నాగటి నారాయణ
పాఠశాల విద్యలో ఆన్లైన్ క్లాసుల అలజడి జరుగుతోంది. దూరవిద్యా విధానంలో కొన్ని రోజులే క్లాస్ రూములో నేర్చుకొని, ఎక్కువ రోజులు ఇంట్లోనే బుక్స్, స్టడీ మెటీరియల్ చదువుకుని, పరీక్షలు వ్రాసి డిగ్రీ, డిప్లమో సర్టిఫికెట్లు పొందుతు న్న విషయం చాలా కాలంగా వున్నదే. ఇప్పుడు కొన్ని రోజులు కూడా క్లాసు రూముకి పోకుండా ఇంట్లోనే కూర్చుని, ఏదో ఒక వృత్తి ఉద్యోగంలో వున్నవారు కూడా ఆన్లైనులో చదువుకుంటూ వివిధ రకాల కోర్సులు పూర్తిచేయడం ఉన్నత విద్యలో జరుగుతోంది. కాగా కరోనా వైరస్ భయంతో విద్యారంగంలో ఏర్పడిన ప్ రతిష్టంభన పరిస్థితిలో పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల అవసరం ముందుకొచ్చింది. సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఆన్లైన్ క్లాసుల నిర్వహణ చాలా రోజుల నుండి జరుగుతోంది. రాష్ట్ర సిలబసుతో నడుస్తున్న కొన్ని పెద్ద ప్రైవేట్ స్కూళ్ళు కూడా అదే పని చేస్తున్నవి. ఆన్లైన్ పేరుతొ అదనంగా ఫీజులు కూడా వసూలు చేస్తున్నవి. ఫీజుతో పాటు స్మార్ట్ ఫోనులు, ల్యాప్ టాప్, కంప్యూటర్, వైఫై, డేటా వంటి అదనపు ఖర్చుల భారం తల్లిదండ్రుల పైన పడుతోంది. పాఠం చెప్పడం, నోట్సు వ్రాయించడం, హోమ్ వర్క్ చేయించడంతో ప్రైమరీ క్లాసుల పిల్లలనే రోజుకి 6-7 గంటలు వేధించడం జరుగుతోంది. సెకండరీ క్లాసుల విద్యార్థులు రోజుకి 10-12 గంటలు ఆన్లైనుతో అవస్థ పడుతున్నారు. గంటల తరబడి స్క్రీన్ ముందు కూర్చుని తదేకంగా చూస్తూ ఉండడం వలన విద్యార్థులకు కంటి చూపు మందగించడం, నడుము నొప్పి వంటి శారీరక ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆన్లైన్ అభ్యసన జరుగుతున్నంతసేపు తల్లి/తండ్రి లేదా ఎవరో ఒక పెద్ద వారు వారి పని మానేసి పిల్లలకు తోడుగా ఉండాల్సి వస్తోంది. ఇలాం టి సమస్యలున్నాయని ఇటీవల బాలల హక్కుల సంఘం హైకోర్టును ఆశ్రయిస్తే ఆ విషయాన్ని ప్రభుత్వమే చూడాలని ధర్మాసనం వదిలేసింది. అదనపు ఖర్చలు భరించి ఆన్లైన్ క్లాసులు నిర్వహించడం బడ్జెట్ స్కూళ్లకు సాధ్యం కాదని 'తెలంగాణ రికగ్నైజుడ్ స్కూల్స్ మేనేజర్స్ అసోసియేషన్ (ట్రస్మా)' నాయకులు ప్రకటించారు. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదివే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఊసే లేదు. కొంతమందికే ఆన్లైన్ విద్య అందుతూ ఎంతోమందికి అలాంటి అవకా శం లేకపోవడం వలన విద్యారంగంలో సరికొత్త విభజన, అసమానత సమస్య ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో బడి పిల్లలకు ఆన్లైన్ విద్య అవసరమా? అయితే ఎంతమేరకు అనేది చర్చనీయాంశం.
కోవిడ్-19 కొనసాగుతుండడం వలన 2020-21 విద్యాసంవత్సరం అనిశ్చితంగా మా రింది. ఆగస్టు 15 వరకు పాఠశాలలు ప్రారంభించే అవకాశం లేదని కేంద్ర విద్యాశాఖామాత్యులు రమేష్ కుమార్ పోఖ్రియాల్ గతంలోనే ప్రకటించారు . జూలై నెలాఖరు దాకా పాఠశాలలు, కళాశాలలు తెరవొద్దని, అప్పటివరకు ఆన్లైన్/ దూరవిద్య విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని, ప్రత్సాహించాలని కేంద్ర ప్రభుత్వం అన్ లాక్ 2 సందర్బంగా ప్రకటించింది. కేంద్ర విద్యాలయాలు, సీబీఎస్ఈ ఎఫిలియేటెడ్ స్కూల్స్ ప్రారంభించకుండా రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభించే అవకాశం లేకపోవచ్చు. గత విద్యాసంవత్సరాన్ని నెల రోజులు ముందుగానే ముగించాల్సి వచ్చింది. ఎకడమిక్ షెడ్యూల్ ప్రకారం జూన్ రెండో వారంలోనే పాఠశాలలు ప్రారంభించా ల్సి వుంది. ఆగస్టు 15 దాకా ఆగాలంటే రెండు నెలల కాలం విద్యార్థులు చదువుకోకుండా ఖాళీగా వుండాలంటే కష్టమే. అందువలన ఆన్లైన్లో విద్యాభ్యాసాన్ని నడి పించాలనే కొన్ని పాఠశాలల కృషిని తల్లిదండ్రులు సమర్థిస్తున్నారు. కాకపోతే అదనపు ఫీజుల భారం మోపవద్దని, గంటల తరబడి పిల్లలను వేధించవద్దని, ఆన్లైన్లో అభ్యసన ప్రక్రియ విద్యార్థులకు ఆనందంగా, ఆహ్లాదకరంగా వుండాలని కోరుకొంటు న్నారు. అయితే కొన్ని పాఠశాలలే ఆన్లైన్లో పాఠాలు చెబుతూ సిలబస్ కవర్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతుంటే కొంతమంది పేరెంట్స్ తమ పిల్లలను ఆ పాఠశాలల్లోనే చేర్చే అవకాశం వుంటుందని బడ్జెట్ స్కూళ్ల మేనేజర్లు ఆందోళన చెందుతున్నారు. అందువలన ఆన్లైన్ విద్యాబోధన ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలోనూ అమలు జరిగే విధానం కావాలని విద్యావేత్తలు కోరుతున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల అభివృద్ధి శాఖ కొంత ప్రయత్నం చేస్తోంది. ప్రాధమిక (1-8) తరగతులకు ఎన్సీఈఆర్టీ రూపొందించిన "ఆల్టెర్నేటివ్ ఎకడమిక్ కేలండర్" ని యిటీవల విడుదల చేసింది. సెకండరీ లెవెల్ క్లాసుల కేలండర్ కూడా రావాల్సి వుంది. ఆ కేలెండర్లను రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అనువుగా మలుచుకొని అమలు చేయాల్సి వుంటుంది. కేంద్ర విద్యాశాఖ ప్రకటించిన ప్రణాళికను మించి అతిగా వ్యవహరించే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం నియంత్రించాలి. రెండు నెలలు ఆలస్యంగా పాఠశాలలు ప్రారంభించాల్సి వున్నందున ఆ మేరకు 30% సిలబసును తగ్గించాలని సీబీఎస్ఈ నిర్ణయించింది. అయినా ఆగస్టుదాకా విద్యార్థులను ఖాళీగా వదిలేయకుండా సిలబసుకి తోడ్పడే కో-కరిక్యులర్ విషయాలను ఆన్లైన్ ద్వారా అందించే ఏర్పాటు చేయాలనీ, ఆ విషయాన్ని పేరెంట్స్ అంగీకారంతోనే అమలు చేయాలని చర్చిస్తోంది. కేంద్రీయ విద్యాలయాలు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నవి.
సమాచార సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో వున్నందున ఆన్లైన్ క్లాసుల నిర్వహణ అవసరమవుతోంది. అయితే అది ఖర్చుతో కూడిన పనే. పాఠశాలల్లో ఆన్లైన్ బోధనకు అవసరమైన సాధనాలు, సదుపాయాలు సమకూర్చుకోవాలి. అందుకోసమనే కొన్ని ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళు రూ 5-10 వేలు ఫీజులు వసూలు చేస్తున్నవి. పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్సుతో పాటు ట్యాబ్స్ అమ్ముతున్నవి. ఫీజు చెల్లించకపోయితే ఆన్లైన్ కనెక్షన్ యిచ్చేది లేదని బెదిరిస్తున్నవి. స్కూల్లో అమ్మే ట్యాబ్ కొనలేకపోయినా ఇంట్లో సిస్టం లేదా ల్యాప్ ట్యాప్ లేదా స్మార్ట్ ఫోన్ వుండాలి. ఇంట్లో పాఠశాల విద్యార్థులు ఇద్దరు వుంటే రెండేసి వుండాలి. హైస్పీడ్ ఇంటర్నెట్ కోసం వైఫై లేదా డేటా సదుపాయం కావాలి. ఆన్లైన్లో చెప్పే పాఠాలు స్పష్టంగా చూడాలంటే 50 ఎంబీపిఎస్ నెట్ వర్క్, 500 జీబీ సామర్ధ్యం గల స్మార్ట్ ఫోన్ వుండాలని సంబంధిత నిపుణులు చెబుతున్నారు. ఒక క్లాసుకి ఒక జీబీ చొప్పున రోజుకి ఎన్ని క్లాసులు చూస్తే అన్ని జీబీలు ఖర్చవుతుంటది. అలాంటి ఏర్పాట్లు చేసుకుని అదనపు ఖర్చు భరించినా ఆన్లైన్ క్లాసులతో బోధనాభ్యాసన అరకొరగానే వుండవచ్చు. పట్టణ ప్రాంతాల్లో 41% మరియు గ్రామీణ ప్రాంతాల్లో 12% మాత్రమే ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో వుంటుందన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమస్యలను అధిగమించి ఈ అసాధారణ పరిస్థితిలో అవసరమైన మేరకు విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుల నిర్వహణ అనివార్యం అవుతోంది.
ఎన్సీఈఆర్టీ, అజీమ్ ప్రేమ్ జీ లాంటి సంస్థలు సూచించినట్లుగా 3-5 తరగతుల విద్యార్థులకు వారానికి 4 గంటలు, 6-8 తరగతుల వారికి 7 గంటలు, 9-12 తరగతులకు 10 గంటలు సమయమే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. ఎల్కేజీ, యూకేజీ మరియు 1-2 తరగతుల పిల్లలకు ఆన్లైన్ క్లాసులను నిషేధించాలి. పాఠశాల సమయాల్లోనే ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలి. పాఠ్యపుస్తకాల్లోని పాఠాలకు తోడు జనరల్ నాలెడ్జి, లైఫ్ స్కిల్స్, మోరల్ వ్యాల్యూ ఎడ్యుకేషనుకి సంబంధించిన విషయాలు చెప్పాలి. ఆన్లైన్ పాఠాలు అందుబాటులో లేని వారికి రికార్డ్ చేసిన పాఠాలను వాట్సాప్ ద్వారా పంపించే ఏర్పాట్లు చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు లేదా ట్యాబులు మరియు అవసమైన డేటా కార్డులు ప్రభుత్వమే అందించాలి. ఆన్లైన్ క్లాసుల సమయంలో విద్యార్థులకు తోడ్పాటుగా తల్లి/తండ్రి/అన్న/ అక్క లేదా టీచర్ అందుబాటులో వుండాలి. జూలై నుండి అయినా ఆన్లైన్ క్లాసుల నిర్వహణకు విద్యాశాఖ పూనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మేలు జరుగుతుంది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలను ఎంహెచ్చార్డీ, సీబీఎస్ఈ చూసుకొంటుంది. కాగా సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఆన్లైన్ పాఠాలను నియంత్రించే పనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటే ఆయా పాఠశాలల విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు ఊరట లభించగలదు. ఏదేమైనా పాఠశాలలు ప్రారంభించే వరకు విద్యార్థులు ఎకడమిక్ విషయాలతో మమేకం కావడానికి ప్రభుత్వం, యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషి సమన్వయం పెరగాల్సిన అవసరం వున్నది. @
- నాగటి నారాయణ, ప్రముఖ విద్యావేత్త 9490300577
చైర్మన్, సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ స్టడీస్ (సిఈఎస్), హైద్రాబాద్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి