on Reservations లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
on Reservations లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

18, మే 2020, సోమవారం

why SC, ST lists to review?

ఎస్సి, ఎస్టీ జాబితాల సమీక్ష ఎందుకు?
                                                                                     నాగటి నారాయణ 
        రిజర్వేషన్లు అనుభవిస్తున్న ఎస్సి, ఎస్టీ జాబితాలను సమీక్షించాలని ఏప్రిల్ 22 న గిరిజనులకు 100% రిజర్వేషన్లను రద్దుచేసిన సుప్రీంకోర్టు తీర్పులో జస్టిస్ అరుణ్ మిశ్రా మరో నలుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. "రిజర్వుడ్ తరగతుల్లో పెద్ద అలజడి వుంది. ఎస్సి, ఎస్టీల్లో కొందరు సంపన్నులై సాంఘికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందారు. అయినా అలాంటి వారు రిజర్వేషన్ల ద్వారా పొందుతున్న ప్రయోజనాలను అవసరమైన వారికి వదలడం లేదు. డెబ్భై ఏళ్ల నుండి అనుభవిస్తున్న వారు ఇంకెంత కాలం అనుభవిస్తారు? కనుక రిజర్వేషన్లు అనుభవిస్తున్న కులాల జాబితాలను సమీక్షించాలని, అందుకోసం ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని" ధర్మాసనం పేర్కొన్నది. ఆ వ్యాఖ్యానంతో ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్ల పట్ల మన సమాజంలో గూడుకట్టుకున్న అసహనం మరోసారి వెల్లడైంది. అలాంటి వ్యాఖ్యలు దళిత, గిరిజన ప్రజల్లో ఆందోళనకు ఆజ్యం పోస్తున్నవి. రిజర్వేషన్లను అనుభవిస్తున్న కులాలు/జాతుల జాబితాలను సమీక్షిండమంటే ఏమిటి? కానిస్టిట్యూషన్ (షెడ్యూల్డ్ క్యాస్ట్స్) ఆర్డర్ 1950 ప్రకారం ఎస్సి కులాలు దేశవ్యాప్తంగా 1108 ఉంటే, వాటిలో ఆంధ్రప్రదేశ్ లో 58 మరియు తెలంగాణలో 59 వున్నవి. కానిస్టిట్యూషన్ (షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ 1950 ప్రకారం ఎస్టీ జాతులు/తెగలు దేశవ్యాప్తంగా 744 ఉంటే,  అందులో ఆంధ్రప్రదేశ్ లో 26 మరియు తెలంగాణలో 32 వున్నవి. ఏ కులంలో అయినా కొన్ని పరిమితమైన కుటుంబాలు అభివృద్ధి చెందినవి ఉండవచ్చు. అంతేగాని ఫలానా కులంలో అందరూ అభివృద్ధి చెందినట్లు ఎవరూ చెప్పలేరు. అందువలన రాజ్యాంగం ఆర్టికిల్ 340 ప్రకారం కమీషన్ వేసి పరిశీలించినా కొన్ని కులాలను లేదా జాతులను జాబితాల నుండి తొలగించే పరిస్థితి ఉత్పన్నం కాదు. అందువల్ల సుప్రీం ధర్మాసనం చెప్పిన జాబితాల సమీక్ష అనేది ఓబీసీలకు అమలు చేస్తున్న క్రీమీ లేయర్ విధానాన్ని వర్తింపజేయడానికే దారితీయవచ్చు. ఎస్సి, ఎస్టీ వారికి క్రీమీ లేయర్ విధానం వర్తింపు సాధ్యం కాదనే విషయం విస్పష్టం. 
       ఇతర వెనకబడిన తరగతుల (ఓబీసీ) వారికి 27% రిజర్వేషన్ కల్పించాలని 1980 లో మండల్ కమీషన్ సిఫార్సు చేసింది. ఆ సిఫార్సుల మేరకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% ఓబీసీలకు రిజర్వ్ చేస్తూ 1990 లో వీ. పీ. సింగ్ ప్రధాన మంత్రిగా వున్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా ఆ 27% రిజర్వేషన్ అమలులో ఓబీసీ తరగతుల్లోని పేదవారికే ప్రాధాన్యత యివ్వాలని 1991 లో పీ. వీ. నర్సింహారావు నాయకత్వంలోని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ నిర్ణయాన్ని సమర్ధించిన ఇంద్రా సాహ్ని (1992) కేసులో తీర్పు చెప్పిన చీఫ్ జస్టిస్ ఎమ్. వెంకటాచలయ్యతో కూడిన తొమ్మిదిమంది న్యాయమూర్తుల సుప్రీకోర్టు ధర్మాసనం ఓబీసీల్లోని అభివృద్ధి చెందిన వారి (క్రీమీ లేయర్) ని 27% రిజర్వేషన్ల నుండి మినహాయించాలని చెప్పింది. అయితే, ఆ క్రీమీ లేయర్ మినహాయింపు ఎస్సి, ఎస్టీ రిజర్వేషన్లకు వర్తించదని కూడా చెప్పడం జరిగింది. క్రీమీ లేయరుకి కొలమానంగా ఆదాయం, ఆస్థి మరియు హోదానే పరిగణించాలని, ఆ మూడు అంశాలనూ కలిపి డబ్బు రూపంలోనే చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.  1993  లో లక్ష రూపాయల ఆదాయం/ఆస్థి గలవారిని క్రీమీ లేయరుగా ప్రకటించింది. ఆ తర్వాత 2004 లో రూ. 2.5 లక్షలు, 2008 లో రూ. 4.5 లక్షలు, 2013 లో రూ. 6 లక్షలు మరియు 2017 లో రూ. 8 లక్షలుగా నిర్ణయించింది.
      ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చేయవద్దని వాదించిన నాగరాజు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రాతో కూడిన ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2006 లో యిచ్చిన తీర్పులో క్రీమీ లేయర్ విధానాన్ని ఎస్సి,ఎస్టీ రిజర్వేషన్లకు వర్తింపచేయాలని చెప్పడం జరిగింది. అందుకోసం ఎస్సి కులాల్లో, ఎస్టీ జాతుల్లో వెనుకబడిన వారిని గుర్తించాలని ఆదేశించింది. ఆ ఆదేశాన్ని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంకోచించింది. ప్రమోషన్లలో రిజర్వేషన్ల విషయంలో ఎస్సి, ఎస్టీలకు క్రీమీ లేయరును అమలు చేయాలా లేదా అనే విషయాన్ని విస్తృత ధర్మాసనానికి అప్పగించాలని 2019 డిసెంబరులో కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. ఎందుకంటే వెనకబడిన తరగతుల్లో బాగా వెనకబడిన వారినే ఆర్టికిల్స్ 341 లో ఎస్సిలుగా మరియు ఆర్టికిల్ 342 లో ఎస్టీలుగా గుర్తించినందున వారికి క్రీమీ లేయర్ వర్తించదని ఇంద్రా సాహ్ని (1992) కేసులో తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం చెప్పిన తీర్పుకి భిన్నంగా నాగరాజు కేసులో ఐదుమంది జడ్జీల (2006) ఆదేశం వుంది గనుక. అంతేకాదు, ఎస్సి, ఎస్టీ జాబితాలను సమీక్షించి మార్పులు చేసే అధికారం పార్లమెంటుకు మాత్రమే వుంది. 2018 లో జర్నయిల్ సింగ్ వర్సెస్ లచ్మి నారాయణ్ గుప్తా కేసులో కూడా రిజర్వేషన్ల ద్వారా ఎంతమంది లబ్ది పొందారో డేటా సేకరించాలని, ఎస్సి ఎస్టీల్లో అభివృద్ధి చెందిన వారిని మినహాయిస్తే అదే కులాల్లోని బాగా వెనకబడిన వారికి మేలు జరుగుతుందని చెప్పడం జరిగింది. అదే వరసలో తాజాగా చేబ్రోలు లీలా ప్రసాద్ వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసు (2020) తీర్పులో ఐదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఎస్సి, ఎస్టీల జాబితాలను సమీక్షించాలని చెప్పింది. 
       షెడ్యూల్డ్ కులాలను ఏ, బీ, సీ, డీ లుగా వర్గీకరణ చేయాలనే డిమాండ్ తెలుగు రాష్ట్రాల్లో చాలాకాలంగా వున్నదే తప్ప క్రీమీ లేయర్ విధానాన్ని అమలు చేయాలని ఎస్సి కులాల్లో ఎవరూ యింతవరకు అడగలేదు. అయినా సుప్రీంకోర్టు ధర్మాసనాలు కొన్ని కేసుల విచారణల్లో తమకు తామే ఎస్సి ఎస్టీలకు క్రీమీ లేయర్ వర్తింప చేయాలని సూచిస్తున్నవి. కాగా, మధ్యప్రదేశ్ కి చెందిన ఎల్ ఎల్ బీ చదువుతున్న విక్రమ్ కుమార్ (ఎస్సి) ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన సుప్రీంకోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) లో శాసనాలు (ఎంపీలు, ఎమ్మెల్యేలు) చేసేవారి మరియు ఉన్నత స్థానాల్లోని ప్రభుత్వ అధికారుల పిల్లలకు కుల ప్రాతిపదిక రిజర్వేషన్లు ఇవ్వకూడదని కోరాడు. ఎంత కాలం ఈ రిజర్వేషన్లు?, ఎన్ని తరాలైన రిజర్వేషన్లు అనుభవించాల్సిందేనా?, సంపన్నులకు కూడా రిజర్వేషన్లు ఎందుకు? ప్రజా ప్రతినిధులు, ఐఎఎస్ ఆఫీసర్లు, అధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల పిల్లలకు రిజర్వేషన్లు అక్కర్లేదనే వాదనలు చాలా కాలంగా వున్నవే. ఇలాంటి వాదనలు ఎస్సి, ఎస్టీ వారికి మేలు చేసేదాని కంటే వారిలో వైషమ్యాలు పెంచేందుకే తోడ్పడతాయి. 
       ఎస్సి, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించింది సామాజికంగా, ఆర్ధికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందడం కోసమే కాదు, అంటరానితనం, కుల వివక్షతను తట్టుకోవడానికి కూడాను. రిజర్వేషన్లతో ఉద్యోగాలు పొందినవారిలో చాలామంది వృత్తిపరంగా, నివాసపరంగా, ప్రేమలు, వివాహాలు, ఆరాధనలు, ఆచారవ్యవహారాల్లో వివక్షతకు, అవమానాలకు, అన్యాయాలకు గురవుతున్న విషయాలు తెలిసినవే. సాధారణ దళితులే కాదు సాక్షాత్తు రాష్ట్రపతి పదవిలో వున్నవారికి కూడా కొన్ని హిందూ దేవాలయాల్లోకి ప్రవేశం అనుమతించడం లేదంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అగ్ర కులాల పిల్లలను ప్రేమించినా, పెళ్లి చేసుకున్నా చాలామంది సహించకపోవడమే కాదు నరికి చంపుతున్నారు. ఎస్సి, ఎస్టీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో కొంతమంది కిరాయి ఇళ్లు నిరాకరించబడి న్యూనతకు గురవుతున్నవారూ వున్నారు. ఒక తరానికి ఉద్యోగం వస్తే ఎన్ని తరాలనైనా అదే  పోషిస్తుందా? ఐదేళ్ల కాల పరిమితికి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేల పదవులు వారి పిల్లలు, మనుమలు, ముని మనుమలు అందరికీ జీవనాధారం అవుతాయా? ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారి పిల్లలకు చదువుకునే అవకాశాలు పెరగవచ్చు, కానీ ఉద్యోగాలు వస్తాయనే గ్యారంటీ వుందా? ఓపెన్ కేటగిరీలో నెగ్గే ఎస్సి, ఎస్టీ అభ్యర్థులు ఎలాగూ రిజర్వుడ్ కోటాలోని పోస్టులను ఆశించరు. రిజర్వేషన్లు అమల్లోకి వచ్చి ఏడు దశాబ్దాల కాలం గడుస్తున్నా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టుల్లో రిజర్వుడ్ కోటాల్లో కొరత కొనసాగుతూనే వుంది. క్లాస్ 3, క్లాస్ 4 ఉద్యోగాల్లో ఉన్నవారి పిల్లలు అందరికీ ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పలేము. ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వ రంగం క్షిణిస్తూ ప్రైవేట్ రంగం పెరిగిపోతుంటే రిజర్వేషన్లు వున్నా ఉపయోగం లేకుండా పోతోంది. అందువల్ల రిజర్వుడ్ కేటగిరీ యువతలో అసంతృప్తి, ఆందోళన పెరగడం సహజం. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పిస్తే కొంత పరిష్కారం కావచ్చు తప్ప ఎస్సి, ఎస్టీ జాబితాలను సమీక్షిస్తే అదనంగా ఒరిగేదేమీ వుండదు. @ 
నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు 9490300577