3, ఏప్రిల్ 2019, బుధవారం

Distortion of history

చరిత్రను చెరిపేస్తారా! ప్రభుత్వం చేయాల్సిన పనేనా? రైతులు, దళితుల పాఠాలు అక్కర్లేదా నాగటి నారాయణ కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డ్ (సీబీఎస్ఈ) తొమ్మిదో తరగతి చరిత్ర పాఠ్యపస్తకం "ఇండియా అండ్ కాంటెంపరరీ వరల్డ్ - 1" లోని చివరి మూడు ఛాప్టర్లు తొలగించాలని జాతీయ విద్యా పరిశోధన మరియు పరిపాలన మండలి (ఎన్సీఈఆర్టీ) నిర్ణయించింది. పాఠశాల విద్యలో సిలబసు భారాన్ని సగానికి సగం తగ్గించాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖామాత్యులు ప్రకాష్ జవదేకర్ యిచ్చిన ఆదేశాల మేరకే ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రస్తుత పాఠ్యపుస్తకాలు 2005 నుండి అమల్లో వున్నవి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవించిన మార్పులు, నూతన ఆవిష్కరణలు మరియు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వచ్చిన ముఖ్యమైన పరిణామాలను చేర్చడం కోసం మరియు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచటం కోసం పదేళ్లకోసారి సిలబసును రివ్యూ చేసి తాజా పర్చాలి. అందుకోసం విద్యావేత్తలు, మేధావులు, ఎకడమీషియన్స్, విద్యారంగ నిపుణులు, పాఠ్యపుస్తకాల రచనలో అనుభవం గల వారితో జాతీయ స్థాయి కమిటీ వేసి ఆ పని చేయాల్సి వుంటుంది. ఏ పాఠ్యపుస్తకంలోనైనా ఔట్ డేటెడ్ విషయాలను, అంతగా ప్రాధాన్యత లేని పాఠాలను తొలగించవచ్చు. కానీ నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పని అది కాదు. తమ సైద్ధాంతిక మూలాలకు సరిపడని పాఠాలను సమాధి చేస్తోంది. ఇండియా అండ్ కాంటెంపరరీ వరల్డ్ - 1 పాఠ్యపస్తకం 179 పేజీలతో మూడు సెక్షన్లు, ఎనిమిది ఛాప్టర్లుగా వుంది. అందులో చివరి మూడు ఛాప్టర్లు (62 పేజీలు) తొలగించబడుతున్నవి. పాఠ్యపుస్తకాల చాలా ప్రణాళికాబద్ధంగా లక్ష్యాత్మకంగా‌ వుంటుంది. ప్రతి తరగతి పాఠ్యపుస్తకమూ దానికి ముందరి మరియు తదుపరి తరగతుల పాఠ్యపుస్తకాలతో అనుసంధానం కలిగి వుంటుంది. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల్లో భారతదేశ చరిత్ర వివరించబడింది. తొమ్మిది, పది తరగతుల్లో ప్రపంచ చరిత్రలో భాగంగా భారతదేశ చరిత్ర పేర్కొనబడింది. ప్రపంచ పరిణామాలతో కలిపి పరిశీలిస్తేనే భారతదేశ ఆర్థిక సామాజిక విషయాల చరిత్ర అర్థం కాగలదు. చరిత్రను భౌగోళిక సరిహద్దులకే పరిమితం చేయలేమని ఎన్సీఈఆర్టీనే పుస్తకం ఉపోద్ఘాతంలో పేర్కొన్నది. దాని ప్రకారం చూస్తే ఆ మూడు ఛాప్టర్లనే ఎందుకు తొలగిస్తారు? దాని పరిణామాలు ఏమిటో పరిశీంచాల్సిన అవసరం ఎంతైనా వున్నది. 'పీజెంట్స్ అండ్ ఫార్మర్స్' అనే 6 వ ఛాప్టరులో ఇంగ్లాండులోని సాగుదారులు, అమెరికాలోని గోధుమ రైతులు మరియు బెంగాల్ (ఇండియా) లోని నల్లమందు సేద్యం చేసే వారి జీవితాలు ఆధునిక వ్యవసాయ పద్ధతుల ప్రమేయంతో ఎలా ఛిద్రమై పోయాయో విశ్లేషించబడింది. 15 వ శతాబ్దం వరకు ఇంగ్లండులో గ్రామాల చుట్టూ వుండే భూమి ఉమ్మడి సొత్తుగా అందరూ తలా కొంత పంచుకుని సేద్యం చేసుకుని అనుభవించేవారు. కాలం గడుస్తున్న కొద్దీ ఉన్ని గొర్రెల మేత కోసమంటూ మరియు తిండిగింజల అధికోత్పత్తి కోసమంటూ కొంతమంది విశాలమైన భూభాగాల చుట్టూ కంచెలు వేసి స్వంతం చేసుకున్నారు. 18 శతాబ్దం మధ్యలో జనాభా పెరగటం, పారిశ్రామికీకరణ వలన పట్టణాలకు వలసలు పెరగటంతో ఆహారధాన్యాల డిమాండ్ బాగా పెరిగింది. అధిక ఉత్పత్తి కోసం కొంతమంది భూస్వాములుగా మారి సువిశాలమైన భూములను ఆక్రమించుకుని యంత్రాలతో వ్యవసాయం చేశారు. దానితో భూములు కోల్పోయిన సాగుదారులు (పీజెంట్స్) మరియు రైతులు తిండి గింజలు కూడా లేక ఆకలితో అలమటించారు. అసహనంతో నూర్పిడి యంత్రాలను ధ్వంసం చేశారు. ఈ పాఠంతో పీజెంట్స్ అండ్ ఫార్మర్స్ పట్ల విద్యార్థులకు సానుభూతి కలగడం సహజం. అలాంటి సానుభూతి లేకుండా చేయడానికేనా ఈ పాఠాన్ని తొలగించేది? అమెరికాలో వైట్ అమెరికన్ రైతులు పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి, భారీగా యంత్రాలతో ఆధునిక సేద్యానికి మరలటంతో ఆదివాసీలు, సాగుదారులు, చిన్న రైతులు చితికిపోయిన వైనం చిత్రించబడింది. అంతేకాదు, అమెరికా పశ్చిమ ప్రాంతంలో ధనిక రైతులు, భూస్వాములు సువిశాలమైన పొలాలను దున్నటానికి అతిగా యంత్రాలను వాడడంతో వాతావరణ సమతుల్యం దెబ్బతిని 1930 ల్లో దట్టమైన నల్లని దుమ్ము తుఫానులు చెలరేగి అమెరికాను వణికించాయి. ప్రపంచమంతా క్లైమేట్ ఛేంజ్ గురించి చర్చిస్తున్న నేపధ్యంలోనే ఈ పాఠాన్ని తొలగించడం విచిత్రంగా వుంది. ఇక బ్రిటిష్ వలస పాలనలో భారతదేశ కౌలుదార్లు, పేద రైతులు నల్లమందు చేలు పెంచటం చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఆంగ్లేయుల తేనీటి రుచి తీర్చేందుకు చైనా నుండి తేయాకు దిగుమతి చేసుకునే బ్రిటిష్ ప్రభుత్వం, బదులుగా చైనీయులకు కావాల్సిన మత్తుమందు కోసం ఇండియాలో నిర్బంధంగా నల్లమందు ఉత్పత్తి చేయించేవారు. అందుకోసం రైతులు అప్పుల పాలై అణగారి పోయేవారు. నల్లమందు పండించిన భూములు మరే పంటకూ పనికొచ్చేవి కావు. ఆనాడు రైతుల దుస్థితికి, ఆక్రందనకు గల కారణాలు తెలస్తుంటే ఈనాడు రైతులు చేస్తున్న ఉద్యమాలను అర్ధం చేసుకోవడానికి తోడ్పడుతుంది. ఈ పాఠాన్ని విద్యార్థులు తెలుసుకోవాల్సిన అవసరం లేదా? 7 వ ఛాప్టరులో దైనందిన జీవితంలోని విషయాల్లో భాగంగా విద్యార్థులకు యిష్టమైన క్రికెట్ ఆట పుట్టు పూర్వోత్తరాల చరిత్ర వుంది. ఇంగ్లాండులో ప్రభువులు, కులీనుల సరదా తీర్చే క్రీడ 'కలోనియల్ గేమ్' గా 19 వ శతాబ్దం ప్రారంభానికే బ్రిటిష్ సామ్రాజ్యంలోని వలస దేశాలకు విస్తరించింది. అంతర్జాతీయ క్రీడగా అవతరించినా యిప్పటికీ నాటి బ్రిటీష్ సామ్రాజ్యంలోని కొన్ని (సౌతాఫ్రికా, జింబాబ్వే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, వెస్టిండీస్, ఇండియా మున్నగునవి) దేశాలకే పరిమితమైంది తప్ప హాకీ, ఫుడ్బాల్, టెన్నిస్ లాగ ప్రపంచ క్రీడ కాలేక పోయింది. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఒలింపిక్స్ గేమ్సులో క్రికెట్ లేదనే విషయం తెలిసిందే. కానీ 1977 నుండి 'కమర్షియల్, మీడియా గేమ్' గా పరిణామం చెంది క్రికెట్ బోర్డుల వ్యాపారంలో క్రికెటర్లు ఖరీదైన సెలబ్రిటీలుగా, ప్రేక్షకులు కన్స్యూమర్సుగా మారిపోయారు. టెస్ట్ మ్యాచ్ గానీ, వన్-డే ఇంటర్నేషనల్ గానీ ఆడే స్టేడియంలో టికెట్ కొనుక్కుని చూసేది కొంతమందే కావచ్చు, కానీ కోట్లాది మంది ఆటతో పాటు బడా సంస్థల వాణిజ్య ప్రకటనలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తుంటారు. అన్ని దేశాల కంటే భారతదేశంలోనే అత్యధిక క్రికెట్ మ్యాచ్ వీక్షకులు వున్నట్లు మీడియా సంస్థల భోగట్టా. కోట్లాది రూపాయల అతి పెద్ద బిజినెస్ జరుగుతోంది. క్రికెట్ ఆట గురించి మహాత్మాగాంధీ చెప్పిన విషయాలు కూడా ఈ పాఠంలో పేర్కొనబడినవి. విద్యార్థులకు 'తెలిసిన విషయాల నుండి తెలియని విషయాలను వివరించాలి' అనే సూత్రం ప్రకారం విద్యార్థులకు యిష్టమైన ఆట క్రికెట్ చరిత్రను, దాని పరిణామాలను వివరించటం జరిగింది. ఈ పాఠం అవసరమా లేదా అనేది విచారించాలి. "దుస్తులు : ఒక సామాజిక చరిత్ర" అనేది ఎనిమిదవ ఛాప్టర్. ప్రపంచంలో వస్త్రధారణకు పెద్ద చరిత్రే వుంది. 17 వ శతాబ్దం వరకు వివిధ దేశాలు, ప్రాంతాల్లో ప్రజలు ధరించే బట్టలపైన నియమ నిబంధనలు వుండేవి. సామాజిక హోదాను బట్టి, చేసే పనిని బట్టి పురుషులు, స్త్రీలు, పిల్లలకు బట్టలు వేసుకునే కట్టబాట్లు వుండేవి. అవి వివిధ తరగతుల ప్రజల గుర్తింపును ప్రతిబింబించేవి. 18, 19 శతాబ్దాల్లో జరిగిన ప్రజాస్వామిక జాతీయ ఉద్యమాలు, సామాజిక విప్లవాలతో ఆర్థిక రాజకీయ పరిపాలన రంగాల్లో సంభవించిన తీవ్రమైన మార్పులతో పాటు బట్టలు ధరించే విషయంలో నిబంధనలు కూడా నిలవలేక పోయినవి. భారతీయుల సాంప్రదాయక వస్త్రధారణపై ఆంగ్లేయుల వస్త్రాలంకరణ ప్రభావం‌పడింది. పాత సినిమాల్లో వకీళ్లు, గుమాస్తాలు పంచకట్టుపైనే బెల్టు, కోటు వేసుకోవడం తెలిసిందే. సామాజిక తరగతులు, శూద్రులు, దళితులు,‌గిరిజనులు కూడా ఒంటినిండా బట్టలు వేసుకునే స్వేచ్ఛ సాధించబడింది. ఈ పాఠంలో యిదొక ముఖ్యమైన విషయం. మన దేశంలో ఆధిపత్య కులాల వారికి, అణగారిన కులాల వారికి బట్టల విషయంలో కఠినమైన నిబంధనలు వుండేవనే విషయం తెలిసిందే. శూద్రులు, దళితులు మొల వరకే బట్ట కట్టుకోవాలి. చెప్పులు వేసుకోకూడదు, నగలు పెట్టుకోకూడదు. దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో కట్టుబాట్లు మరీ కఠినంగా వుండేవి. వాటిని ఉల్లంఘించితే దాడులు, దౌర్జన్యాలు జరిగేవి. బ్రిటీష్ పాలనలో ప్రజల వస్త్రధారణలో వస్తున్న మార్పులు శూద్రులు, దళితులనూ ప్రభావితం చేశాయి. అవి ఆధిపత్య కులాల అసహనానికి, ఆగ్రహానికీ గురైనవి. 1822 మే నెలలో ట్రావెంకూర్ ప్రాంతంలో జాకెట్ వేసుకున్న షెనార్/నాడార్ (దళిత) కుల మహిళలపైన నాయర్ కుల (హిందూమత) పెద్దలు దాడి చేసి జాకెట్లను చింపేశారు. అయినా ఆ మహిళలు ధైర్యంగా ముందడుగు వేశారు. క్రిష్టియన్ మిషనరీల అండ దొరకడంతో జాకెట్లు వేసుకునే మహిళల సంఖ్య పెరిగింది. హిందూ సంస్కరణవాది అయ్య వైకుండర్ మద్దతు కూడా తోడైంది. అగ్రకుల నాయర్లు మరింత రెచ్చిపోయి దాడులు చేయడం, జాకెట్లు చించివేయడం తీవ్రమైంది. ప్రతిగా నాడార్ కులస్తులు ఆధిపత్య కులాల వారికి వెట్టి చాకిరీ చేయ నిరాకరించారు. ఆ పోరాటం మూడున్నర దశాబ్దాలు పైగా జరిగింది. చివరికి ట్రావెంకూర్ రాజు జోక్యంతో నాడార్ మహిళలు జాకెట్లు వేసుకోవచ్చని 1859 లో ప్రభుత్వమే ఉత్తర్వులు యిచ్చింది. నాడార్ తిరుగుబాటు చరిత్రలో నిలిచింది. ఇంతటి ముఖ్యమైన సామాజిక సమస్యను విద్యార్థులు తెలుసుకోకుండా చేయడానికే ఈ పాఠాన్ని తొలగిస్తున్నారు. 'చరిత్రదేముందిరా చించేస్తే చిరిగిపోతుంది' అని సినిమాలో డైలాగ్ చెప్పినంత తేలిగ్గా కేంద్ర ప్రభుత్వం చరిత్ర పాఠాలను తొలగిస్తోంది. 'గత పునాదుల పైనే వర్తమానం భవిష్యత్తు కోసం నిర్మితమవుతుంది' అనే సత్యాన్ని విస్మరిస్తోంది. ఒకవైపు రైతుల దుస్థితిని ఓట్లు కోసం వాడుకొంటూ మరోవైపు ఆ సమస్య చరిత్రను కాలరాయటానికి పూనుకుంది. కుల అణిచివేతను, సామాజిక అన్యాయాన్ని తెలుసుకొనే పాఠాన్ని తొలగించటమంటే అణగారిన కులాల పట్ల, కమ్యూనల్ రిజర్వేషన్ల పట్ల ప్రభుత్వ అసహనాన్ని తెలియజేస్తోంది. విద్యార్థులకు సామాజిక చైతన్యాన్ని, బాధ్యతను తెలియజేసే పాఠాలను తొలగించటం అక్రమం, అన్యాయం. కేరళలోని 'పునరుజ్జీవ సంరక్షణ సమితి' నేతృత్వంలో ఎకడమీషియన్స్, టీచింగ్ కమ్వూనిటీ కేంద్ర విద్యాశాఖ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్నవి. దేశమంతటా అదే పని జరగాలి. 'చెరపకురా చెడేవు' అనే పాఠం చెప్పాలి. ------- - నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు 9490300577

కామెంట్‌లు లేవు: