చదువు, సంపద వల్లే విడాకులు అవుతున్నాయా!
నాగటి నారాయణ
భారతీయ సంస్కృతిని సంరక్షిస్తున్న దేశభక్తియుత సంస్థగా చెప్పుకుంటున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భగవత్ ఈనెల 16 న అహ్మదాబాదులో సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలోని కొన్ని విషయాలు ఆశ్చర్యంగా, అభ్యంతరకరంగా వున్నవి. మీడియాలో, దినపత్రికల్లో ప్రచురించబడిన వార్తలో భాగవత్ వ్యాఖ్యలు యిలా వున్నవి: "ఈరోజుల్లో విడాకుల కేసులు పెరిగిపోతున్నవి. ప్రజలు అనవసర విషయాలపైన గొడవ పడుతున్నారు. బాగా చదువుకున్న మరియు సంపన్న కుటుంబాల్లోనే విడాకులు ఎక్కువగా జరుగుతున్నవి, ఎందుకంటే చదువు, సంపదతో అహంకారం పెరుగుతుంది. దానితో కుటుంబాలు విడి పోతున్నవి, తద్వారా సమాజమూ విడి పోతోంది." అంతేకాదు, "మహిళలను ఇంటికి పరిమితం చేయడమే మన వ్యవస్థ గొప్పదనం. రెండు వేల సంవత్సరాల నాటి ఆ స్వర్ణయుగమే ఆదర్శం" అని కూడా చెప్పుకొచ్చారు. దేశాన్నీ, చాలా రాష్ట్రాలను పాలిస్తున్న బీజేపీని నడిపిస్తున్న సనాతన సంస్థ వైఖరి ఎలా వుందో భాగవత్ వ్యాఖ్యలను బట్టి అర్ధం చేసులోవచ్చు. అవి ఆరెస్సెస్ సిద్ధాంత గ్రంధం 'మనుస్మృతి'లో చెప్పినవేననే విషయం తెలిసిందే. దాని ప్రకారం చదువు, సంపద కొద్దిమంది వద్దే తప్ప అందరి వద్ద ఉండకూడదు. సమాజంలోని అతి కొద్దిమందిగా వుండే పురోహితుల వద్ద చదువు మరియు సంపద వైశ్యుల వద్ద మాత్రమే వుండాలని, అలాంటి విద్య, సంపదల ఆధారంగానే రాజ్య పాలన సాగాలనేది ఆ సిద్ధాంత సారాంశం. అందుచేతనే దేశంలోని సంపద ఆయేటికాయేడు కొద్దిమంది చేతుల్లోకే చేరుతోంది. దేశంలో ఉత్పత్తి అయిన సంపదలో 73% ఒక్క శాతంగా వున్న కుబేరుల స్వంతం అయినట్లు అంతర్జాతీయ హక్కుల సంస్థ 'ఆక్సుఫామ్' గతేడాది ప్రకటించింది. కార్పొరేట్ ట్యాక్సులు తగ్గిస్తూ మరింత సంపద వారి స్వంతమే అయ్యేందుకు మోడీ ప్రభత్వం గొప్ప కృషి చేస్తోంది. పెద్ద ఉద్యోగాలు చేపట్టి మంచి ఆర్ధిక స్థితిలో ఉండగలిగే ఉన్నత సాంకేతిక విద్యలు ప్రస్తుతం పదిశాతం మందికే అందుబాటులో వున్నవి. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్ళ నుండి పదును పెడుతున్న నూతన విద్యా విధానం అమల్లోకి వస్తే ఉన్నత సాంకేతిక విద్యలు బహు కొద్దిమందికే పరిమితం అయ్యే పరిస్థితి ఉత్నన్నమవుతుంది.
"చదువు సంపద అందరివీ, ఊరూ వాడా అందరివీ; పరువుగ బ్రతికే జన్మహక్కు మనిషియన్న ప్రతివారివీ" అనే నలభై ఏడేళ్ల క్రితం సుప్రసిద్ధ సినీ గేయ రచయిత డాక్టర్ కొసరాజు పాట వింటుంటే చదువ, సంపద అందరికీ లభించాచాలనే సమ సమాజ ఆకాంక్షను రేకిస్తుంది. అందుకు భిన్నంగా అవి అందరికీ అందకూడదనేది మోహన్ భగవత్ సందేశం. ఇలాంటి తిరోగమి వ్యాఖ్యలను ఏ సమాజమూ సహించదు. భారతీయ సమాజమూ సహించలేదు. ముఖ్యంగా మహిళల పట్ల అంతటి చులకన భావం, నియంతృత్వ ధోరణి తీవ్రమైన అభ్యంతరకరమైంది. చాలామంది నెటిజెన్లు మోహన్ భాగవత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు. అక్షరాస్యత, ఆస్తిపాస్తులు తక్కువగా వుండే గ్రామీణ భారతావనిలోనే విడాకులు ఎక్కువగా వున్నాయనే విషయాన్ని ఎత్తిచూపుతున్నారు. విద్యాభివృద్ధిలో, సంపద సృష్టిలో అధమస్థాయిలో వున్న యోగి ఆదిత్యనాధ్ ఏలుబడిలోని ఉత్తరప్రదేశ్ లోనే అధికసంఖ్యలో విడాకులున్న దానికి ఏమి జవాబు చెబుతారని ప్రశ్నిస్తున్నారు. అసలు పెళ్లి కాని, సంసారం లేని పెద్దమనిషి విడాకులు గురించి చెప్పడమేమిటని అడుగుతున్నారు. అలాంటి ప్రశ్నలతో నిలదీసేవారిపైన షరామామూలుగా ఆరెస్సెస్ భక్తుల ఎదురుదాడి కూడా పెరుగుతోంది. అలాంటి అదరగొండి తనంతోనే యింతకాలం చలామణి అవుతూ వస్తున్నారు. ఇప్పటికైనా వారి ఆటలు కట్టించే శక్తులు పెరగాలి. సమాజంలో సగభాగమైన మహిళలను వంటింటి కుందేళ్ళుగానే అణిచివేయాలనే వాచాలత్వం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్ధిక శక్తిగా ఎదగాలనుకునే భారతదేశానికి అవమానం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి