బడి గంటలు మోగే వేళ?
నాగటి నారాయణ
అక్టోబర్ 15 నుండి పాఠశాలలు, కళాశాలలను తెరవొచ్చని కేంద్ర ప్రభుత్వం అన్లాక్ గైడ్లైన్సు 5.0 ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి యిచ్చింది. షరతులు వర్తిస్తాయని కూడా చెప్పింది. కోవిడ్-19 ప్రోటోకాల్ నిబంధనలకు తోడు కేం ద్ర విద్యాశాఖ యిచ్చిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్సు (ఎస్ఓపీ)తో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరమైన నిబంధనలు నిర్ణయించుకుని నిర్వహించుకోవాలని సూచించింది. తమ పిల్లలను స్వచ్చందంగానే బడికి పంపుతున్నట్లు, ఒకవేళ కరోనా సోకినా ఎవరినీ బాధ్యులను చేయమని పేరెంట్సు అంగీకార పత్రాలు యివ్వాలనే నిబంధన విధిగా పాటించాలని హెచ్చరించింది. రెండు నెలల తర్వాత డిసెంబర్ మధ్య నాటికి పరిస్థితిని పరిశీలిస్తే ఆంధ్ర ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, గోవా, మహారాష్ట్ర, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ 13 రాష్ట్రాల్లోనే పాఠశాలలను పాక్ షికంగా తెరిచినట్లు, విద్యార్థుల హాజరు చాలా పరిమితంగా (సగటున 10-30 శాతం) వున్నట్లు తెలుస్తోంది. మిగిలి న రాష్ట్రాలు చర్చోపచర్చలతో మల్లగుల్లాలు పడుతున్నవి. తెలంగాణ కూడా అదే విధంగా శోచాయిస్తోంది. కర్ణాటకలో ఇంజనీరింగ్ కాలేజీల్లోనే విద్యార్థుల హాజరు ఐదు శాతం మాత్రమే వున్నందున పాఠశాలల పునఃప్రారంభం విషయాన్ని డిసెంబర్ మొదటి వారంలో పరిశీలిద్దామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బి.ఎస్.ఎడ్యూరప్ప చెప్పారు. హర్యానాలో 9-12 తరగతులను డిసెంబర్ 21 నుండి ప్రారంభించాలని, కోవిడ్ నెగెటివ్ టెస్ట్ రిపోర్ట్ తెచ్చిన విద్యార్థుల వరకే అనుమతించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యిచ్చిన ఓక సర్కులర్ ద్వారా తెలిసింది. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్య సంఘాల వత్తిడి మేరకు డిసెంబర్ 15 నుండి పాఠశాలలు తెరిచేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం అనుమతించింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు పాఠశాలలు ప్రారంభించేది లేదని ఢిల్లీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా ప్రకటించారు. కరోనా వ్యాధి తగ్గేదాకా బడి తలుపులు తెరిచేది లేదని పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి పార్ధ ఛటర్జీ చెప్పారు. డిసెంబర్ నెలాఖరు వరకు విద్యాసంస్థలు పని చేసే అవకాశం లేదని రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ప్రకటించాయి. డిసెంబర్ రెండో వారం నుండి బడి తలుపులు తెరుస్తామని గతంలో ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్య సంచాలకులు ఏ. శ్రీదేవసేన, ముఖ్యమంత్రి కేసీఆర్ అనుమతి కోసం వేచియున్నామని చెప్పినట్లు పత్రికల ద్వారా అందిన సమాచారం.
డిజిటల్ డివిజనుగా సరికొత్త అసమానత
పాఠశాలల్లో భౌతికంగా విద్యాబో ధన జరిగే అవకాశం లేకపోవడంతో ఆన్లైన్ క్లాసుల ట్రెండ్ వచ్చేసింది. దానితో పాఠశాల విద్యలో నెలకొన్న అనేక అసమానతలకు తోడు డిజిటల్ డివిజన్ సరికొత్త సమస్యగా తలెత్తింది. ఈ విభజన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల మధ్య అసమానతకే పరిమితం కాకుండా ప్రైవేట్ పాఠశాలల మధ్య, వాటిలోని విద్యార్థుల మధ్య కూడా అసమానతకు దారి తీసింది. కొన్ని కార్పొరేట్ స్కూల్సు మరియు సీబీఎస్ఈ అనుబంధ పాఠశాలలు మాత్రమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించినవి. అవి కూడా ఫీజులు చెల్లించిన విద్యార్థులకు మాత్రమే ఆన్లైన్ క్లాసులతో నేర్చుకొనే అనుమతి యిచ్చినవి. తక్కువ ఫీజులు తీసుకొనే బడ్జెట్ పాఠశాలలు రికార్డ్ చేసిన పాఠాలను సోషల్ మీడియా ద్వారా అందించినవి తప్ప ఆన్లైనులో లైవ్ క్లాసులు నిర్వహించలేకపోయినవి. కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని సకల సౌకర్యాలు, డిజిటల్ బోధనలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు గల కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు ఏదో ఒక మేరకు ఆన్లైన్ క్లాసులు నిర్వహించినవి. రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు దక్కింది టీవీ పాఠాలు మరియు కొంతమంది హైస్కూల్ విద్యార్థులకు వాట్సాప్ సందేశాలు మాత్రమే. వాటిని కూడా బడుగు బలహీన వర్గాల విద్యార్థులు అందుకోలేక పోయారనే విషయం తెలిసిందే. మరోవైపు పీజీలు కట్టే స్తోమతు లేని ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులు మానసికంగా నలిగిపోయారు. మొత్తమ్మీద డిజిటల్ లెర్ణింగ్, ఆన్లైన్ క్లాసులు, వాట్సాప్ పాఠాలు ద్వారా 30% మంది విద్యార్థులు మాత్రమే ఎంతోకొంత నేర్చుకున్నారని 'యాన్వల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ (అసెర్)' ద్వారా తెలిసింది. అవన్నీ కాలక్షేప కార్యక్రమాలే తప్ప వాటితోనే సిలబస్ పూర్తయినట్లు పరిగణించే అవకాశం లేదు. అందువలన ఏడు నెలల కాలం గడిచినా 2020-21 విద్యా సంవత్సరం అనిశ్చిత స్థితిలోనే కొట్టుమిట్టాడుతోంది .
ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రధాన లోపం
పాఠశాల విద్యను అందించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది. కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలు మరియు ఎస్ఓపీ లను పాటిస్తూ, బడి తలుపులు తెరిచి "ఏమీ ఫర్వాలేదు, పిల్లలను పంపండి, కరోనా సోకితే ప్రభుత్వమే వైద్యం చేయిస్తుంది" అనే భరోసా యివ్వగలిగితే తల్లిదండ్రులు స్పందించగలరు. కరోనా విపత్తులో తగిన జాగ్రత్తలతో పాఠశాలలు నిర్వహించాలంటే ఒక్కో విద్యార్థి నుండి అదనంగా ఐదు వందల రూపాయలు చొప్పున ఫీజు వసూలు చేయాల్సి వస్తుందని ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు గతంలోనే ప్రకటించినవి. ధర్మల్ స్క్రీనింగ్, శానిటేషన్, సోషల్ డిస్టెన్సు, మంచి నీరు, మధ్యాహ్న భోజనం, కోవిడ్ టెస్టులు వగైరా అవసరాలకు తగిన నిధులు యివ్వకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహించడం చాలా కష్టం. ఒకవేళ జనవరి రెండో వారం నుండైనా పాఠశాలలను పునఃప్రారంభి స్తే విద్యా సంవత్సరం ఎప్పటికి ముగిస్తారనే విషయాన్ని ప్రభుత్వం ప్రకటించాలి. ఈ ప్రత్యేక పరిస్థితిలో 220 రోజులు నడిపించలేకపోయినా, అందులో సగం రోజులైనా అదనపు పని గంటలతో నిర్వహించి, కొంత సిలబస్ తగ్గించుకొని విద్యా సంవత్సరాన్ని రీషెడ్యూల్ చేయవచ్ చు. ఈసారి విద్యా సంవత్సరం ముగింపు మరియు పదో తరగతి పరీక్షల నిర్వహణ విషయాలను రాష్ట్రాలు కేంద్రంతో కూడా సమన్వయం చేసుకోవాల్సిన అవసరం వున్నది. సీబీఎస్ఈ పదో తరగతి మరియు పన్నెండో తరగతి పరీక్షలను మార్చిలోనే నిర్వహించడానికి షెడ్యూల్ యివ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఆ పరిస్థితిలో పదో తరగతి పబ్లిక్ పరీక్షను మార్చిలో కాకపోతే మీ నెలలో అయినా నిర్వహించేందుకు అనువుగా క్లాసులు నిర్వహించాలి. సిలబసుతో పాటు పరీక్ష పత్రాలను కూడా తగ్గించాలి. 1-9 తరగతులకు వేసవి సెలవులు లేకుండా జూలై వరకు తరగతులు నిర్వహించి విద్యా సంవత్సరాన్ని భర్తీ చేయవచ్చు. @
నాగటి నారాయణ, సామాజిక విద్యావేత్త 6460300577
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి