సంఘ సంస్కర్త, విద్యా విధాత
సావిత్రిబాయి ఫూలే
నాగటి నారాయణ
భారత సమాజంలో శతాబ్దాల తరబడి అమానుషమైన అణచివేతకు గురైన బహు జన ప్రజానీకంలో అనేక ఆణిముత్యాలు వున్నవి. అందులో సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి ఫూలే అగ్రశ్రేణిలో నిలుస్తుంది. నిమ్న జాతులు, మహిళల విద్యా విజ్ఞానాలకు అడ్డుగా నిలిచిన హైందవ ఆధిపత్యాన్ని ధైర్యంగా ఎదిరించి విజయం సాధించిన ధీర వనిత సావిత్రిబాయి. భారతీయ సమాజాన్ని సంకుచిత సనాతన భావజాలంతో క్రుంగదీసిన బ్రాహ్మణీయ విద్యా విధానాన్ని అధిగమించే ప్రగతిశీ ల ఆంగ్ల విద్య ప్రవేశంతో అణగారిన జాతులకు అరు ణోదయమైంది. ఆ చారిత్రక అవకాశాన్ని అందిపుచుకొ న్న వారిలో కొందరు చరితార్థులైనారు. వారిలో సావిత్రిబాయి ఆధునిక భారత దేశంలో తొలి మహిళా టీచరుగా, సంఘ సంస్కర్తగా ప్రసిద్ధిగాంచా రు. ప్రపంచంలో భారత దేశం మానవ వనరుల్లో, సహజ సంపదలో ఎంతో గొప్పది. అయినా అక్షరాస్యతలో, విద్యా విజ్ఞానాల్లో చాలా వెనుకబడి వుంది. అందుకు ప్రధాన కారణం దళితులు, సూద్రులు మహిళలకు విద్యను నిరాకరించిన మనువాద మైకమే. ఆ విషయాన్ని అర్ధం చేసుకొని అభ్యుదయ పధంలో పయనించిన సావిత్రి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఆమె జయంతి ఉత్సవాల నిర్వహణ పట్ల మరియు విద్యాలయాల్లో ఆమె విగ్రహాల ప్రతిష్టాపన పట్ల నానాటికి దేశ వ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. ఈ కార్యక్రమాలు ఒక ఉద్యమంగా, ప్రత్యామ్నాయ సంస్కృతిగా ఊపందుకోవాల్సిన అవసరం ఎంతైనా వున్నది.
సావిత్రిబాయి 1831 జనవరి 3 న మహారాష్ట్ర సతారా జిల్లాలోని నా యగం గ్రామంలో జన్మించింది, ఆమె తల్లిదండ్రులు మాలి కమ్యూనిటీ (ఇప్పుడు ఓబీసీ) కి చెందిన లక్ష్మిబాయి మరియు ఖండోజీ. పూణేకి 50 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. మహారాష్ట్ర ప్రాంతం 19 వ శతాబ్దం ప్రారంభం వరకు పీష్వాల పాలనలో మనువాద రాజ్యాంగానే నలిగిపోయిం ది. ఆ రాజ్యంలో అమ్మాయిలకు ముఖ్యంగా సూద్ర కులాల బాలికలకు బడికెళ్ళి చదువుకొనే అవకాశం నిషేధం. చురుకుగా, చొరవగా, పట్టుదలగా వుండే సావిత్రి ఆటపాటల్లోనే అక్రమాలను, ఆధిపత్యాన్ని సహించేదికాదు. ఓసారి సావాసగాళ్ళతో కలిసి ఊరి బయట చిట్టడవిలో ఆడుకుంటున్న వేళ ఓ చెట్టుపైనున్న గూటిలో గల పక్షి గుడ్లను తినడానికి పాకుతున్న పామును చూసి అందరూ భయపడ్డారు. కానీ సావిత్రి ఓ కర్ర తీసుకుని ఆ పామును తలపై కొట్టి పారదోలి పక్షి గుడ్లను కాపాడింది. ఆ విషయం తెలిసిన ఊరి వారంతా ఆమె ధైర్య సాహసాన్ని కొనియాడారు. ఆ కాలంలో బాల్య వివాహాలు సర్వ సాధారణం. ఆడపిల్లలకు ఆరేళ్లకు, మగపిల్లలకు పదేళ్లకు పెళ్లి చేయకపోతే సదరు కుటుంబాలను ఆనాటి సమాజం చాలా చిన్న చూపు చూసేది. అందుకే ఆరేళ్ళ వయసుకే సావిత్రి కి పన్నెండేళ్ల వయసు గల జ్యోతిరావుతో పెళ్లి అయింది. జ్యోతిరావు కుటుంబం పూనా వలస వెళ్లి పూల వ్యాపారం చేసుకునేది. అందుచేతనే 'గోరహే' అనే వారి ఇంటి పేరు 'ఫూలే' గా మారిపోయింది. పూలు అమ్ముకొనే జోతిరావులోని తెలివితేటలను గమనించిన అదే మాలి కులస్తుడు లిజిట్ సాబ్ అనే విద్యాధికుడు ఫూలే తండ్రి గోవిందరావుని ఒప్పించి స్కాటిష్ మిషన్ హైస్కూల్లో చేర్పించాడు. 1847 లో జోతిరావ్ మెట్రిక్యులేషన్ పూర్తి చేసాడు. తాను చదువుకొంటూ, పూల వ్యాపారం చేసుకొంటూ తన భార్య సావిత్రికి ఇంట్లోనే చదువు చెప్పాడు. భర్త నేర్పిన చదువుతోనే స్వయంకృషితో పత్రికలు , పుస్తకాలు చదివి సమాజాన్ని అధ్యయనం చేసి విద్యావంతురాలై పదిమందికీ చదువు చెప్పే స్థాయికి ఎదిగింది. బడికెళ్లే అవకాశం లేకపోయినా భర్త సాయంతో ఇంట్లోనే చదువుకొని ఆ ఊరికే వెలుగై దేశానికే పరిచయమైంది.
ఆంగ్లేయుల పాలనతో అందివచ్చిన ఆధునిక విద్య అందరికీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల ప్రజలకు చదువుకొనే అవకాశం కల్పించింది. ఇంగ్లీష్ మీడియం మిషనరీ పాఠశాలలతో ఆధునిక భారత విద్యా వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ రోజుల్లో చదుకున్న వారిలో అత్యధికులు తాము నేర్చుకున్న విద్యను పదిమందికీ పంచాలనే ఉత్సాహంతో వుం డేవారు. చాలామంది స్వంతగా స్కూళ్ళు పెట్టి ఉపాధ్యాయులుగా రాణించారు. 1848 జనవరి 1 న జోతిబా ఒక మిత్రుడి సహాయంతో పూనాలోని బు ధవారిపేట నివాసి భిడే ఇంట్లో బాలికా పాఠశాలను ప్రారంభించారు. అందులో టీచరుగా సావిత్రిబాయి నియమిం చబడినారు. ఆవిధంగా భారత దేశంలో తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి ఫూలే చరిత్రకెక్కిం ది. ఆ పాఠశాలను దెబ్బతీసేందుకు సనాతన బ్రాహ్మణవాదులు అడుగడుగునా ఆటంకాలు కల్పించారు. పాఠశాల నిర్వహణ ఫూలే దంపతులకు అగ్ని పరీక్షగా, కత్తిమీద సాములా తయారైంది. బడికెళ్లేటప్పుడు సావిత్రి చేతి సంచిలో బుక్సుతో పాటు చీర జాకెట్ కూడా వుండేవట. దారిలో సనాతనవాదులు తిట్లు, శాపనార్ధాలతో పాటు పేడ నీళ్లు చల్లేవారట. అందువలన స్కూలుకెళ్లిన తర్వాత చీర మార్చుకోవాల్సివచ్చేదట! బాలికల పాఠశాలలో పని చేయడానికి పురుష ఉపాధ్యాయులు వచ్చేవారు కాదు. అమ్మాయిలను బడికి పంపడానికి పేరెంట్సు ఒప్పుకొనేవారుకాదు. ఆడపిల్లలు చదవడం, రాయడం నేర్చుకోవడమంటే చెడిపోవడానికి తొలిమెట్టుగా మరి యు ధర్మభ్రష్టత కలుగుతుందని భావిం చేవారు. పూనాలో వుండే జోతిబా మిత్రుల కుటుంబాల్లోని పిల్లలనే తీసుకొచ్చి, మిఠాయిలు యిచ్చి, వారి అభిమానాన్ని ప్రేమను పొంది తద్వారా చదువుకు అలవాటు చేసేది. సంవత్సరం తిరిగేసరికి ఆ బడిలో విద్యార్థుల సంఖ్య 50 కి పెరిగింది. రెండో ఏడాదికి 70 కి పెరిగింది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మరో ఇద్దరు ఉపాధ్యాయులను నియమించారు. ఆ ఊపుతో మరో రెండేళ్లలో పూనా పరిసర ప్రాంతా ల్లో కొన్ని పాఠశాలలు, ఆ తర్వాత రెండేళ్లలో మరికొన్ని ప్రారంభించారు. మూడేళ్ళ స్వల్ప కాలంలోనే ఫూలే దంపతుల యాజమాన్యం లో మొత్తం 18 పాఠశాలలు పనిచేశాయి. 1852 మార్చి 3 వ తేదీన బేతాలపేటలో అంటరాని బాలికల కోసమే ప్రత్యేకంగా ఒక పాఠశాలను ప్రారంభించి, అందులో సావిత్రిబాయినే ప్రధానోపాధ్యాయురాలిగా పని చేసింది. ఆ పాఠశాలను గురించి ప్రత్యేకంగా మెచ్చుకొంటూ "పూణే అబ్సర్వర్" పత్రిక ఇలా వ్రాసింది: "పరోపకారం కోసం పని చేస్తున్న మాలి కులానికి చెందిన వ్యక్తులు కొందరు అశ్ప్రుస్యుల కోసం ఒక పాఠశాలను ప్రారంభించారు. ఈ పాఠశాలను వారి స్వంత ఖర్చుతో ప్రారంభించారు. దేశంలోని సంస్కరణవాదులకు యిది సంతోషం కలిగించే వార్త. బేతాలపేటలోని ఈ పాఠశాలలో మహర్,మాంగి, పాకీ కులాలకు చెందిన దళిత బాలలు చదువుకోవడం సంతోషించదగిన విషయం." జోతిబా నెలకొల్పిన పాఠశాలలు సావిత్రిబాయి నేతృత్వంలో ' ది నేటివ్ ఫిమేల్ స్కూల్, పూణే' మరియు 'సొసైటీ ఫర్ ప్రమోటింగ్ ది ఎడ్యుకేషన్ ఆఫ్ మాహార్సు, మాంగ్స్' అనే ట్రస్టుల ద్వారా నిర్వహించబడేవి.
సావిత్రిబాయి మహిళల్లో చైతన్యం పెంపొందించడానికి మహిళా మండలి ప్రారంభించింది. అంటరానితనం నిర్మూలన, మహిళల సమస్యల పరిష్కారం కోసం భారతదేశంలో నెలకొల్పిన తొలి మహిళా సంస్థ అదే. జోతిబా ఫూలే ప్రారంభించిన 'సత్య శోధక్ సమాజ్' మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా పని చేసింది. బాల్య వివాహాల వలన అనారోగ్యంతో, ప్రమాదాలతో భర్తలు మరణించి విధవలుగా మారిన యువతుల పరిస్థితి చాలా దారుణంగా తయారయ్యేది. అలాంటివారు అత్యాచారాలకు గురై గర్భవతులైతే అనాధలుగా మారిపోయి గర్భస్రావా లకు లేదా ఆత్మహత్యలకు పాల్పడేవారు. గర్భస్రావాలు విఫలమైన మహిళలు కన్న బిడ్డలను కూడా చంపుకోవాల్సి వచ్చేది. అలాంటి పతితులు. భ్రష్టులు, బాధా సర్పద్రష్టులను చేరదీసి ఆదుకోవడానికి బాల హత్యా ప్రతిబంధక్ గృహాన్ని 1853 జనవరి 28 న ఫూలే దంపతులు ఏర్పాటు చేశారు. అది అనాధ ఆశ్రమంగా, పసిబిడ్డల సంరక్షణ స్థలంగా, ప్రసూతి కేంద్రం లాగా పని చేసేది. దురదృష్టవశాత్తు అత్యాచారానికి గురై గర్భం దాల్చిన విధవల్లో కొందరు ఆ గృహంలో తల దాచుకుని బిడ్డను కని అక్కడే వదిలేసి వెళ్ళిపోయేవారు. 1873 వ సంవత్సరం వరకు అక్కడ 66 మంది అనాధ బిడ్డలు జన్మించారు. అనేక మంది సంఘ సంస్కర్తలతో పాటు రెనాడే, భండార్కర్ వంటి ప్రముఖులు ఆ కేంద్రానికి అండగా వుండేవారు. పూనా తో పాటు పండరీపురంలో అలాంటిదే మరో గృహాన్ని ఏర్పాటు చేశారు. అత్యాచారాలకు గురైన విధవలు బ్రాహ్మణులతో సహా ఏ కులం వారైనా అక్కున చేర్చుకొని ఆదరించేవారు. మిషనరీ ఆసుపత్రిలో శిక్షణ పొందిన నర్సులు నలుగురు ఆ కేంద్రంలో వైద్య సేవలు అందించేవారు. బాల హత్యా ప్రతిబంధక్ గృహంలో ప్రసవించిన కాశీబాయి అనే బ్రాహ్మణ విధవకు పుట్టిన మగ బిడ్డను ఆమె కోరిక మేరకు సావిత్రిబాయి దత్తత తీసుకొన్నది. యస్వంత్ అనే పేరు పెట్టి పెంచి, చదువు చెప్పించి, డాక్టరుని చేసి, మాలి కులానికి చెందిన ప్రముఖ వ్యక్తి జ్ఞానవా ఔష్ణరావు కూతురు రాధాబాయితో పెళ్లి చేసింది. జోతిబా ఫూలే నిర్వహిం చిన అన్ని రకాల సామాజిక కార్యక్రమాల్లోనూ భర్తకు తోడుగా వుంటూ తానూ ఎంతో జ్ఞానశీలిగా, ధైర్యశాలిగా ఎదిగింది. పలు పరీక్షా సమయాల్లో భర్తకు రాసిన ఉత్తరాల్లో ఆమె జ్ఞానం, సమయస్ఫూర్తి వెల్లడవుతుంది. జ్ఞానానికి, అధికారానికి గల పరస్పర సంబంధం గురించి చాలా ప్రతిభావంతంగా వివరించేది. స్త్రీలు, బహుజనులు జ్ఞానాన్ని సంపాదించనంత కాలం వారి విముక్తి సాధ్యం కాదని తన కార్యాచరణ ద్వారానే తెలియజేసింది. 1890 లో మరణించిన మహాత్మా జోతిబా ఫూలే చితికి ఆమే స్వయంగా నిప్పంటించారు. ఆయన నడిపిన సామాజిక, సంస్కరణ కార్యక్రమాలు అన్నింటినీ ఆమె చనిపోయేదాకా నిర్వహించింది. 1896 లో మహారాష్ట్రలో పెద్ద కరువు వచ్చి తిండి లేక, తాగడానికి నీళ్లు కూడా లేక వేలాదిమంది చనిపోయారు. సంపన్నుల నుండి విరాళాలు, ఆహారపదార్ధాలు సేకరించి కరువు అన్న దాన సత్రాలు నిర్వహించి కరువు పీడిత ప్రజలను ఆదుకున్నది. కరువు నుండి తేరుకోక ముందే ఆ ప్రాంతంలో ప్లేగు వ్యాధి వ్యాపించి రోజుకి కొన్ని వేలమంది దుర్మరణం పాలయ్యేవారు. ఆ ప్రమాదకర పరిస్థితిలో కూడా వ్యాధి పీడితులను ఆదుకోవడానికి సావిత్రిబాయి అహర్నిశలు శ్రమించింది. చివరకు ఆమె కూడా అనారోగ్యం పాలై 1897 మార్చి 10 న అరవై ఆరవ ఏట మరణించింది. సావిత్రిబాయి ఫూలే పోరాడిన సామాజిక రుగ్మతలు - ఆడవారి అణచివేత, కుల వ్యవస్థ కుళ్ళు, అంటరానితనపు అమానుషత్వం, అగ్రవర్ణాల ఆధిపత్య పీడన, ఆర్ధిక దోపిడీ ఈనాడూ కొనసాగుతూనే వున్నవి. సదరు రుగ్మతల సమూల నిర్ములన కోసం చేసే నిరంతర కార్యాచరణే ఆ మహనీయురాలికి అర్పించే నిజమైన నివాళి కాగలదు. "న స్త్రీ స్వాతంత్య్ర మర్హతి" అని శాసించిన మనుధర్మాన్ని ఎదిరించి, హిందూ మతం - బ్రాహ్మణ వాదం స్త్రీలపై రుద్దిన అసమానత్వపు, అమానవీయ విలువలను, అంటరానితనం, కుల వ్యవస్థను ధిక్కరించి సావిత్రిబాయి నిర్వహించిన సత్యశోధక ఉద్యమం సామాజిక ఉద్యమాలకు నిరంతర స్ఫూర్తిని అందిస్తుస్తుంది.
ఫూలే దంపతులు నడిపిన పాఠశాలల్ లో సనాతన బ్రాహ్మణీయ చదువుకు భిన్నంగా ఆధునిక పాశ్చాత్య కరిక్యులం తరహాలో మాత్సు,సైన్సు, సోషల్ స్టడీస్ సబ్జెక్టులను బోధించారు. సావిత్రిబాయి మంచి రచయిత, కవయిత్రి. 1854 లో ఆమె రాసిన 41 కవితల సంకలనం 'కావ్య ఫూలే' విడుదలైంది. జోతిబా ఫూలే జీవిత విశేషాలతో 'బావన్ కషి సుబోధ రత్నాకర్' పుస్తకాన్ని రచించింది. భారత దేశ చరిత్రపై జోతిబా ప్రసంగాలను మరియు సంఘ సంస్కరణలపై తన ప్రసంగాలను పుస్తకాలుగా ప్రచురిం చింది. సావిత్రిబాయి రాసిన కవితల్లో ఆధునిక విద్య, సామాజిక చైతన్యానికి సంబంధించినవే ఎక్కువ. వాటిలో ఒకటి: "స్వావలంబన, ఉద్యోగం, జ్ఞానధన సంచయం నిరంతరం చేయాలి!
విద్య లేనివారు వింత పశువులు, సోమరితనం వీడండి!
సూద్ర- అతి సూద్ర వర్గాల దుఃఖ నివారణ హేతువు చదువు!
ఆంగ్లం నేర్చి ముందుకు సాగాల్సిన అవసరం తెలుసుకో!
ఆంగ్ల భాషతో కుల మతాలను కూలగొట్టు!
భట్ - బ్రాహ్మణ మంత్రాలను పారదోలు!"
సావిత్రిబాయి ఫూలే వారసత్వం సుసంపన్నమవుతోంది. బహుజన మహిళా ఐకాన్ గా అలరారుతోంది. పూణే సిటీ కార్పొరేషన్ 1983 లో ఆమె గౌరవార్ధం ఒక మెమోరియల్ ని ఏర్పాటు చేసింది. 1998 మార్చి 10 న ఇండియా పోస్ట్ డిపార్టుమెంట్ సావిత్రిబాయి పేరుతో ఒక పోస్టల్ స్టాంపు విడుదల చేసింది. పూణే యూనివర్సిటీని 2015 లో సావిత్రిబాయి ఫూలే పూణే యూనివర్ సిటీ గా మార్చడం జరిగింది. ఆమె జీవిత చరిత్రతో కన్నడ భాషలో ఒక బయోపిక్ సినిమా 2018 లో విడుదలైంది. 2020 జనవరి 3 న ఆమె జయంతి సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాళులు అర్పించారు. సామాజిక సంస్థలు, ఉపాధ్యాయ సంఘాలు ప్రతి ఏటా సావిత్రిబాయి ఫూలే జన్మ దినోత్సవాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నవి. కొన్ని పాఠశాలల్లో ఆమె విగ్రహాలు స్థాపించబడినవి. ఆధునిక భారత తొలి మహిళా టీచర్ గా పని చేసిన సావిత్రిబాయి ఫూలే జయంతి ని జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆమె మరణించి 124 సంవత్సరాలు గడుస్తున్నా సమాజ సర్వతోముఖ అభివృద్ధికి ఆలంబనగా వుండే విద్యారంగంలో మహిళలు ముఖ్యంగా దళిత మహిళలు యింకా వెనకబడే వున్నారు. 2011 సెన్సెస్ ప్రకారం జాతీయ సగటు అక్షరాస్యత 74% కంటే 18% తక్కువగా మరియు జాతీయ మహిళా అక్షరాస్యత 64.6% కంటే 8% తక్కువగా ఎస్.సి. మహిళల అక్షరాస్యత 56.5% గా వున్నది. ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యలలో దళిత మహిళలు నూటికి 20 మంది కూడా లేరు. ఈ పరిస్థితిని మెరుగు పర్చడానికి సావిత్రిబాయి ఫూలే ఉద్యమ స్ఫూర్తి విస్తరించాలి.
నాగటి నారాయణ, సామాజిక విద్యావేత్త 9490300577
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి