైల్డుహుడ్ ఎడ్యుకేషన్ ఎలా వుండాలి, పిల్లలను  పాఠశాలకు ఎలా సంసిద్ధం చేయాలి, అందుకు పాఠశాలలు ఎలా సంసిద్ధం కావాలి అనే విషయాలపైన దేశములో విస్తృతమైన చర్చలే జరిగినవి. 'నేషనల్ ఎర్లీ చైల్డుహుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పాలసీ 2013' లో కరిక్యులర్ ప్రిన్సిపుల్స్ పేర్కొనబడినవి. 'నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ)' 2019 లో ప్రీ స్కూల్ కరిక్యులమ్ మరియు దాని అమలుకు మార్గదర్శకాలు ప్రకటించబడినవి. వాటి ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ఏర్పాట్లు (ఇనస్ట్రక్షనల్ మెటీరియల్, టీచర్ ట్రైనింగ్, మోనిటరింగ్, అసెస్మెంట్ వగైరా) చేసుకోవాలి. ఎర్లీ చైల్డుహుడ్ ఎడ్యుకేషన్ నిర్వహణలో అనుభవమున్న ప్రథమ్, విక్రమశీల, అక్షర ఫౌండేషన్ వంటి సివిల్ సొసైటీ సంస్థల సహకారం తీసుకోవచ్చు. 
2. బోధనా సిబ్బంది ఎంపిక: శిక్షణ పొందిన బాధ్యతాయుతమైన ఉపాధ్యాయులు నిర్దిష్ట సమయ సారిణితో పనిచేస్తేనే ప్రీప్రైమరీ విద్యా బోధన సాధ్యం కాగలదు. అందుకు అనువుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా ప్రీప్రైమరీ టీచర్స్ కేడరుని సృష్టించాలి. అలాంటి కేడర్ పూర్తి స్థాయిలో ఏర్పాటయ్యే వరకు ఈ లోగా తాత్కాలిక ఏర్పాట్లు చేసుకోవచ్చు. అవసరానికి మించి అదనంగా వున్న ఉపాధ్యాయులను, కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను ఏర్పాటు చేసుకోవాలి. స్కూల్ మేనేజిమెంట్ కమిటీలు కూడా ప్రీప్రైమరీ టీచర్లను నియమించుకోవచ్చు. 
3. కేంద్ర నిధుల వినియోగం: ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ పైలట్ ప్రాజక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం యిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలి. గత రెండేళ్ల కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్.ఎస్.ఏ నిధుల్లోంచి పెద్ద మొత్తంలో ప్రీప్రైమరీ స్కూలింగ్ కోసం వెచ్చించడం జరిగింది. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఒక్కోదానికి రూ 45 కోట్లు కంటే ఎక్కువగా కేంద్ర నిధులు లభించినవి. ఆ నిధులతో నాణ్యమైన ప్రీప్రైమరీ విద్య అందించే ఏర్పాట్లు చేసుకున్నవి. కాగా చాలా రాష్ట్రాలు తమకు లభించే నిధులను అంగన్వాడీ కేంద్రాలకే వెచ్చించడం జరుగుతోంది. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వాలు వ్యూహాత్మకంగా వ్యవహరించ గలిగితే ప్రీప్రైమరీ విద్యాభివృద్ధికి దోహదపడుతుందని గమనించాలి. 
4. ఆచరణీయ మార్గం చేపట్టాలి: ఒకేసారి సార్వత్రిక ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ సాధ్యం కాకపోతే దశలవారీగా చేపట్టాలి. మొదట ఎక్కువ నమోదు కాగలిగే పెద్ద స్కూళ్లలో ప్రారంభించాలి. ఉదాహరణకు గుజరాత్ రాష్ట్రంలోని 19 శాతం (6,600) ప్రభుత్వ పాఠశాలల్లోని ఒకటవ తరగతిలో 47% మంది 5-6 సం.ల పిల్లలు వున్నారు. ఆ పాఠశాలలు మొదటి దశ ప్రీప్రైమరీ స్కూలింగ్ అమలుకు అనువుగా వుంటవి. అన్ని రాష్ట్రాల్లోనూ అలాంటి అవకాశం వుంటుంది. 
      దేశమంతటా ప్రీప్రైమరీ విద్యావ్యాప్తికి పరిస్థితులు పరిపక్వమవుతున్నవి. ఒకవైపు ఎన్ ఈ పీ ద్వారా విధాన పరమైన వత్తిడి, మరోవైపు నిధుల అందుబాటుతో పాటు సివిల్ సొసైటీ సంస్థల సమాయత్తం పెరుగుతోంది. దేశంలోని మొత్తం పాఠశాల విద్యార్థుల్లో 58 శాతం మంది 2.3 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లోనే వున్నారు. వారందరికీ దశలవారీగా వచ్చే ఐదేళ్ళలో క్వాలిటీ ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్ అందించగలిగితే పాఠశాల విద్య అభ్యసన సామర్ధ్యాల్లో సంక్షోభాన్ని అధిగమించవచ్చునని నివేదికలో వివరించబడింది. @ 
- (రచయిత చైర్మన్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్)

కామెంట్‌లు లేవు: